Friday, August 17, 2018

రాయల చరిత్రపై కొత్త వెలుగు


నేలటూరి వెంకట రమణయ్య, కె.ఎ.నీలకంఠశాస్త్రి అనుకొన్నట్లుగా 1509 ఆగస్టు 7 లేక 8వ తేదీ కాక, క్రీ.శ.1510 జనవరి 24న కృష్ణరాయలు పట్టాభిషిక్తుడైనాడని హంపీ, సింగనాయకనహళ్లి శాసనాలు నిరూపించాయి.
విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన ఇరవైయేండ్ల పాలనలో అరవయ్యేండ్ల అభివృద్ధిని అందించిన మహోన్నత పాలకుడు. ఆనాటివాడైనా ఈనాటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. ఆ మహా వీరుని పుట్టిన రోజు, పట్టాభిషిక్తుడైన రోజు, మరణించిన రోజు ఇదిఅని ఖచ్చితంగా చెప్పగల ఆధారాలు దొరక్కపోవటం మన దురదృష్టం.

తన పట్టాభిషేకానికి పూర్వం, అన్న వీరనరసింహ రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు అతనికి కృష్ణదేవరాయలు తోడ్పడినట్లు కొంగుదేశ రాజాక్కరన్‌ అన్న గ్రంథంలో ఉంది. కుమార ధూర్జటి రాసిన కృష్ణరాయ విజయంలో వీరనరసింహ రాయలు, శ్రీకృష్ణరాయనికి పట్టం కడతానని అప్పాజీతో అన్నట్లు చెప్పబడింది. స్థానాపతి రచించిన రాయవాచకంలో, వీరనరసింహ రాయలే శ్రీకృష్ణదేవరాయలకు పట్టాభిషేకం చేయమని ఆజ్ఞాపించాడని చెప్పబడింది. క్రీ.శ.1604లో రెండో వీర వెంకటపతి రాయలవారి ఆజ్ఞ మేరకు ఆయన అఠ్ఠవణీయ (దినచర్య) కర్తలు తయారుచేసిన విజయనగర సామ్రాజ్యమనే పాళ్యపట్టు కడితంలో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం క్రీ.శ. 1509 ఆగస్టు 7వ తేదీన మంగళవారం నాడు (శాలివాహన శకం 1432, శుక్ల సంవత్సరం, శ్రావణమాసం, శ్రీకృష్ణ జన్మాష్టమి) జరిగిందని పేర్కొనబడింది.

ఇది ఇలా ఉంటే, శాసనాల్లో మరోరకమైన సమాచారముంది. అవి చూసిన తరువాత, సాహిత్యాధారాలను తడిమిన తరువాత కృష్ణరాయని పట్టాభిషేకానికి సంబంధించిన తేదీల్లో వివాదాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ సందర్భంగా బళ్లారి జిల్లాలోని గుళ్యగ్రామ శాసనం, హంపీలోని విరూపాక్షాలయ శాసనం, సింగ్గెనాయకనహళ్లి శాసనం పొంతన కుదరని పట్టాభిషేక తేదీలను సూచిస్తున్న సంగతిని గుర్తుకు తెచ్చుకోవాలి. బళ్లారి జిల్లా గుళ్యశాసనం శాలివాహన శక సంవత్సరం 1431, శుక్ల, శ్రావణ శు.10 బృహస్పతివారం నాడు కృష్ణరాయల విజయనగర రత్న సింహాసనంపై కూర్చొని పాలిస్తున్నట్లు చెబుతుంది. దీని ప్రకారం ఆయన క్రీ.శ.1509 సంవత్సరం, జూలై 26వ తేదీ నాటికే పట్టాభిషిక్తుడై పాలిస్తున్నాడని చెప్పటానికి వీలు చిక్కింది.

అంతకు కొద్ది ముందువైన మరో రెండు శాసనాల్లో వీరనరసింహరాయలు విజయనగర సింహాసనంపై ఆసీనుడైనట్లు చెప్పబడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అవి, అనంతపురంజిల్లా తాడిపత్రి శాసనం, దక్షిణ ఆర్కాటు జిల్లా విక్రవాండి శాసనం. తాడిపత్రి శాసనంలో శా.శ. 1431 తరువాత, శుక్లనామ సంవత్సర వైశాఖ శు. 15 శుక్రవారం నాడు వీర నరసింహరాయలు విజయనగర సింహాసనం పై నుంచి పృథ్వీ సామ్రాజ్యమేలుతున్నట్లుగా ఉంది. ఈ తేది క్రీ.శ. 1509 మే 4వ తేదీకి సరిపోతుంది. అలాగే విక్రవాండి శాసనంలో విక్రమనామ సంవత్సర కర్కాటక శు. 5 శుక్రవారం, హస్తా నక్షత్రం నాడు వీర నరసింహరాయలు విజయనగరం నుంచి పాలిస్తున్నట్లు పేర్కొనబడింది. ఇది క్రీ.శ. 1509, జులై 22వ తేదీకి సరిపోతుంది.

కడప జిల్లాలోని పులివెందుల శాసనంలో శా.శ. 1431, శుక్ల సంవత్సర కార్తీక మాసమున కృష్ణరాయలు విజయనగర పృథివి రాజ్యము చేయుచున్నట్లుగా నమోదు చేయబడింది. ఇది క్రీ.శ. 1509 ఆగస్టు -సెప్టెంబరు నెలకు సరిపోతుంది. దీనివల్ల వీరనరసింహరాయలు, 1509 జూలై 22వ తేదీ వరకు విజయనగర సింహాసనంపై ఉన్నాడని తెలుస్తుంది. ఇద్దరికీ మధ్య తేడా కేవలం 4 రోజులు మాత్రమే. ఇదే విషయాన్ని నేలటూరి వెంకట రమణయ్య పరిశీలిస్తూ, కృష్ణదేవరాయలు క్రీ.శ. 1509 జూలై 22–-26 తేదీల మధ్య ఒకరోజు రాజ్యాధికారాన్ని చేపట్టాడని చెప్పాడు. ఇదే శ్రీకృష్ణదేవరాయని తొలి తెలుగు శాసనం.

దీనిని బట్టి శ్రీకృష్ణదేవరాయలు, క్రీ.శ. 1509, జూలై 26వ తేదీనాడు సింహాసనం మీద ఉన్నాడని బళ్లారి జిల్లా గుళ్య శాసనంలో ఉండగా, క్రీ.శ. 1509, ఆగస్టు నాటి పులివెందుల శాసనం ఆ విషయాన్ని రూఢిపరుస్తుంది. అయితే ఈ రెండు శాసనాల్లో కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్నట్లుంది గానీ, పట్టాభిషేక ప్రస్తావన లేదు. హంపీలోని విరూపాక్ష దేవాలయ రంగమండపం దగ్గరున్న శ్రీకృష్ణరాయని కన్నడ శాసనంలో తుళువ వంశ వివరాలే కాక ఆయన తన పట్టాభిషేకం జరిగిన నాడు, విరూపాక్ష దేవుని అమృతపడి నైవేద్యం కొరకు సింగనాయకనహళ్లి గ్రామంతో పాటు విరూపాక్ష దేవాలయ రంగమండప, గోపురాలను కూడా నిర్మించాడని చెప్పబడినది. ఈ శాసన తేదీ 1510 జనవరి 24 అవుతుంది. ఈ శాసనం ప్రముఖ చరిత్రకారులైన నేలటూరి వెంకట రమణయ్య, కె.ఎ.నీలకంఠశాస్త్రి అనుకొన్నట్లుగా క్రీ.శ. 1509 ఆగస్టు 7 లేక 8 వ తేదీ అన్న వాదనను సవరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. పైగా ఓరుగంటి రామచంద్రయ్య కూడా పట్టాభిషేకం తేదీ క్రీ.శ. 1510 జనవరి 24 గానే అంగీకరించాడు.

మరో విషయం ఏమిటంటే, హంపీకి దక్షిణంగా 4 కి.మీ. దూరంలో వున్న సింగనాయకనహళ్లిలోని కృష్ణరాయని మరో కన్నడ శాసనంలో కూడా రాయలు పట్టాభిషేకం చేసుకొన్న సందర్భంగా విరూపాక్ష దేవునికి అదే గ్రామాన్ని క్రీ.శ. 1510 జనవరి 24న దానం చేస్తున్నట్లు వివరాలు మేళవించబడినాయి. హంపీ విరూపాక్ష దేవాలయశాసనం, సింగనాయకనహళ్లి శాసనాలు రెండూ శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1510 జనవరి 24వ తేదీ తన పట్టాభిషేకం సందర్భంగా దానాలు చేసినట్లు పేర్కొంటున్నాయి. ఈ రెండు శాసనాలలో కృష్ణదేవరాయల పట్టాభిషేకం క్రీ.శ. 1509 జూలై ఆగస్టు నెలలో కాక క్రీ.శ. 1510 జనవరి 24న జరిగిందని కచ్చితంగా రుజువు చేస్తున్నందున, సాంప్రదాయ చారిత్రక నమోదు పద్ధతిలో రెండవ వేంకటపతి రాయల కోరిక మేరకు రాసిన విజయనగర సామ్రాజ్య వివరాల్లో పేర్కొన్న పాలనా ప్రారంభ తేదీ క్రీ.శ. 1509 ఆగస్టు 7వ తేదీని ప్రశ్నించడమే కాక కృష్ణరాయని పట్టాభిషేక సందర్భంగా క్రీ.శ. 1510 జనవరి 24వ తేదీన కొన్ని దానాలు ఇచ్చినట్లు తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని సి.యస్‌. పాటిల్‌తోపాటు డాక్టర్‌ డి.వి.దేవరాజ్‌ కూడా బలపరిచారు.

కర్ణాటకలోని విజయనగర శాసనాలను క్రోడీకరించిన బి.ఆర్‌.గోపాల్‌ కూడా ఈ రెండు శాసనాధారాలను విస్మరించటం బహుశా వారి దృష్టికి రాకపోవటమేనేమో. ఏది ఏమైనప్పటికీ వీరనరసింహరాయనికి పాలనా వ్యవహారాల్లో సహకరిస్తున్న కారణంగా అతని పేరున శాసనాలు విడుదలై వుండవచ్చు. నిజానికి హంపీ, సింగనాయకనహళ్లి శాసనాలు కృష్ణదేవరాయలు క్రీ.శ. 1510 జనవరి 24న పట్టాభిషిక్తుడైనాడని నిరూపిస్తూ, ఇంతవరకు ఈ విషయంగా పేర్కొన్న ఆధారాలను సవరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. అంతే కాక కొందరు చరిత్రకారులు పేర్కొంటున్నట్లుగా ఫిబ్రవరి 4వ తేదీ రాయలు పట్టాభిషిక్తుడైనాడన్న వాదన కూడా వివాదమైంది.

పైన పేర్కొన్న స్థానిక రికార్డులు, సాహిత్య శాననాధారాలను ఒక్కచోట ఉంచి పరిశీలించి చూస్తే, వీర నరసింహరాయని పాలనా వ్యవహారాలలో కృష్ణరాయలుకు 1508 జూలై చివరి వారం నుంచి ప్రత్యక్ష ప్రమేయమున్నా, రాయలే విడుదల చేసిన హంపీ, సింగనాయకనహళ్లి శాసనాలద్వారా అతడు క్రీ.శ. 1510 జనవరి 24వ తేదీన పట్టాభిషిక్తుడైనాడని తేదీల్లో వాదాలను, వివాదాలను పక్కన పెడుతూ నిజాన్ని నిరూపించాయి.

ఆంధ్రజ్యోతి 8-8-18
 డా. పెదారపు చెన్నారెడ్డి
 డా. ఈమని శివనాగిరెడ్డి - స్థపతి

Saturday, July 14, 2018

గండభేరుండ శాసనం ఆచూకీని కనుగొన్న తవ్వా ఓబుల్ రెడ్డి


శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో కడప జిల్లా చెన్నూరు వద్ద గల నాగనాధ స్వామి ఆలయం వద్ద  ఉదయగిరి సామంత పాలకుడు
జూపల్లి పెద సింగమ నాయుడు వేయించిన అరుదైన గండభేరుండ శాసనం ఆలనా పాలన లేక ఆలయ ప్రాంగణంలో పడి ఉంది. పది అడుగుల ఎత్తు గల రాతి స్తంభం పై ఈ శాసనాన్ని చెక్కారు. క్రీ.శ .1524 లో ఆ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసిన సందర్భంగా ఈ శాసనాన్ని వేశారు. శాసనం లోని అంశాలు మూడు వైపులా చెక్కబడి ఉన్నాయి. జూపల్లి రాజవంశీకుల వంశావళిని సంస్కృత శ్లోకాల రూపంలో ఈ రాతిపై చెక్కారు.ఆలయ జీర్ణోద్ధరణ సందర్భంగా ఆలయానికి మడులు మాన్యాలు సమర్పించిన దాతల వివరాలను కూడా ఈ శాసనంలో పొందుపరిచారు.ఈ శాసనంలో చెక్కబడిన రెండు తలల గండభేరుండ పక్షి నాలుగు హస్తాల్లో నాలుగు సింహాలను, రెండు పాదాల్లో రెండు ఏనుగులను పట్టుకుని బీభత్స రూపంలో ఉంది. గండభేరుండ పక్షి సింహాల తలలను రెండు నోళ్ళతో భక్షిస్తూ ఉంది. ఈ స్తంభానికి మరో పార్శ్వంలో పెద్దపులి, భైరవ ప్రతిమలను కూడా చెక్కారు.
****
**గతంలో చెన్నూరు గ్రామం ఈ ఆలయానికి సమీపంలో ఉత్తరదిశగా ఉండేదని, కాలక్రమంలో ఇక్కడికి
ఈశాన్యదిశలో పెన్నానది ఒడ్డున గ్రామం వేలిసిందని తెలుస్తోంది. ఆలయానికి ఉత్తరదిశలో ప్రజల ఆవాసానికి సంబంధించిన ఆధారాలు పెంకులు, కట్టడపు రాళ్ళ రూపంలో కనిపిస్తూ ఉంటాయని ఉప్పరపల్లె గ్రామప్రజలు తెలిపారు.
***
జూపల్లి రాజవంశీకులు శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామంతులు గా, ఉదయగిరి దుర్గ నాయంకరులుగా కడప జిల్లాలోని చెన్నూరు, పొట్లదుర్తి సీమలను కూడా పాలించారు.

Wednesday, July 11, 2018

శ్రీ కృష్ణదేవరాయల రూపును వెల్లడించే చిత్రపటం


సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల రూపును వెల్లడించే  చిత్రపటం భద్రంగా ఉంది. పోర్చుగీసు యాత్రీకుడు,చిత్రకారుడు డామింగో పేస్ 1520 సంవత్సరంలో ఈ చిత్రాన్ని గీశారు. రాయలను చిత్రించడానికి పేస్ కు 15 వారాల సమయం పట్టిందట! పూనే నగరం లోని భారతీయ “ఇతిహాస్ సంశోధన్ మండల్” లో ఉన్న ఈ చిత్రాన్ని హైదరాబాదుకు చెందిన ప్రముఖ చారిత్రక పరిశోధకుడు డాక్టర్ క్రిష్ణారావు కేశవ్ ఫోటో తీసి గతంలో వెలుగులోకి తెచ్చారు. శ్రీ కృష్ణదేవరాయల 500 వ పట్టాభిషేక వారోత్సవాలు జరుగుతున్న సందర్భంలో రాయల అసలు చిత్రం వెలుగు చూసింది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 26 మంది రాజుల్లో 1509 నుండి 1529 వరకు ఓటమి ఎరుగని చక్రవర్తిగా పాలన సాగించిన శ్రీ కృష్ణదేవరాయలు తన 49 వ ఏట కడుపుశూల వ్యాధికి గురై మరణించారని చరిత్ర చెబుతోంది.

Wednesday, August 27, 2014

పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయల 504 వ పట్త్టాభిషేక ఉత్సవాలు!

2014 ఆగస్ట్ 27,28 తేదీలలో పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయల 504 వ పట్త్టాభిషేక  ఉత్సవాల సందర్భంగా

Thursday, May 9, 2013

కృష్ణరాయలు-అస్తిత్వాల ప్రశ్నలు: -పాణి

రాజుల సంస్కృతి ప్రజలది అంటే చెల్లదు చెల్లదు చెల్లదులే .. అని ముప్పై ఏళ్ల కింద చెరబండరాజు అన్నాడు. సంస్కృతి, చరిత్ర అఖండం కావని, రాజరికపు సంస్కృతీ చరిత్రల కింద ప్రజల సంస్కృతి, జీవితం అణగారి పోయాయనే సత్య ప్రకటనే ఆ కవిత్వం. అందులో ఆయన రాళ్లకు పూవుల పరిమళం అంటదని కూడా అంటాడు. మట్టిలో పుట్టి పెరిగిన పూవుల గుబాళింపే నిజమైన చరిత్ర అర్థం. గత కాలంలోని ఉజ్వల ఘట్టాలు ఆధిపత్య వ్యవస్థలకు సంబంధించినవి అయినప్పుడు వాటిని విమర్శనాత్మకంగా చూడాలి.

లేకపోతే చరిత్ర పురోగామి స్వభావాన్ని విస్మరించినట్టే . రాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవాల్లో శ్రీకృష్ణదేవరాయలు నేటికీ మనకు ఆదర్శమని పాలకులు అనడం దురదృష్టకరమేమీకాదు. వారు అనవలసిన మాటే అన్నారు. ఐదు వందల ఏళ్ళకిందటి రాజు రాజరిక పాలన, ఆధునిక యుగం లో, ప్రజాస్వామ్యమని చెప్పుకుంటున్న సమాజంలో ఎట్లా ఆదర్శ ప్రాయమనే సందేహం మన పాలకులకు ఇసుమంత కూడా కలగదు. మన ప్రజాస్వామ్య స్వభావానికి అతికిన మాటే అది. అందువల్ల పాలకులు రాయల ఉత్సవాలు జరపడంలో అనౌచిత్యం ఏమీలేదు. అంతవరకే అయితే ప్రమాదం కూడా లేదు. ఇంకా చాలారకాల వాళ్లు వివిధ స్థాయిల్లో ఈ సంరంభంలో భాగమయ్యారు.

చరిత్రలో జనరంజక ఘట్టాలుగా బహుళ ప్రాచుర్యం పొందిన వాటిని పామరోచితంగా స్వీకరించడమేనా? అనే చరి త్ర సంబంధమైన ప్రశ్నను రాయల ఉత్సవాలు మరోసారి ముందుకు తెచ్చాయి.గత వైభవాల తలపోతకు చారిత్రక దృష్టి అవసరం లేదు. రాయల స్వర్ణయుగం అనే అయిదో తరగతి చరిత్ర పాఠం సరిపోతుంది. ఈనాటి పాలకుల దుర్మార్గాన్ని, ఇప్పటి సమాజ సంక్షోభాన్ని దగ్గరగా చూస్తుంటే ఆ రోజులే నయం అని ఎవరైనా అనుకోవచ్చు. ఆ రోజుల్లో ఏదో మానవాంశ ఉందనిపించవచ్చు.

అంతమత్రాన ఆధునిక యుగాని కంటే రాజరికం గొప్పదైౖ పోదు. ఎన్ని అవలక్షణాలున్నా ఆధునికత, ప్రజాసామ్యం రాజరికానికంటే చరిత్రలో ప్రగతిశీలమైన వి. అయిదే వందల ఏళ్లకింద ఓకానొకరాజు పట్టాభిషేకం తెలుగువారందరికి, తెలుగు జాతి లోని అన్ని ప్రాంతాలకు, అన్ని కులాలకు , వర్గాలకు ఎందుకు ఉత్సవం కావాలి?

రాయల ఉత్సవాలకు మూడు రకాల శక్తులు పూనుకున్నా యి. గతాన్ని ఆరాధించే సంప్రదాయ, తిరోగమన వాదులు; తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమకారులు; బలిజ కుల సంక్షేమ సంఘాల నాయకులు. ఈ మూడు బృందాల దృక్పథాలు, ప్రయోజనాలు ఒక్కటి కాదు. మొదటి బృందం పాత సమాజ అవశేషంగా వర్తమానంలో ఊపిరి తీస్తోంది. వాళ్ల భాష, వాద న, వ్యక్తీకరణ రక్తికట్టించలేని సోషల్ ఫాంటసీ. అయితే వీళ్లకు యింక ఆ చాలాకాలం ఈ నేల మీద చోటు ఉంటుంది.

అది వేరే కత. రెండో బృందంలోని వాళ్లు ఆధునికులు. ఆంగ్ల భాషా సామ్రాజ్యవాదం ముందు వెల వెలబోతున్న తల్లి భాషల పెనుగులాట వాళ్ల గొంతులో వినిపిస్తుంది. కానీ భాషలోని వైవిధ్యాన్ని, మాతృభాషా సంక్షోభాన్ని రాజకీయార్థిక పునాది మీద వివరించే పరికరాలేవీ వీళ్ల దగ్గర ఉండవు. ఎవరి మాతృభాష, ఏ కుల, ప్రాంత, వర్గాల మాతృభాష? అనే ప్రశ్నలు కీకారణ్యం గా తోచి, అక్కడి నుంచి తప్పించుకొని తాము స్వరపరచుకున్న గీతాన్నే మరింత దట్టించి ఆలపిస్తారు.

భాష సామాజిక ఉత్పత్తి అని తెలియదు కాబట్టి రాయలవారి భాషా సంస్కృతిక సేవ తలుచుకోగానే పులకాకింతులవుతారు. ఎవరి మాతృభాషా పరిరక్షణ ఉద్యమం ఇది అని దళితులో, తెలంగాణ వాళ్ళో ప్రశ్నిస్తే ఇబ్బంది పడిపోతారు. తమ ఉద్యమానికి చరిత్రలో ఒక బలమైన ఆలంబన కావాలి కాబట్టి సహజంగానే రాయలు స్ఫూర్తి ప్రదాత అయ్యాడు. ఈ ఉత్సవాల కంటే ముందు నుంచి భాషా పరిరక్షణ ఉద్యమం రాయల ప్రాభవాన్ని గానం చేస్తున్నది. అచ్చ తెనుగు మీద, మాండలికాల మీద వీళ్ల మక్కువను కాదనలేం, కానీ వీళ్ల మాతృభాషా హృదయాన్ని 'ప్రామాణికం' అనే రూపంలో సంప్రదాయం ఆవరించి ఉంది.

మూడో బృందం - స్వీయ అస్తిత్వం కోసం వెతుకుతున్న బలిజ కులస్తులు. తమ కులంలోని ఒక ప్రభావశీల వ్యక్తితో తమ సామాజిక పరంపరను ప్రతీకాత్మకంగా మలుచుకోవడం అస్తిత్వ స్పృహలో భాగం. ఒక సామాజిక బృందం తనను తాను ఎలా చూసుకుంటుంది, ఇతరులు ఆ బృందాన్ని ఎలా చూస్తారనేది అస్తిత్వానికి సంబంధించిన ముఖ్యమైన అంశం.

తమ కులం నుంచి రాజరికంలోకి ప్రవేశించిన వ్యక్తిగా బలిజ కులస్తులకు రాయలు అస్తిత్వ ప్రతీక అయ్యాడు. ఆ కులానికి అనేక సామాజిక అనుభవాలు, ప్రత్యేకతలు ఉన్నాయి గదా? ఒక రాజు ఎందుకు ప్రతీక కావాలని అంటే వాళ్లు వింటారని నమ్మకమేం లేదు. అయితే సాహు మహరాజ్‌తో పోల్చితే రాయల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం ఉండదు. యాదవుల కయితే పౌరాణిక పాత్ర అయిన శ్రీకృష్ణుడు కుల ప్రతీక అయ్యాడు. స్వీయ అస్తిత్వానికి బైట పుట్టిన వాళ్లు ఏ మాటయినా చెప్తే శంకించడం, దురుద్దేశ్యాలున్నాయనడం అస్తిత్వ చైతన్యంలో అంతర్నిహితం.

ఈ మూడింటితో పాటు రాయలసీమ అస్తిత్వ స్నృహ కూడా రాయల వేడుకల్లో ఉన్నట్టుంది. ఆ ప్రాంతం వాళ్లు రాయలతో ఐడెంటిఫై కావడానికి రాయలసీమ అనే మాటే చాలు, రెండో మాట అక్కర్లేదు. రేప్పొద్దున ఆ ప్రాంత అస్తిత్వ స్పృహ నిలదొక్కుకుంటే అందులో రాయలవారు స్థిరపడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణలో ఇది చూస్తునే ఉన్నాం. తెలంగాణ వాదులు తమ ఉజ్వలమైన సంప్రదాయాలను, ప్రత్యేకతలను పునర్నిర్మించే పనిలో పనిగా నిజాం నవాబుకు కూడా సముచితస్థానం ఇచ్చేశారు. కోస్తాంధ్ర వలసవాదులతో వాళ్లు- మీ విక్టోరియా మహారాణి, మా నిజం నవాబు అని సంవాదం చేశారు.

రాయల ఉత్సవాల సందర్భం గా చారిత్రక దృక్పథం, భాషా సాహిత్య విషయాలు, అస్తిత్వ స్పృహ మొదలైనవి మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. చరిత్ర గురించి పిట్టకథలు ప్రచా రం కావడం కూడా చరిత్ర ప్రాబల్యాన్ని, వర్తమాన ప్రజలకు గతం తో ఉండే పేగు బంధాన్ని సూచిస్తుంది. చరిత్ర అనే సామాజిక శాస్త్రం పట్టుబడని సమాజంలో పౌరాణికాలు, పిట్టకథలే చలామణిలో ఉంటాయి. రాయలనాటి వైభవం అంతఃపుర వైభవమా? ప్రజా వైభవమా? అనే ప్రశ్న చారిత్రక దృష్టికి సంబంధించింది.

విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర మినహా మెట్ట వ్యవసాయం కింద నిర్మాణమైంది. కనీసం తెలుగు ప్రాంతం వరకైనా, అప్పుడు రత్నాలు రాసులు పోసి అమ్మినారనే గాథ వెనుక ఏ ముందో తెలుస్తుంది. మెట్ట ప్రాంతంలో రాజరికాన్ని నిలబెట్టుకోవడానికి ఏమి చేయాలో రాయలకు బాగా తెలుసని చెప్పవచ్చు. దీనికి ఆయన చేపట్టిన నీటి పారుదల పద్ధతులు మంచి ఉదాహరణ.

బహుశా రాజులు, సంస్థానాధీసు లు చాలావరకు ఇలాంటి పద్ధతులు పాటించిన వాళ్లే. వీటి అమలులో రాజుల ఉద్దేశ్యాలే గాక ప్రజల పరంపరాగత జ్ఞానం కూడా ఉన్నది. రాయల ప్రాభవం గురించి కథనాలున్నట్టే ప్రజా జీవితం దుర్భరంగా ఉండేదనడానికి చాలా ఆధారాలున్నాయి. రాజరిక వ్యవస్థకు భిన్నంగా రాయల సామ్రా జ్యం మాత్రం ఎట్లా ఉండి ఉంటుంది? రాయలు ఒక ఆధిపత్య వ్యవస్థకు మేటి ప్రతినిధి. విజయనగర సామ్రాజ్యం కింద ఉన్న భూభాగంలో నిత్య యుద్ధాలతో పాటు సుస్థిర పాలన కొనసాగింది కృష్ణ రాయల కాలంలోనే. పల్లెల నుంచి సంపద కొల్లగొట్టకుండా సుస్థిర పాలన, పటిష్టమైన సామ్రాజ్య విస్తరణ, నిర్మా ణం సాధ్యం కాదు.

రాయల భాషాభిమానం అంతఃపుర సంప్రదాయానికి చెందినది. ఇది రాజరిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. అంతకంటే భిన్నంగా ఉంటుందనుకోవడం చరిత్ర పట్ల అమాయకమైన ప్రేమే. రాయల భాషా సేవ ప్రాతిపదిక మీద ఆయనతో తెలుగు ప్రజలందరి మమేకత సాధించాలనుకోవడం చారిత్రక దృక్పథం అనిపించుకోదు.

కన్నడరాయుడుగా పేరు పొందన రాయలను తెలుగు రాజుగా చూపడానికి చేస్తున్న ప్రయత్నాలలో జాతి ప్రాతిపదిక ఉన్నది. ఆయన తెలుగువాడు అవునా కాదా అనే చర్చలోకి పోవడం లేదు గాని, జాతి భావనను రాజుల ఆధారంగా కూడా నిర్మిద్దామనే ప్రయత్న మది. మాతృభాషా ఉద్యమానికి పాల్కుర్కి సోమనాథుడు, వేమన , వీర బ్రహ్మం స్ఫూర్తి అవుతారు కాని రాయలు కాడు. రాయలసీమ అస్తిత్వానికి కూడా ఆధిపత్య వ్యవస్థ ప్రతినిధి అయిన రాÄలు ప్రతీక కాజాలడు.

అస్తిత్వ భూమిక మీదికి వెళ్లాక చరిత్ర గురించిన వాస్తవిక దృష్టి కొరవడుతుందని రాయలచుట్టూ తిరుగుతున్న తెలుగు ఆలోచనా పరులు రుజు వు చేస్తున్నారు. ఎవరి మాతృభాష? ఎవరి సాహిత్యం? అని ప్రశ్నించిన అస్తిత్వ చైతన్యంలోకి రాజరికం-ప్రజలు మౌలిక విభజన విస్మరణకు గురైందని చెప్పక తప్పదు. రాజరికం ఒక రాజకీయార్థిక సాంఘిక వ్యవస్థ అనే విషయాన్ని పక్కన బెట్టి జాతి సాంఘిక అస్తిత్వం , భాషా సంస్కృతుల తలపోత ఇది. 'తెలుగు భాషలెస్స' అన్నాడు కాబట్టి రాయలు తెలుగు భాషా సాహిత్య వికాసానికి , బలిజ కులంలో పుట్టాడు కాబట్టి ఆ కులస్తులకు, రాయల పాలనలో ఉన్న భూ భాగం కాబట్టి రాయలసీమ వాళ్లకు ప్రతీక కావడం దీని వల్లనే.
-పాణి(Andhra jyothy: 21 july 2010)

Tuesday, April 16, 2013

తెలుగు భాషోద్దారకుడు శ్రీ కృష్ణదేవరాయలు !

శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది పట్టాభిషే కోత్సవం కర్ణాటకలోని బళ్ళారి జిల్లా 'హంపి'లో 2010 జనవరి 27, 28, 29 తేదీల్లో 'హంపీ మహోత్సవ్‌' పేర కర్ణాటక ప్రభుత్వం ఎంతో డబ్బు ఖర్చుచేసి మహా వైభవంగా నిర్వహించింది. ఆ సందర్భంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన ఆనాటి సమాచార వివరణలో ప్రొ|| ఎం.ఎం.కల్‌బురిగి ప్రసంగంలోని మాటలు అందరినీ ఆకర్షించాయి. కల్‌బురిగి గారు హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయం మాజీ కులపతులు; పండితులు; విమర్శకులు. వారు ఆంగ్లంలో వివరించిన మాటలు గమనించదగ్గవి. 'విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు (శ్రీకృష్ణదేవరాయలు) వాస్తవానికి కన్నడ సంస్కృతి అంటే అభిమానమున్న వాడేనా, పోషించినవాడేనా అని ఆలోచించాలి. ప్రస్తుతం కర్ణాటకలో శ్రీకృష్ణదేవరాయలు కన్నడ సంస్కృతికి అత్యుత్సాహం చూపలేదని భావించే కన్నడ పరిశోధకులు, కన్నడ చారిత్రకవేత్తలు చాలామందే ఉన్నారు. అంతేగాక శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక ప్రాంతంలో వలసదారులు చొరబడటానికి పాక్షికంగా బాధ్యుడు'.
'కన్నడ భాషాభ్యున్నతికి శ్రీకృష్ణదేవరాయులు ఏ మాత్రం కృషి చేయలేదు. శూన్యం. ఆయనను కన్నడ వ్యతిరేకి అనడానికి నేనుమాత్రం సందేహించడం లేదు. ఒక రకంగా మా భాషను (కన్నడం) తొక్కిపె ట్టాడు. తన ఆస్థానంలో తెలుగు కవులను పోషిం చాడు. అంతేగాదు, దీనికితోడు తమిళులను ప్రోత్స హించాడు. ప్రస్తుతం బెంగళూరులో ప్రముఖ స్థానా ల్లో తమిళులు జీవిస్తున్నారంటే, దీనికంతటికీ శ్రీకృష్ణ దేవరాయలే కారణం' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతేగాదు ప్రొ|| కల్‌బురిగి కన్నడ భాషలో 'కృష్ణదేవరాయ తెలుగు సంస్కృతియ ఆక్రమణ' (కృష్ణదేవరాయల తెలుగు సంస్కృతి ఆక్రమణ) అనే పేరుతో రచించిన వ్యాసంలో శ్రీకృష్ణదేవరాయులు తెలుగువాడు కాబట్టి తెలుగు భాషా సాహిత్య సంస్కృతులకిచ్చినంత ప్రాధాన్యం కన్నడ భాషా సాహిత్యాల కివ్వలేదని చాలా ఆవేదన వ్యక్తం చేశారు. 'శ్రీకృష్ణ దేవరాయలు స్వంతంగా ఆముక్తమాల్యద కావ్యాన్ని తెలుగులో రచించాడు. అష్టదిగ్గజాలనే పేరుతో తెలుగులో ఎనిమిదిమంది ప్రసిద్ధ కవులకు ఆశ్రయమిచ్చాడు. అల్లసాని పెద్దనకవికి 'ఆంధ్ర కవిపితామహుడు' అన్న బిరుదుతో సత్కరించి, తమ చేతులతో ఆ కాలికి గండపెండేరం తొడిగి, ఆ కవి పల్లకిని తాను మోసి ప్రసిద్ధికెక్కాడు. తెలుగు సాహిత్య చరిత్రలో కృష్ణదేవరాయల యుగం 'స్వర్ణయుగంగా నిర్మించి తెలుగు భాష, సాహిత్యాలకు కర్ణాటకలో ప్రాధాన్య మిచ్చి ప్రసిద్ధి తెచ్చాడు. రాయలు కన్నడ రాజయినప్పటికీ 'ఆంధ్రభోజుడు'గా కీర్తింపబడ్డాడు. పై పెచ్చు 'దేశభాషలందు తెలుగు లెస్స' అని చాటాడు. తెలుగుభాష తరువాత ఆయనకు ప్రీతిపాత్రమైనది, పోషించింది 'సంస్కృతం'. స్వంతంగా తానే 'జాంబవతీపరిణయము' అనే పేరు తో సంస్కృతంలో నాటకం రచించాడు. సంస్కృతం లో అనేక గ్రంథ రచనకు అవకాశం కల్పించాడు. కాగా ఇతర భాషా సాహిత్యాల వైభవాలనడుమ గుడ్డిలో మెల్లగా చమత్కారంగా తిమ్మణ్ణ (కన్నడకవి) నుంచి ఒకే ఒక కన్నడ కావ్యం 'దత్తరార్ధ మహా భారతం' స్వీకరించాడు. బహుశా ఈ 'తిమ్మణ్ణ' పేరు వింటే తెలుగు మాతృభాషగా గలవాడై ఉంటాడని పిస్తుంది. మొత్తంమీద కృష్ణదేవ రాయల రాజ్యకాలం లో కన్నడ భాషా సాహిత్యాలకు ప్రోత్సాహం లేదనే చెప్పవలసి ఉంది'.
'తులనాత్మకంగా పరిశీలించి చెప్పాలంటే ఈ కర్ణాటక చక్రవర్తి కన్నడ దేశంలోని దేవతలకంటే తెలుగునాడులోని దేవతలకు ఎక్కువ తీర్ధయాత్రలు చేసినట్లు తెలుస్తుంది. కొన్ని దేవాలయాలకు ఒక్కొక్క సారి తీర్థయాత్ర చేసినా, తిరుపతికి మాత్రం ఏడు పర్యాయాలు తీర్ధయాత్ర చేసినతీరు గమనార్హం.'
'వాస్తవస్థితి ఏమంటే కృష్ణదేవరాయలు కర్ణాటక సంస్కృతికి మిక్కిలి హాని చేసినవాడుగా కనిపిస్తాడు. ఇప్పుడు దానికి సంబంధించి సత్యాలను శోధించ వలసిన అవసరముంది'.
'కృష్ణదేవరాయలు కన్నడ విరోధాన్ని ప్రారంభిం చాడు. తెలుగు పరోపకారమనే దుష్టపరిణామానికి తెరతీశాడు. కర్ణాటకలోని బళ్ళారి, రాయచూరు, కొప్పళ జిల్లాలు తెలుగువారి వశమయ్యాయి. వ్యాపారం, రాజకీయం మొ||నవి ఆ తెలుగువారి చేతుల్లోకి పోయాయి. ఇంతేగాక తుంగభద్రానది ఆనకట్ట సిద్ధమయ్యేసరికి తెలుగువారు కన్నడిగుల అపార భూములను కొన్నారు. ఒక అర్థంలో వారు కొన్నది పొలం కాదు. భూమి కొన్నారు. ఈ మూడు జిల్లాల్లో రాజకీయంగా శాసనసభ మొదలుకొని మండల పంచాయితీ, తాలూకా పంచాయితీలలో అధ్యక్షత వహించి, తెలుగువాళ్ళే ఏలుతున్నారు. కర్ణాటక దేవుడైన విరూపాక్ష దేవుని ఆచార్యత్వంలో తెలుగువారే ముందున్నారు. వీటన్నింటిలోను శ్రీకృష్ణదేవరాయలు తెలుగువారికిచ్చిన అవకాశాల్లో మూలాలున్నాయి'.
ఇలాగే ఇంకా శోధిస్తే అనేకాంశాలు తెలుస్తా యని పేర్కొన్నారు ప్రొ|| కల్‌బురిగి గారు.
ప్రొ|| కల్‌బురిగి ఆవేదనతో పేర్కొన్న మాటలలో ఎంతవరకు సత్యముందో కొందరు ఇతర కన్నడ సాహితీవేత్తల, చరిత్రకారుల మాటలను గమనిస్తే మనకు స్పష్టమవుతుంది. రాయలు ఎక్కడివారు? సొంతభాష ఏది? రాజభాష ఏది? అనే అంశాలను పరిశీలించవలసి ఉంది.
డా|| సూర్యనాధకామత్‌ తుళువంశ మూలాల్ని వివరిస్తూ తుళువంశ సంభూతులుగా వీరిని యాదవులుగా పేర్కొన్నారు. తుళునాడు నుంచి వచ్చారని కూడా చెప్పారు.
ప్రసిద్ధ చరిత్రకారులు మారేమండ రామారావు కూడా 'కృష్ణదేవరాయ' అనే ఆంగ్ల గ్రంథంలో ఈ అంశాల్నే పేర్కాన్నారు. ఇంకా డా|| చా.రా.గోపాల్‌ సైతం ఈ అంశాన్ని స్థిరీకరించారు. 8 తుళువంశ సంజాతులనీ, వారు యాదవులనీ నిర్ణయం. ఈ విషయాలనే రాయలు ఆముక్తమాల్యదలోను, అల్లసాని పెద్దన మనుచరిత్రలోను, నంది తిమ్మన పారిజాతాపహరణంలోను తుర్వసువంశీయులని ప్రశంసించారు. కాగా నంది తిమ్మన కృష్ణదేవరాయలు రిష్ష్వంశ సంభూతుడు శ్రీకృష్ణ దేవరాయలు కృష్ణునిలా యాదవంశంలో జన్మించినట్లు స్పష్టం చేశారు.
'నాడు నేడును యాదవాన్యాయమునందు
జననమందెను, వసుదేవ మనుజవిభుని
కృష్ణుడను పేర నరసేంద్రు కృష్ణదేవ
రాయడనుపేరనాది నారావియన్నుండు.'(పు.12)
శ్రీకృష్ణదేవరాయల భాష కన్నడం. కానీ రాజభాష మాత్రం తెలుగు. ఈ విషయాన్ని కన్నడ సాహితీవేత్తలే పేర్కొన్నారు.
'ఈ చక్రాధిపత్యద రాజధాని విజయనగరం ఇల్లిన ప్రసిద్ధ అరస కృష్ణదేవరాయ. ఆతన ఆస్థానదల్లి అదను తెలుగు, ఆస్థానవల్లి అనేక భాషగళన్ను మాతనాడుత్తిద్దరు. ఆతన సహజ వాద భాషె కన్నడ' 'ఈ సార్వభౌముని రాజధాని విజయనగరం. ఇందు ప్రసిద్ద రాజు శ్రీకృష్ణదేవరాయలు. రాయల ఆస్థానం లోని భాష తెలుగు. ఆస్థానంలో అనేక భాషలు మాటలాడుతూ ఉంటారు. అయినా అతని సహజ మైన భాష కన్నడం కాబట్టి రాయలు అభిమానించే ఆస్థానంలోని అధికారభాష తెలుగు. తన మాతృభాష కన్నడం. అలాంటి కన్నడ రాయడు తెలుగును రాజభాష చేసుకోవడం విశేషం. 'దేశభాషలందు తెలుగులెస్స' గనుక.
తెలుగును అధికార భాషగా చేసుకొన్న ఘనత రాయలవారిది. ఈ విషయాన్ని శ్రీనిడదవోలు వెంకటరావు స్థిరీకరించారు. 'తెలుగు అధికార భాష: నేడాంధ్ర రాష్ట్రమున తెలుగును అధికార భాషగా చేయు ప్రయత్నములు సాగుచున్నవి. కానీ ఇప్పటికి నాలుగు వందల యేండ్ల క్రిందటనే కృష్ణదేవరాయలు, తెలుగును అధికార భాషగా చేసినాడు' అధికార భాషగా తెలుగు చేయడమేగాక 'దేశభాషలందు తెలుగులెస్స' అని చాటినది రాయలే. తెలుగు, కన్నడ, తమిళ భాషల రాజులు తమ సభలోనుండగా, రాయలు తెలుగు భాషలోనే ప్రసంగించెను. తెలుగు భాష (రాజకీయాధికార భాష)లోనే మాట్లాడెనని సిద్ధాంతము. తెలుగును మొదట అధికార భాషగా చేసిన కీర్తి ఆయనకే దక్కినది'.
కాగా రాయలు తెలుగు కవి పండితులను మాత్రమే పోషించాడనీ, రాయలు తెలుగు సంస్కృతికి మాత్రమే వారసుడని ప్రొ|| కల్‌బురిగి పేర్కొని ఆవేదనను ప్రకటించినప్పటికీ అది వాస్తవం కాదని భావించవలసి ఉంది.
శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. సంస్కృతంలోనేగాక తెలుగులో 'ఆముక్తమాల్యద' మహాప్రబంధకర్త. అష్టదిగ్గజ కవుల పోషకుడు. ఇంతేగాదు కన్నడకవి 'తిమ్మణ్ణ' రచించిన 'భారత కథామంజరి' కన్నడ కావ్యాన్ని అంకితం పుచ్చుకొన్నారు. కన్నడ భాషలో దాస సాహిత్యానికి మూల పురుషుడైన వ్యాస రాయలు రాయల రాజగురువు వ్యాసరామ మఠంలో పురంచరదాసు, కనకదాసాది కన్నడ కీర్తనకారులు రాయల పోషణలోని వారే. ఆంధ్ర దేవాలయాలతో పాటు కన్నడ దేవాలయాలను దర్శించి కానుకలర్పించిన మహా ధార్మికుడు. ఈ వివరణతో ప్రొ|| కల్‌బురిగి ఆవేదన పరాస్తమవుతుంది.
శ్రీకృష్ణదేవరాయులు తుళువంశ సంభూతుడు. కన్నడం తన భాష. కానీ రాయల తల్లి నాగలాంబ. తెలుగు వనిత. తల్లి భాష తెలుగు. తెలుగుతోపాటు ఆనాటి దక్షిణదేశ స్థితినిబట్టి కన్నడం, తమిళభాషలను పోషించిన మహనీయుడు. చిత్రశిల్ప కళలను, సంగీతములను సమంగా పోషించిన కళాప్రియుడు. దేవాలయ నిర్మాణంలో అతనికతనే సాటి. అన్ని యుద్ధాలలోను విజేత. భారత జాతీయ సమైక్యాన్ని, లౌకికవాదాన్ని ఆదరించి, శ్రేయోరాజ్యాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి- కాదు- శక్తి. ఆ మహనీయుని పంచశతాబ్ది పట్టాభిషేకోత్సవాలు ప్రజలకు స్ఫూర్తిదాయకం. పై పెచ్చు తెలుగు భాషకు ఆనాడే ఎంతో ప్రాధాన్య మిచ్చిన తెలుగు భాషా ప్రియుడు, పోషకుడు.
'తెలుగ దేలయన్న దేశంబు తెలు, గేను
తెలుగు వల్ల భుండ, తెలుగొకండ
ఎల్లనృపులుగొలువ నెరుగనేబాసాడి ,
దేశభాషలందు తెలుగులెస్స'.
- ఆచార్య ఎస్‌.గంగప్ప

Sunday, January 30, 2011

వందలాది కోట్లతో ఉద్యానవనం (థీమ్‌పార్కు) :హంపిలో నిత్యోత్సవాలు

హంపిలో ప్రదర్శించిన భువనవిజయం నాటకం   
హంపి : ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపి ఉత్సవాలు కర్ణాటక, భారత దేశ జనోత్సవాలకే పరిమితం కాకుండా ప్రపంచోత్సవాలుగా వెలుగొందాలని బీజేపీ జాతీయ నేత, లోక్‌సభ సభ్యులు అనంత్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి హంపి ఉత్సవాల ముగింపు (2011) కార్యక్రమంలో ప్రసంగించారు. హంపిలో నిత్యోత్సవాలుగా ఉండే విధంగా రూ. వందలాది కోట్లతో ఉద్యానవనం (థీమ్‌పార్కు) ఏర్పాటు చేస్తామన్నారు. అమెరికా డిస్నీల్యాండ్ మాదిరిగానే ఉద్యానవనం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఉద్యానవనం ప్రపంచ పర్యాటకులకు ఆకర్షణీయంగా తిలకించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఉద్యానవనాన్ని వచ్చే ఏడాదికి ప్రారంభిస్తామని తెలిపారు. ప్రపంచంలో ఉక్కు రాజధాని చైనా దేశంలో బీజింగ్ ఉందని, అదే బీజింగ్ తరహాలో బళ్లారిలో స్టీల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి బళ్లారిని మరో బీజింగ్‌గా మారుతుందనడంతో ఎలాంటి సందేహమూ లేదని అన్నారు. దేశంలో ప్రతి భారతీయుడు గర్వించదగిన హంపిలో శ్రీకృష్ణదేవరాయల పాలన ప్రపంచ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు, బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, బళ్లారి ఎంపీ శాంత, ఎమ్మెల్యేలు నాగేంద్ర, సురేష్‌బాబు, నేమిరాజ్‌నాయక్, చంద్రానాయక్, జిల్లా అధికారి శివప్ప, ఎస్‌పీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు అనంత్‌కుమార్ హంపీలోని శ్రీవిరుపాక్షేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
హంపి పురవీధుల్లో కన్నుల పండువగా  ముగింపు ఉత్సవాలు  
శ్రీకృష్ణదేవ రాయల పేరు వింటేనే తమ తండ్రి కన్నడ కంఠీరవ దివంగత డాక్టర్ రాజ్‌కుమార్ గుర్తువస్తారని ప్రముఖ కన్నడ సినీ నటుడు, పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అన్నారు. శనివారం రాత్రి ఆయన హంపి ఉత్సవ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. హంపి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇలాంటి అత్యంత అద్భుతమైన శిల ్పకళా నైపుణ్యత కలిగిన ప్రాంతంలో తన సినిమా షూటింగ్ చేయాలని కోరిక ఉందన్నారు. త్వరలో ఇక్కడ సినిమా తీసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. 
ఆకట్టుకున్న రాతి గుండు ఎత్తే పోటీలు
హంపి ఉత్సవాల సందర్భంగా కడ్డిరాపురం కుస్తీ అకాడమిలో యువజన సేవ, క్రీడా శాఖ కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాతి గుండు ఎత్తే పోటీలు ఆకట్టుకున్నాయి. 135 కేజీల నుంచి 155, 175 కేజీల బరువు గల రాతిగుండ్లు ఎత్తే పోటీలను నిర్వహించారు. 155 కేజీల రాతి గుం డును సుమారు 6.81 నిమిషాల్లో హొస్పేటకు చెందిన క టగి శివప్ప తేలి కగా ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచాడు. రెండవ స్థానంలో ఇబ్రహింసాబ్ 9.42 నిమిషాల్లో ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు. కూడ్లిగికి చెందిన అబూబ్ అక్తర్ 14.2 నిమిషాల్లో 135 కేజీల బరువును ఎత్తి తృతీయ స్థానంలో నిలిచాడు. వివిధ తాలూకాల నుంచి వచ్చిన ఆరు మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. యువజన సేవ, క్రీడాకార్యాలయ కార్యదర్శి అయ్యార్ పెరుమాల్, అసిస్టెంట్ డెరైక్టర్ రాజు చావలే, తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి బాలస్వామి దే శప్ప పాల్గొన్నారు.
అలరించిన సంగీత, నృత్య ప్రదర్శనలు
హంపిలో సందర్శకులను ఆకట్టుకున్న జానపదవేషాలు
ఉత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీకృష్ణదేవరాయ ప్రధాన వేదికపై నిర్వహించిన సంగీత, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి నిర్వహించిన సంగీత కార్యక్రమంలో చెన్నైకి చెందిన సంగీత దర్శకులు శివమణి బృందం నిర్వహించిన కార్యక్రమం ప్రేక్షకులను ఆనందంలో ముంచింది. ఢిల్లీకి చెందిన శ్రీమతి శైలుజిందాల్ నిర్వహించిన కూచిపూడి నృత్యం వేదికపై మరింత ఆకర్షణీయంగా నిలిచింది. శ్రీలంక, మంగోలియా, రువాండా తదితర విదేశీ కళాకారులు నిర్వహించిన విదేశీ జానపద సంప్రదాయక నృత్యాలకు ప్రేక్షకుల నుంచి ఈలలు, చప్పట్లు, హర్షధ్వానాలు మిన్నంటాయి.
ఉత్సవాల సందర్భంగా మూడో రోజు శనివారం కమలాపురం చెరువులో బోటింగ్ క్రీడా పోటీలను నిర్వహించారు. పెడల్ బోట్, మోటర్ బోట్, రోయింగ్ బోట్, క్యూరాకిల్ కెనోయింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. బోటింగ్‌లో శిక్షణ పొందిన వందలాది మంది యువతీ యువకులు పాల్గొన్నారు. నోపాసన సంస్థ నిర్దేశకులు షకీబ్ బోటింగ్ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు

Saturday, January 29, 2011

హంపి ఉత్సవాలలో ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

శ్రీ కృష్ణదేవరాయల తపాళా బిళ్ళను ఆవిష్కరిస్తున్న సి.ఎం.యడ్యూరప్ప    
హంపి (28/01/11): హంపి ఉత్సవాలలో శుక్రవారం సాయంత్రం కడ్డిరాపురం వద్ద హిందూ కేసరి సాంబముత్కల్ అఖాడ మైదానంలో ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి సుమారు 50కి పైగా కుస్తీ జట్లు పోటీలలో పాల్గొన్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈఏడాది కూడా పురుషులకు, మహిళలకు కుస్తీ పోటీలను నిర్వహించారు. పురుషుల తొలి జట్టులో హొస్పేట నగరం మరియమ్మనహళ్లి గ్రామానికి చెందిన సైఫుల్లా, హొస్పేట నగరానికి చెందిన ప్రభుల మధ్య గట్టి పోటీ జరిగింది. మహిళల విభాగంలో ఢిల్లీకి చెందిన మహిళ కమలేష్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన బెల్గాం నివాసి శ్రీలత పాటిల్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. శ్రీలత పాటిల్‌ను కమలేష్ మట్టి కరిపించి హంపి కుమార అనే వెండి గదను కైవసం చేసుకుంది. ఇంతకు మునుపు కమలేష్ అంతర్జాతీయ స్థాయిలో ఎనిమిది సార్లు అవార్డులను దక్కించుకుంది.
హంపి ఉత్సవాల్లో అలరించిన కుస్తీ పోటీలు
గత ఏడాది కూడా కర్ణాటక ప్రభుత్వం ఈమెకు ఏకలవ్య అవార్డును అందజేసింది. కుస్తీ పోటీలను జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ప్రారంభించగా, హొస్పేట ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, కోలారు ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్, సినీనటుడు సాయికుమార్, ఎంపీ శాంత, ఎమ్మెల్సీ మృత్యుంజయ జినగా తదితరులు పాల్గొని తిలకించారు. కుస్తీ పోటీల సందర్భంగా మైదానం పరిసరాలు వేలాది మంది ప్రేక్షకులతో కిక్కిరిసింది.
అలమారి జాతుల వారు అన్ని రంగాల్లో రాణించాలి
 భారత దేశ చరిత్రలో పురాణ ఇతిహాసాలు కథల రూపంలో సమాజానికి అందించే అలమారి జాతుల వారు సామాజిక, ఆర్థిక విద్య, కళా రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి శ్రీరాములు చెప్పారు. శుక్రవారం విరుపాక్షేశ్వర దేవస్థానం ప్రాంగణంలో పుట్టరాజ గవాయి వేదికపై అలమారి (సంచార జాతుల) కళా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ, అలమారి జాతులు నివాసానికి ఒక ప్రాంతం అంటూ లేదని,అటవీ ప్రాంతంలో నివాసం ఉంటూ సమాజంలోని వివిధ చోట్ల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని వంశపార్యంపరంగా వచ్చిన వృత్తులను కొనసాగిస్తూ కొందరు జానపద కళలను ప్రజలకు ప్రదర్శనలు ఇచ్చి జీవనోపాధి నింపుకుంటున్నారు.
అలమారి జాతుల వారికి కళా ప్రదర్శన హంపి విరుపాక్ష స్వామి దేవస్థానం ప్రాంగణంలో వేదికను ఏర్పాటు చేయడంతో ఆ జాతుల కళా ప్రదర్శన ప్రజలకు ఇంపుగా ప్రజలకు ఇంపుగా నిలిచాయని అన్నారు. ఈ జాతుల వారు సామాజికంగా విద్య, ఆర్థికంగా, వెనుకబడి ఉన్నారు. వీరికి ప్రభుత్వం వీరిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ జాతుల్లో సైనికులు, డాక్టర్లు, ఇంజనీయర్లుగా రాణించాలని ఆశిద్దామని అన్నారు.
అలమారి కళా బృందాలకు రూ 30వేలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి భాగ్యలక్ష్మి పథకం గాని, ఆరోగ్య శ్రీ సేవలు గాని వీరికి వర్థించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. తరువాత రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హంపి ఉత్సవాల నిర్వహణకు నిధులను అధికంగా కేటాయించి ఉత్సవాలను ఘనంగా నిరవహించడం జరుగుతోందని అన్నారు. ఈ యేట హంపి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని అన్నారు. తరువాత మాజీ మంత్రి రామచంద్ర గౌడ మాట్లాడుతూ, రామాయణం, భారతం, పౌరాణిక కథలు భావి పౌరులకు అందించేందుకు అలమారి జాతుల కథలు తోడ్పతాయని అన్నారు.
తరువాత హాస్పేట్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మాట్లాడుతూ, అలమారి వర్గీయులను అన్ని రకాలా ఆదుకునేంందుకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లే, వారి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఈ ఉత్సవాలు గత మూడేళ్ళ నుంచి అనూహ్యమైన రీతిలో నిర్వహించి ఉత్సవాల ఘనతను విశ్వవ్యాప్తంగా చాటుతున్నారు. అనంతరం కిన్నర జోగి హాస్పేట్ తాలూకా గొళ్ళారహళ్లికి చెందిన భాగ్యమ్మ కళా బృందం, జోగి కుణిత, అనంత శయన గుడికి చెందిన సుడిగాడు సిద్ధప్ప ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపి జె.శాంతి, ఎమ్మెల్యే టి.హెచ్. సురేష్‌బాబు, జిల్లా అధికారి బి.శివప్ప తదితరులు పాల్గొన్నారు.

Friday, January 28, 2011

రాయలు గొప్ప పరిపాలనాదక్షుడు: హంపి ఉత్సవాల్లో సీఎం యడ్యూరప్ప

భారత దేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిందని, విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని చిరకాలం గుర్తుండేలా హంపి ఉత్సవాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. ఆయన గురువారం రాత్రి హంపిలో శ్రీకృష్ణదేవ రాయల వేదిక వద్ద భువనేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనాదక్షుడు, స్వతహాగ కవి, సాహితీవేత్త అని ప్రశంసించారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు, కన్నడ, తుళు బాషల్లో మంచి ప్రావీణ్యం పొందిన యోధుడన్నారు. శత్రువులను తుదముట్టించడానికి స్వతహాగా ఖడ్గాన్ని చేతపట్టి యుద్ధం చేసిన మహావీరుడుగా కీర్తి పొందిన సామ్రాజ్యాధినేత అని ఆయన పేర్కొన్నారు. 300 ఏళ్ల విజయనగర సామ్రాజ్యం పరిపాలనలో శ్రీకృషదేవరాయల పాలన స్వర్ణయుగంగా కీర్తింపబడిందంటేఆయన గొప్పదనం, పరిపాలన దక్షత ఏంటో అర్థం చేసుకోవచ్చునని, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు రాయల పాలన వేనోళ్ల కీర్తింపబడుతుందని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు 500 సంవత్సరాల పట్టాభిషేకం మహోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున హంపి సమగ్ర అభివృద్ధికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. హంపిలో థీమ్ పార్కు ఏర్పాటుకు ప్రతి ఏటా రూ. వందలాది కోట్ల నిధులు విడుదల చేస్తున్నామన్నారు. వచ్చే నెలలో థీమ్ పార్క్ పనులు ప్రారంభించి శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని గుర్తుండేలా స్థానిక మంత్రులు కృషి చేయాలన్నారు. థీమ్ పార్కు ఏర్పాటుకు రూ. 300 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి గాలి జనార్దనరెడ్డి మాట్లాడుతూ హంపిలో త్వరలోని థీమ్ పార్కుతో పాటు యూనివర్సల్ జూ పార్కు ఏర్పాటుకు 65 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా హెలీటూరిజం కూడా 15 రోజుల్లో ముఖ్యమంత్రి చేతుల మీదగా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా గాలి జనార్దనరెడ్డి తెలిపారు. హంపి ఉత్సవాలను జనోత్సవాలుగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు మంత్రి గాలి జనార్దనరెడ్డి యడ్యూరప్పకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వేదికపై సీఎంకు మంత్రి గాలి జనార్దనరెడ్డి పాదాభివందనం చేయడం విశేషం. వేదికపై సీఎం, మంత్రులు హంపి ఉత్సవాల స్మరణ సంచికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీరాములు, వీఎస్ ఆచార్య, రేణుకాచార్య, హంపి గాయత్రిపీఠం శ్రీవిద్యారణ్య భారతీస్వామీజీ, ఎంపీలు శాంత, పక్కీరప్ప, శివరామగౌడ, ఎమ్మెల్యేలు గాలి సోమశేఖరరెడ్డి, ఆనందసింగ్, నాగేంద్ర, నేమిరాజ్‌నాయక్, సురేష్‌బాబు, సోమలింగప్ప, విధాన పరిషత్ సభ్యులు మృత్యుంజయ జినగ, హాలప్పాచార్, జిల్లా అధికారి శివప్ప, జిల్లా ఎస్పీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Saturday, January 15, 2011

హంపి ఓ అద్భుత కావ్యం..నవరసాలొలికించు రాచనగరం!

సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల 500 వ పట్టాభిషేక ఉత్సవాలు హంపీలో ఘనంగా జరుగుతాయని తెలిసి ఆ ఉత్సవాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మా మిత్ర వర్గంలోని అరబోలు వీరాస్వామి, ధర్మిశెట్టి రమణ లతో హంపి ఉత్సవాలకు వెళ్లేందుకు సిద్దమయ్యాం.
' దేశభాషలందు తెలుగు లెస్స' అని ఎలుగెత్తి చాటిన శ్రీకృష్ణదేవరాయలన్నా , భాషా, సాహిత్యం కళలకు దాదాపు 300 ఏళ్ల పాటు రాజధానిగా విలసిల్లిన విజయనగరం అన్నా అభిమానం ఉండని వారుండరు కదా!
హంపిలో 2010 జనవరి 27, 28, 29 తేదీలో శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేక 500 వ వార్షికోత్సవాలు జరిగాయి. 28 వ తేది గురువారం ఉదయం మైదుకూరు నుండి బయలు దేరి కడపకు చేరుకున్నాం. చిత్తూరు-హుబ్లీ ల మధ్య తిరిగే ఫాస్టు ప్యాసింజరులో కడప నుండి హోస్పేట వరకు మా ప్రయాణం! ఉదయం 9-45 కు రైలు వచ్చింది.
దాదాపు 300 కి.మీ. ల మా ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. సాయంత్రం ఐదు గంటలకు రైలు మేము దిగాల్సిన హోస్పేటకు చేరింది. ఈ పట్టణానికి 14 కి.మీ. దూరంలోనే హంపి క్షేత్రం ఉంది. అలాగే ఇక్కడికి 7 కి.మీ. ల దూరంలో తుంగభద్ర డ్యాం కూడా ఉంది. స్టేషన్‌ బయట విజయనగరపు రాజచిహ్నంతో నిర్మించిన ఐల్యాండ్‌ మమ్మల్ని ఆకర్షించింది. పంది, కత్తి, సూర్యచంద్రులతో కూడిన ఈ రాజచిహ్నాన్ని గ్రానైట్‌ శిలలపై అందంగా చెక్కారు. అక్కడినుండి బస్టాండుకు చేరాం.
రాయల పట్టాభిషేక మహోత్సవాలను తిలకించేందుకు దేశ విదేశాలనుండి తరలివచ్చిన వేలాది మంది పర్యాటకులతో హోస్పేట బస్టాండు క్రిక్కిరిసి ఉంది. హంపిలో జరిగే రాయల పట్టాభిషేక మహోత్సవాల సమాచారాన్ని పర్యాటకులకు తెలిపే కౌంటర్లను బస్టాండు ఆవరణంలో ఏర్పాటు చేశారు. హోస్పేట పట్టణంతో పాటు హంపికి వెళ్లే దారి పొడవునా గోడలపైనా, ఫ్లెక్సీ కటౌట్లపైనా ఆనాటి విజయనగర వైభవానికి దర్పణం పట్టే చిత్రాలను రంగుల్లో చిత్రించారు. కృష్ణరాయల ఉత్సవాలకు తోరణాలు కట్టినట్లుగా హోస్పేట నుండి హంపి వెళ్లేదారిలో పచ్చని అరటి, చెరుకు తోటలు స్వాగతం పలికాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను విద్యుల్లతలతో అలంకరించారు. చిన్నగా చీకట్లు ముసురుకుంటుండగా, గగనతలాన్ని సాయంకాలపు అరుణకాంతి ఆవరించి ఉన్న హంపిలో అడుగు పెట్టాం!
బస్సుదిగి చుట్టూ కలియచూస్తే చుట్టూ కొండలూ, ఎత్తైన రాళ్లగుట్టలూ, ఆగుట్టలపై మండపాలూ, మరో పక్కగా ఆలయగోపురాల శిఖరాలు, వాటిపైకి ఎగచిమ్మబడుతున్న లేజర్‌కాంతులూ కనిపించాయి. జనం తండోపతండాలుగా వెళుతున్న ఒక పెద్ద సభాప్రాంగణంలోకి ప్రవేశించాం. పురందరదాసు కీర్తనల ఆలాపన శ్రవణానందకరంగా సాగుతోంది. సభాప్రాంగణానికి ప్రాకారంగా కోటగోడలను తలదన్నేలా 30 అడుగుల సెట్టింగులను ఏర్పాటు చేశారు. అది శ్రీకృష్ణదేవరాయల పేరుతో ఈ ఉత్సవాలకు ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక. విజయనగర శిల్ప వైభవం ఉట్టిపడేవిధంగా ఈ వేదికను నిర్మించారు. పురందరదాసు కీర్తనల తర్వాత అక్కడే చలనచిత్ర సంగీత దర్శకుడు కీరవాణితో సంగీత కచ్చేరి ఏర్పాటు చేశారు. అక్కడి నుండి ససివేకలు వినాయకుడి మండపం మీదుగా ప్రధాన బజారులోకి వచ్చేశాం. తూర్పు అభిముఖంగా ఎత్తై న గోపురంతో ఉన్న విరూపాక్షుని ఆలయం కనిపించింది. హంపి ప్రధాన బజారులో నడుస్తున్నామన్న భావన మమ్మల్ని ఉద్వేగానికి గురిచేసింది. 750 మీ. ల పొడవు, 50 .మీ. ల వెడల్పులతో రెండువైపులా రాతి మండపాలతో హంపి ప్రధానబజారు గతవైభవ దీప్తిని వెదజల్లుతున్నట్లుగా ఉంది. ప్రతి ఏటా చైత్రమాసం, శుద్ద పాడ్యమి ఉగాదినాడు విరూపాక్షస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయట! అదే మాసంలో పున్నమి నాడు జరిగే రథోత్సవాలను నిర్వహించడానికి వీలుగానే హంపి బజారు ను అంత విశాలంగా నిర్మించారని చెబుతారు. రాయల పరిపాలనా కాలంలో ఈ రథోత్సవాలకు దేశదేశాల రాజులూ, విజయనగర సామ్రాజ్యంలోని సామంతులూ, దండనాయకులూ, విదేశీ యాత్రీకులు హాజరయ్యేవారట!లేజరు కిరణాలను అమర్చడంతో విరూపాక్షాలయ గోపురం కొత్త శోభను సంతరించుకుంది. రాజగోపురం ముందు చాలా సేపు నిలబడ్డాం. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒక వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రదర్శిస్తున్న సంగీత నృత్యరూపకాన్ని కొంతసేపు తిలకించాం. అప్పటికే రాత్రి 11 గంటలు కావడంతో దైవదర్శనానికి ఉదయం వెళ్లాలనుకున్నాం. రత్నాలరాసులవీధి లోని శ్రీకృష్ణాలయం చూసి తుంగభద్ర నదీతీరానికి వెళ్లాం. తుంగభద్ర తళతళ మెరుస్తూ పండువెన్నెల సోయగాలను అద్దుకుని గళగళ ప్రవహిస్తోంది.
విదేశీ పర్యాటకులు అక్కడ అందాలను ఆస్వాదిస్తూ తన్మయత్వం చెందుతున్నారు. పడవలో ఉత్తర తీరాన్ని చేరుకుంటే అక్కడినుండి విదేశీయుల విడిది కేంద్రాలకు, రిసార్టులకు, ఆనెగుంది, గంగావతిలకు వెళ్లవచ్చు. గంగావతిలో పాత్రికేయులుగా పనిచేస్తున్న మిత్రులు తిరుపాలయ్య, జాకీర్‌లు మమ్మల్ని కలుసుకున్నారు. 14 కి.మీ. దూరంలోని గంగావతిలోని ప్రభుత్వబంగళాలో వారు విడిదిని ఏర్పాటు చేశారు. ఆనెగొంది మీదుగా ఆ అర్థరాత్రి సమయంలో మిత్రులు ఏర్పాటు చేసిన బైకులపై గంగావతికి బయలు దేరాం. ఉదయం తిరిగి హంపికి వచ్చేటప్పుడు మార్గమధ్యంలోని ఆనెగుందినీ, అంజనాద్రినీ, పంపా సరోవరాన్నీ చూడాలనుకున్నాం. కొప్పల్‌ జిల్లా పరిధిలో ఉన్న గంగావతి పట్టణం చిన్నదే అయినా అందమైన తాలూకా కేంద్రం. మనరాష్ట్రంలోని కోనసీమలా పాడి, పంటలతో పచ్చగా విలసిల్లే గంగావతిని 'రైస్‌బౌల్‌ ఆఫ్‌ కర్నాటక' అని అంటారు. గంగావతి పరిసర ప్రాంతాల్లో కన్నడ సినిమా షూటింగులు జరుగుతుంటాయి. గంగావతి చేరేటప్పటికే బాగా అలసి ఉన్న మేము, విడిదిలో హాయిగా నిదురపోయాం.
కొత్త ప్రదేశంలో ఉషోదయపు అనుభూతులు ఆహ్లాదకరంగా ఉంటాయి. నీరెండ శీతల గాలులలో గంగావతి పట్టణం శోభాయమానంగా తోచింది. ఉదయమే గంగావతి నుండి హంపికి బయలుదేరాం.
విజయనగర తొలి రాజధాని 'ఆనెగుంది'
గంగావతి నుండి హంపి వెళ్లే దారిలో ఉన్న 'ఆనెగుంది' గ్రామస్తులు కూడా రాయల పట్టాభిషేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆనెగుంది గ్రామంలో ఆగాం. హంపి, తుంగభద్ర నదికి దక్షిణతీరంలో ఉంటే, ఆనెగుంది హంపికి ఈశాన్యంగా రెండు కిలోమీటర్ల దూరంలో నది ఉత్తర తీరంలో ఉంది. 'ఆనె' అంటే ఏనుగు అనీ, 'గుంది' అంటే గుంత అని అర్థం. ఆనెగుందికి హస్తినాపతి, కుంజరకోన అనే పేర్లుకూడా ఉన్నాయి. ఆనెగుంది రామాయణ కాలంలో వానరుల రాజధాని కిష్కిందగా చెప్పబడుతోంది.
13వ శతాబ్దం ప్రథమార్థంలో ఆనెగుంది ప్రాంతాన్ని పరిపాలిస్తుండిన జంబుకేశ్వర రాయలును ఢిల్లీ సుల్తాన్‌ తుగ్లక్‌ ఓడించి ఆనెగుందిని స్వాధీనపర్చుకుంటాడు. ఆనెగుంది పాలనా బాధ్యతలను తుగ్లక్‌ తన ప్రతినిధి మాలిక్‌నాయబ్‌కు అప్పగిస్తాడు. నాయబ్‌ ఎప్పుడూ విలాసాల్లో మునిగితేలుతూ,మత్తులో జోగుతూ ప్రజాకంటకుడుగా వ్యవహరిస్తూఉండేవాడు. హరిహరరాయలు, బుక్కరాయలు నాయబ్‌పై తిరుగుబాటును లేవదీసి ఆనెగుందిని స్వాధీనం చేసుకుంటారు. ఆతర్వాత విజయనగర సామ్రాజ్యస్థాపన జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యాన్ని ఆనెగుంది నుండి హంపి(విజయనగరం)కి మార్చిన తర్వాత ఆనెగుందిలో పెద్ద గజశాలను నిర్వహించేవారట! విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన చివరి రాజవంశం అరవీడు వంశం. ఆ వంశవారసులైన రాజా శ్రీరామదేవరాయలు ఆధ్వర్యంలో ఆనెగుందిలో మేళతాళాలతో అంగరంగవైభవంగా జరుగుతున్న ఉత్సవాల్లో కొందరు విదేశీయులతో పాటు మేము కూడా కలిసిపోయాం. ఆనెగుంది గ్రామాన్ని రంగవళ్లులతో, పూలతో సర్వోపసుందరంగా అలంకరించారు. చారిత్రక ప్రదేశాలూ, దేవాలయాలూ, కూడళ్లూ, వీధులూ సప్తవర్ణశోభను సంతరించుకున్నాయి. పచ్చని తోరణాలు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆనెగుందిలోని పురాతన రంగనాథస్వామి ఆలయం, గగన్‌మహల్‌ లను దర్శించాం. తుంగభద్ర నదీపాయలో శ్రీకృష్ణదేవరాయల సమాధిగా భావించే 64 స్థంభాల మండపం వద్ద కొంత సేపు గడిపాం! రాయలు 64 కళలందు పాండిత్యాన్ని గడించినందుకు చిహ్నంగా 64 స్థంభాలతో ఈ మండపాన్ని నిర్మించినట్లు చెబుతారు. అక్కడ రాయలవారికి ఘనంగా నివాళి అర్పించాం.
మరికొన్ని చారిత్రక కట్టడాలను చూశాం. సమీపంలో ఋష్యమూక పర్వతం, నవబృందావనం, చంద్రమౌళీశ్వర ఆలయం, శిధిలమైన పురాతన రాతివారధి, పంపాసరోవరం, రంగనాథగుహ, శబరి ఆశ్రమం ఉన్నాయి. పంపాసరోవరాన్ని చూసినతర్వాతపడవలో నదినిదాటి తిరిగి హంపిని చేరుకున్నాం.
అంతులేనిది.. హంపి సౌందర్యం!
తుంగభద్రనది ఒడ్డున్నే ఉన్న విరూపాక్ష ఆలయాన్ని సందర్శించాం. ఆలయంలో విరూపాక్షున్నీ, పంపాదేవి, భువనేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్నాం. అక్కడి శిల్పాలనూ, చిత్రకళనూ, ఆలయ విశిష్టతలను గురించి తెలుసుకున్నాం.
హంపీలో చూడాల్సిన ప్రదేశాల జాబితా కొండవీటి చాంతాడంత ఉంది. కొన్నింటినైనా చూడాలనే ఆత్రంతో విరూపాక్షాలయం నుండి తుంగభద్ర దక్షిణతీరం వెంబడి ఏకశిలారథం ఉన్న విఠలాలయానికి బయలు దేరాం. ముందుగా కోదండరామాలయాన్ని దర్శించుకున్నాం. రావణ వధానంతరం శ్రీరాముడు పుష్పకవిమానంలో వెళ్తూ సుగ్రీవుని కోరికపై ఒక క్షణం కిష్కిందపై ఆగాడట. అందుకు చిహ్నంగా ఈ కోదండరామాలయం వెలసిందని స్థలపురాణం. కోదండరామాలయం వద్ద తుంగభద్ర నదీ తీర ప్రదేశాన్ని చక్రతీర్థం అంటారు. తుంగభద్ర పడమర నుండి తూర్పునకు ప్రవహిస్తూ చక్రతీర్థం వద్ద ఋష్యమూక పర్వతాన్ని చుడుతూ ఉత్తరానికి మళ్లుతుంది. ఎత్తైన రాళ్లగుట్టల మధ్య సుడులు తిరుగుతూ వెళ్లే నదీ ప్రవాహదృశ్యం మనసులను రంజింపజేస్తుంది. నది ఉధృతంగా ప్రవహించేటప్పుడు ఆ ప్రదేశంలో సుడిగుండాలు ఉంటాయని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. నదీ తీరంలోని కొండగుట్టలపై విజయనగరాధీశులు అందమైన మండపాలను నిర్మించారు. కృష్ణదేవరాయలు తన ఇష్ట సఖులతో కలిసి చక్రతీర్థం వద్ద నదిలో పడవల్లో విహరించడం, గుట్టలపై మండపాలలో విహరించటం చేసేవారట! ఇప్పుడు కూడా పర్యాటకులకు నదిలో తెప్పల్లో విహరించే సౌకర్యం ఉంది.
కోదండరామాలయానికి కాస్త వెనుక యంత్రోద్దారక హనుమంతుని ఆలయం ఉంది. ఆ తర్వాత అచ్యుతరామాలయం చేరుకున్నాం. ఈ ఆలయంలో కొలువుండిన దేవుడు తిరువెంగళనాధుడు కాగా అచ్యుతరాయల ఆలయంగా పేరు పొందడం విశేషం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1534లో అచ్యుతరాయల బావమరిది హిరయ తిరుమలరాజ నిర్మించారు. ఇక్కడి శిల్పకళ రమణీయంగా ఉంటుంది. ఆలయానికి పడమర వైపున మాతంగ పర్వతం, ఆ పర్వతంపై వీరభద్రస్వామి దేవాలయం ఉన్నాయి. తూర్పున గంధమాదన పర్వతం ఉంది. ఉత్తరం దిక్కుగా రెండువైపులా మండపాలతో విశాలమైన బజారు ఉంది. దీనికి అచ్యుతరాయ బజారు అని పేరు. తర్వాత రాజ తులాభారాన్ని దర్శించాం. వజ్రాలు, బంగారం, వెండి లాంటి విలువైన వాటితో కృష్ణరాయలు ఈ తులాభారంలో తులతూగి వాటిని బ్రాహ్మణులకు దానం చేసేవారని ప్రతీతి. అక్కడినుండి పురందరదాసు మండపం మీదుగా విఠలాలయానికి వెళ్లాం. ఏకశిలా రథం, సరిగమలు పలికే స్థంబాలున్న మండపం ఇక్కడ ఉండటటం వల్ల ఈ ఆలయం అత్యంత ప్రధానమైనదిగా హంపి పర్యాటకులు భావిస్తారు. ఏక శిలారథాన్ని చేతులతో తడుముతూ తనివితీరా చూసే అవకాశం అయితే కలిగింది కానీ, సరిగమల స్థంబాలను ముట్టుకోవడానికి కూడా పురావస్తుశాఖ సిబ్బంది అనుమతించడం లేదు. విఠలాలయం వెలుపల కూడా రెండువైపులా మండపాలతో పెద్దబజారు ఉంది. ఉత్సవాల రోజుల్లో ఇక్కడ అంగళ్ల రతనాలు అమ్మినట్లు చెబుతారు. అప్పటికే సాయంత్రం అయ్యింది. సాయంత్రం విరూపాక్ష బజారులో పట్టాభిషేకోత్సవాల ముగింపు కార్యక్రమాలు ఉండటంతో అక్కడినుండి వెనుతిరిగి విరూపాక్షాలయం చేరుకున్నాం.
విజయనగర వైభవాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలతో అప్పటికే కార్యక్రమాలు మొదలయ్యాయి. అద్భుతమైన కళారూపాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ' వీరగాసే ' కళాకారుల రౌద్రనృత్యాలూ, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, సైనికుల యుద్ధభేరీనాదాలతో హంపి వీధులు హోరెత్తాయి. తన్మయత్వంతో మేం కూడా ఆ కళాకారుల్లో కలిసిపోయాం. ఏకశిలారథం, రాజులూ, రాణుల వేషధారుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పున్నమికి ఒక రోజు ముందునాటి సాయంసంధ్యలో రథ, గజ, తురగ ఘట్టనలతో హంపి వినువీధులు ఎరుపెక్కాయి. రాళ్లగుట్టలూ, గోపుర శిఖరాల మధ్యనుండి చంద్రుడు మెల్లగా ఆకాశంలోకి వస్తున్న దృశ్యం అధ్భుతమనిపించింది. గంగావతికి తిరుగు ప్రయాణం అయ్యేందుకు సమాయత్తం అవుతూనే ఉగ్రనరసింహం, బడివే లింగాలను దర్శించుకుని, హేమకూట పర్వతం మీది మండపాలనూ, ఆలయాలను చూస్తూ విరూపాక్షాలయాన్ని చుట్టుకుంటూ తుంగభద్ర ఒడ్డుకు చేరాం.
రైలు ప్రయాణం ఆద్యంతం..ఆహ్లాదకరం!
మా రైలు ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరంగా, ఆసక్తిగా సాగింది. కడపజిల్లా కమలాపురం ఎర్రగుంట్ల ప్రాంతాల్లో రైల్వేలైనుకు పక్కగా ఉన్న నాపరాళ్ల గనులను రైళ్లో వెళ్తూ చూశాం. భూగర్భంలో వరుపలు, వరుసలుగా నిక్షిప్తం అయి ఉన్న రాతి పలకలను బయటికి తీస్తున్న గనికార్మికుల శ్రమైకజీవన సౌందర్యాన్ని చూశాం. మా వెంట తిరుమల రామచంద్రగారి ' హంపి నుంచి హరప్పాదాకా' పుస్తకాన్ని తీసుకువెళ్లిన మేము అందులోని విజయనగర విశేషాలపై చర్చలు జరుపుకున్నాం. తినబోతూ రుచుల గురించి మాట్లాడుకున్నట్లుంది కదూ మా వ్యవహారం. కొండాపురం, తాడిపత్రి, గుత్తి ప్రాంతాల్లో జామపండ్లు, సపోటా పండ్లు విరివిగా పండుతాయి. ఆ ప్రాంత మహిళలు గంపలతో తెచ్చి పండ్లను రైళ్లలో అమ్ముతుంటూ ఉంటారు. పండ్లు చాలా రుచికరం.
గుత్తి స్టేషన్‌కు ముందున్న స్టేషన్‌ 'రాయలచెరువు'. రాయలవారు అక్కడ చెరువు తవ్వించడం వల్ల ఆ వూరికి 'రాయలచెరువు' అని పేరు వచ్చిందట!. శ్రీకృష్ణదేవరాయలు, మరికొందరు విజయనగర రాజులు రాయలసీమ ప్రాంతంలో వీలైన చోట్లల్లా చెరువులు తవ్వించినట్లుగా అప్పట్లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రీకులు శ్లాఘించిన విషయం ఈ సందర్భంగా మా స్ఫురణకు వచ్చింది. భుక్తి, రక్తి, ముక్తి అంశాల్లో దేనికీ లోటు లేకుండా విరాజిల్లిన సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం. భుక్తి కోసం చెరువులు తవ్వించారు. రక్తి కోసం కళలు సాహిత్యాన్ని పోషించారు. ముక్తి కోసం దేవాలయాలను, ఆథ్యాత్మిక కేంద్రాలను నిర్మించారు. గుత్తి సమీపంలో రైలు పట్టాలకు దక్షిణంగా రెండు కి.మీ. దూరంలో గుత్తి దుర్గం కనిపించింది. 300 మీటర్ల ఎత్తులో ఒక కొండపై ఉన్న ఆ దుర్గాన్ని విజయనగర రాజులు నిర్మించారు. కడపకు 150 కి.మి., అనంతపురానికి 52 కి.మి. దూరంలో ఈ దుర్గం ఉంది. 15 ద్వారాలతో ఈ కోటను శత్రు దుర్భేధ్యంగా నిర్మించారట! రాయల చెరువు, గుత్తి ప్రాంతాల్లో రైలు పట్టాల పక్కగా సహజమైన రీతిలో పెరిగిన తాటితోపులూ, ఈతతోపులూ కనిపించాయి.
అప్పటికే మధ్యాహ్నభోజన సమయం దాటిపోయింది. మిత్రుడు వీరాస్వామి ఇంటి నుంచి పట్టుకొచ్చిన చిత్రాన్నం, చపాతీలు వాటిలోకి ఉర్లగడ్డ తాళింపు నోరూరిస్తున్నాయి. చిత్రాన్నంలో నిమ్మరసం, వేయించిన వేరుశనగ విత్తనాలు కలుపుతారు కదా! గుంతకల్లు దాటిన తర్వాత చిత్రాన్నాన్ని ఆరగించాం. గుంతకల్లు నుండి బయలుదేరిన రైలు మరో గంట సమయానికి బళ్లారికి చేరింది. బళ్లారి రైల్వే స్టేషన్‌కు ఒక కిలోమీటరు దూరంలోని ఒక గుట్టపై బళ్లారి కోట కనబడుతుంది. బళ్లారి కోటను కూడా విజయనగర రాజుల కాలంలో కనుమప్పనాయకుడనే ఆ ప్రాంత నాయకుడు నిర్మించాడట!. ఈ కోట ఉన్న గుట్ట ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఏకరాతి గుట్టగా గుర్తింపు పొందింది. ఈ గుట్టను స్థానికులు బళ్లారిగడ్డ అని అంటారు.బళ్లారి దాటిన తర్వాత విరూపాపుర సమీపంలోని కర్నాటక సరిహద్దులో రైలు కర్నాటకలోకి ప్రవేశిస్తుంది. అక్కడికి సమీపంలో 'దరోజి' అనే గ్రామం ఉంది.ఇక్కడ విజయనగర ప్రథమ ప్రాకారానికి దర్వాజా ఉండటం వల్ల ఆ గ్రామానికి దరోజి అనే పేరు వచ్చిందని చెబుతారు.
బళ్లారి-తోరణగల్లు మధ్యలో విశాలమైన బీడుభూములు, వాటిలో పశువులను, గొర్రెలను మేపుకుంటూ పశువుల కాపరులు, అక్కడక్కడ పండిన కుసుమ చేలు, ఆ పంటను ఒడుపుకుంటూ రైతులు కనిపించారు. అలాగే బళ్లారి నుండి తోరణగల్లు వరకు రైలు పట్టాలకు ఇరువైపులా ఇనుపఖనిజం నిల్వచేసిన దిబ్బలు, వాటిని ఓడరేవులకు తరలించే లారీలు కొల్లలుగా దర్శనమిస్తాయి. ఎర్రగా ఇనుపఖనిజం దుమ్ము రేగుతూ ఉంటుంది. బళ్లారి, తోరణగల్లు, సాండూరు ప్రాంతం ఒక ఖనిజమేఖలగా గుర్తింపు పొందింది. పారిశ్రామికంగా బాగా అభివృద్ది చెందిన ఆ ప్రాంతంలోనే జిందాల్‌ విజయనగర్‌ స్టీల్స్‌ తదితర కర్మాగారాలు మనకు కనిపిస్తాయి. మా ప్రయాణంలో పాపాఘ్ని, చిత్రావతి, పెన్నా, హగరి, తుంగభద్ర నదులను కూడా దర్శించే అవకాశం కలిగింది.
హంపీ, అక్కడి పరిసరాల్లో మేం గడిపిన రెండు రోజులూ అంతా ఆదుర్దానే! ఒక పక్క హంపి అందాలు, మరో పక్క రాయల పట్టాభిషేక ఉత్సవాలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. భువన విజయ సభా ప్రాంగణం, పద్మ మహల్‌, రాజప్రాసాదాలూ, రాణుల స్నానవాటికలూ, కావలి మండపాలూ, కిష్కింద, మాల్యవంత పర్వతం, మహర్నవమి దిబ్బ, రామలింగడి మండపం, కామలాపుర సంగ్రహశాల, ఇంకా ఇంకా చూడాల్సినవి ఎన్నో ఎన్నెన్నో మిగిలిపోయాయి. రెండే రెండు రోజుల్లో హంపిని ఆసాంతం చూడాలనుకోవడం అత్యాశే అవుతుంది కదా! అడుగు అడుగుకూ, జాముజాముకూ,ఋతువు ఋతువుకూ అందాలను మార్చుకుంటూ పర్యాటకులను అబ్బురపరిచే హంపి, నిజంగా ఓ అద్భుత కావ్యం..నవరసాలొలికించు రాచనగరం!

Friday, December 17, 2010

దివ్యప్రబంధ గాథ ఆంధ్ర భోజుని ఆముక్తమాల్యద

సంస్కృత సాహిత్యంలో కవిపండిత పోషకుడు భోజ రాజు ఉన్నాడు. తెలుగులో ఆయనంతటి వాడు శ్రీకృష్ణదేవరాయలు అనే భావనతో ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచేవారు. భోజరాజు ముఖం చూస్తే ఎలాంటి వాడికైనా కవిత్వం వస్తుందని అనేవారు. అలాగే దక్షిణాదిలో రాయల సముఖానికి వచ్చి సాహిత్యాన్ని పాండి త్యాన్ని ప్రదర్శించి బహుమానాలు అందుకున్న వారెందరో ఉన్నారు. రణరంగంలో వీరవిజృంభణ చేసిన విధంగానే సాహిత్యరంగంలోనూ విజృంభణ చేసిన ఘనత రాయలకు ఉంది. ఆయన కవి, పండిత పోషకుడే కాదు స్వయంగా కవి. రాయల పేరు వినగానే మనకందరికి గుర్తుకువచ్చేది ఆముక్తమాల్యద గ్రంథం. కానీ నిజానికి ఆయన తెలుగులో కన్నా సంస్కృతంలోనే ఎక్కువ గ్రంథాలు రాశాడు. ఆ మాట ఆయనే ఆముక్తమాల్యద గ్రంథంలో శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు మాటల ద్వారా చెప్పుకున్నాడు . భారీగా యుద్ధాలు చేసి అలసిపోయిన రాయలు తీర్థయాత్రలు చేశాడు. అపðడు ఆయన కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళానికి వచ్చాడు. అక్కడ ఆ రాత్రి విశ్రమించినపుడు ఆంధ్రదేవుడు కలలో కనిపించి ఆముక్తమాల్యద రాయమని ఆదేశించాడు. ఆ సందర్భంలో ఆంధ్రదేవుడు మాట్లాడుతూ  
'పలికితుత్ప్రేక్షోపమలు జాతి పెంపెక్క రసికులౌనన 'మదాలస చరిత్ర' 
భావధ్వని వ్యంగ్య సేవధికాగ చెప్పితివి 'సత్యావధూ ప్రీణనంబు'

శ్రుతి పురాణోపసంహిత లేర్చి కూర్చితి 'సకల కథాసార సంగ్రహంబు'

శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగ రచించితి సూక్తినైపుణి 'జ్ఞానచింతామణి' కృతి

అంతేగాక 'రసమంజరీ' ముఖ్య మధుర కావ్య రచన మెప్పించికొంటి గీర్వాణ భాష

ఆంధ్ర భాష అసాధ్యంబె అందు ఒక్క కృతి వినిర్మిం పుమిక మాకు ప్రియము కాగ
అంటాడు. ఈ పద్యం ప్రకారం రాయలు మదాలస చరిత్ర, సత్యావధూ ప్రీణనంబు, సకల కథాసార సంగ్రహంబు, సకల కథాసార సంగ్రహం, జ్ఞానచిం తామణి, రసమంజరీ గ్రంథాలను ఆయన రచిం చాడు. అయితే కాలగతిలో అవన్నీ కనుమరుగైపోయి ఒక్క ఆముక్తమాల్యద మాత్రమే దక్కింది. ఇవికాక జాంబవతీ పరిణయం అనే నాటకం కూడా రాశాడని అంటారు. కానీ అది కూడా దొరకడంలేదు.
రామాయణం, మహాభారతం, మహాభా గవతం, హరివంశం వంటి గ్రంథాలు సంస్కృత మూల గ్రంథాలకు అను వాదాలు. మక్కీకి మక్కీ అను వాదాలు కాకపోయినా, వా టిలోనూ కొన్ని స్వ కపోల కల్పన లున్నా గాస టబీసట గాథలుగా జనపదాలలో వినిపించే ప్రఖ్యాత కథలు తెలుగు గ్రంథాలలో చోటు సంపా దించుకున్నా, వాటిలో తెలుగు ముద్ర కంఠదగ్నంగా ఉన్నా వాటిని స్వతంత్ర రచనలు అన డానికి ఆస్కారంలేదు. తన హయాంలోనూ మను చరిత్ర, వసుచరిత్ర, పాండురంగ మాహాత్మ్యం, కళాపూర్ణోదయం వంటి రచనలు వెలువడినా వాటికి మూలకథలు సంస్కృత ప్రఖ్యాత కథలే కావడం గమనార్హం. శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాదిలో ఎంతో ప్రఖ్యాతమైన కథను ఎన్నుకుని దానికి ప్రబంధోచిత హంగులన్నీ అద్ది ఆండాళ్‌చరిత్రకు అక్షర రూపమిచ్చాడు. వైష్ణవులకే పరిమితమైన ఆమె కథను తెలుగు వారందరికీ తెలిసేలా చేశాడు. ద్రవిడ సాహిత్యం లో చిరకీర్తులున్న మహానుభావులెందరో ఉన్నా వారి ఇతిహాసాలను పుస్తకాలకెక్కించిన పెద్ద కవులు తెలుగులో దాదాపుగా లేరంటే అతిశయోక్తికాదు. స్వయంగా వైష్ణవమతానుయాయుడైన రాయలు ఆండాళ్‌తల్లి మీద అభిమానం, శ్రీకాకుళ ఆంధ్రదేవుని ఆదేశంపై ఆ దేవుడు గోదాదేవిని పరిణయమాడిన గాథను ఇతివృత్తంగా తీసుకున్నాడు. ఆంధ్రదేవుడు ఆదేశం ప్రకారమే ఈ గ్రంథాన్ని తిరుపతి వేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. ఈ పుస్తకంలో కథాప్రణాళికను రూపొందించు కో డానికి గురు పరం పరా ప్రభావం, ప్రపన్నామృతం, దివ్యసూరి చరిత్ర వంటి వైష్ణవ మత గ్రంథాలనే స్వీ కరించాడు. ఈ గ్రంథా నికి గోదా దేవి పేరు నేరుగా పెట్టినా, ఆరు ఆశ్వాశాల గ్రంథంగా దీన్ని విస్తరించినా ఆండాళ్‌ చరిత్ర 5వ ఆశ్వాసంలోనే ఆరంభమవు తుంది. మొత్తం 872 పద్యాలు సంతరించినా ఆండాళ్‌కు దక్కినవి 140 పద్యాలు మాత్రమే! ఈ గ్రంథంలో 5 విడి కథలు కనబడ తాయి. విష్ణు చిత్తుడికథ, ఖాండిక్య కేశిధ్వజ వృత్తాంతం, యామునాచార్య వృత్తాం తం, గోదాదేవి వృత్తాంతం, చండాల, బ్రహ్మరాక్షసుల కథ ప్రధానంగా కనబడతాయి.
                                                                          -డా.వంగల రామకృష్ణ 

Sunday, August 29, 2010

విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధవిజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమారమణ గా కీర్తించబడినాడు.
ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి కూడా తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించేవాడు.కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు.[1] ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.
రాజ్యం అధిష్ఠానం ఇతను రాజ్యం అధిష్ఠించునాటికి రాజ్యమంతా చాలా గందరగోళంగా ఉన్నది. దక్షిణాన సామంతులు స్వతంత్రులు అయినారు, తీరాంధ్ర ప్రాంతాన్ని గజపతులు ఆక్రమించుకొని తమ రాజ్యంలో కలుపుకొని, కొండవీడు, ఉదయగిరి వంటి పటిష్ఠమైన దుర్గములతో బ్రహ్మాండమైన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. బహమనీ సుల్తానులు రాజ్యంలోనికి రోజురోజుకూ చొచ్చుకొని రాసాగినారు. ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చినాడు.

దక్షిణ దేశ దండయాత్ర
ఇతను 1509లో సింహాసనం అధిష్ఠించి, 1512 వరకూ మూడు సంవత్సరములు సైనిక సంపత్తిని పెంపొందించుకొని తొలిసారిగా దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు.కావేరీ నదీ తీరంలోని శివపట్టణ పాలకుడు, విజయనగర సామంతుడైన గంగరాజు, విజయనగర రాజుల అలసత్వాన్ని ఆధారంగా చేసుకొని కప్పం చెల్లించక స్వతంత్రముగా ఉండసాగినాడు. ఇతని శత్రువు శ్రీ రంగపట్టణ రాజు చిక్క రాయలు. చిక్క రాయలు శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో చేరి గంగరాజుపై యుద్ధం చేసి గెలిచినాడు. గంగరాజు కావేరి నదిలో పడి ప్రాణాలు వదిలినాడు.తరువాత ఉమ్మత్తూరు, కర్ణాటక, మైసూరు ప్రాంతములను చేజిక్కించుకొని చిక్క రాయలును వాటికి సామంతుని గా చేసినాడు. తరువాత చిన్న చిన్న పాలెగాండ్లను జయించి ఆ ప్రాంతములకు కెంపెగౌడ, వీర గౌడలను పాలకులుగా నియమించినాడు. (ఈ కెంపేగౌడ, వీర గౌడలే బెంగళూరు నిర్మాతలు). తరువాత మలయాళ ప్రాంతములను జయించి, వారినుండి కప్పములను వసూలు చేసినాడు. విజయప్ప, వేంకటప్ప నాయకులను పాండ్యదేశమునకు, దాని పరిసరాలకూ సామంతులుగా నియమించినాడు. విజయప్పనాయుడు, వెంకటప్ప నాయుడుతో కలసి రాయలువారి ఆదేశముపై చిత్తూరు, జింజి, తొండ మండలము, మధుర, తిరునగరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతములను జయించినాడు. వీరందరి నుండి ఎంతో కప్పమును వసూలు చేసినాడు. ఒక్క జింజి నగరమునుండే సంవత్సరమునకు మూడు కోట్ల రూపాయల విలువైన కప్పం వచ్చేది. దీనితో దక్షిణ దేశమంతా రాయలు స్వాధీనమైనది.

పరిపాలనా సౌలభ్యం కోసం దీని మూడు భాగములుగా విభజించి నాడుజింజి కేంద్రముగా కృష్ణప్ప నాయకుడు అధిపతిగా నెల్లూరు మొదలగు ప్రాంతములు ఉండెను.తంజావూరు కేంద్రముగా విజయ రాఘవ నాయకుడు అధిపతిగా కావేరీ నదీ తీరప్రాంతములు రెండవ కేంద్రము.కొడగు కేంద్రముగా వెంకటప్ప నాయకుడు అధిపతిగా మళయాళ ప్రాంతము మూడవ భాగము.
ఈ దక్షిణదేశ దండయాత్ర తరువాత రాయలు రాజధానికి తిరిగి వచ్చాడు.
తూర్పు దిగ్విజయ యాత్ర
తిమ్మరుసు నాయకత్వంలో చక్కని సైన్యమును తూర్పు దిగ్విజయ యాత్రకు పంపించినాడు.

సైనిక విశేషములు

తిమ్మరుసు సైన్యమును చక్కగా వ్యూహాత్మకంగా విభజించినాడు. మొత్తం సైన్యాన్ని ఏడు భాగములుగా విభజించినాడు. ఒక్కొక్క విభాగములోను కింది దళాలు ఉన్నాయి:

• 30,000 కాల్బలము

• నాలుగు వేల అశ్విక దళము

• రెండువందల ఏనుగులు

ఈ విభాగాలకు అధ్యక్షులుగా కింది వారిని నియమించాడు.

1. రాయసము కొండమరుసు

2. పెమ్మసాని రామలింగ నాయుడు

3. గండికోట కుమార తిమ్మానాయుడు

4. వెలుగోడు గంగాధరరెడ్డి

5. అకినీడు ఇమ్మరాజు

6. ఆరవీటి నారపరాజు

7. ఆరవీటి శ్రీరంగరాజు

ఉదయగిరి విజయం

ఈ తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా 1513లో ఉదయగిరి ని ముట్టడించినాడు. రాయసము కొండమరుసు విజయనగర సేనలకు ఆధిపత్యము వహించి సంవత్సరమున్నర పాటు తీవ్రమైన పోరాటము చేసి దుర్గమును స్వాధీనము చేసుకున్నాడు. తరువాత ఉదయగిరి ప్రాంత రాజప్రతినిధిగా అతడే నియమితుడయ్యాడు. కొండవీడు విజయం

1515లో రాయలు కొండవీడు ను ముట్టడించినాడు. కొండవీడు 1454నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6 న స్వాధీనం చేసుకున్నాడు.

తిమ్మరుసు మేనల్లుడు నాదెండ్ల గోపన దుర్గాధిపతిగా నియమితుడయినాడు.

కొండవీడు తరువాత శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.

• అద్దంకి, కేతవరం, అమ్మనబ్రోలు, నాగార్జున కొండ, బెల్లంకొండ దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు.

• విజయవాడ సమీపాన ఉన్న కొండపల్లి దుర్గమును రెండునెలలు పోరాడి స్వాధీనం చేసుకున్నాడు.

• అనంతగిరి, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, అరసవిల్లి, చిట్యాల, నల్లగొండ మొదలైన దుర్గాలను జయించాడు.

• కోనసీమ, జమ్మిలోయ, కోరాము, రాజమహేంద్రవరము లను జయించినాడు.

• మాడుగుల, వడ్డాది, సింహాచలములను స్వాధీనం చేసుకొని సింహాచల నరసింహ స్వామిని పూజించి అనేక దాన ధర్మాలు చేసినాడు.

• కటకం పైకి దండెత్తి ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి అతని కుమార్తె తుక్కా దేవి ని వివాహమాడాడు.

ఈ దిగ్విజయ యాత్ర తరువాత రాయలు 1516 లో రాజధానికి తిరిగి వచ్చాడు.

బీజాపూరు దండయాత్ర

1520లో బీజాపూరు పైకి దండయాత్రకు సిద్ధమయినాడు. దీనికి రెండు కారణములు చూపుతారు. మద్గల్లు, రాయచూరు దుర్గములను సుల్తాను ఆక్రమించుట మరియు సయ్యద్ మరైకర్ అను వ్యాపారి రాయల వద్ద డబ్బులు తీసుకుని ఇస్తానన్న అరేబియా జాతి గుర్రాలను ఇవ్వకుండా బీజాపూరు సుల్తాను దగ్గర ఆశ్రయం పొందినాడు; తాకీదు పంపించినా ఈ వ్యాపారిని సుల్తాను రాయలకు అప్పజెప్పలేదు, రాయలు సొమ్ము ఇప్పించనూ లేదు.

సైనిక వివరములు

న్యూనిజ్ అను పోర్చుగీసు యాత్రికుని ప్రకారం సైన్యం ఇలా ఉన్నది:

1. కామా నాయకుడు (పెమ్మసాని రామలింగ నాయుడు) : 30,000 కాల్బలము, వేయి అశ్వములు, పదహారు గజములు

2. త్రయంబకరావు: 50,000 కాల్బలము, రెండు వేల అశ్వములు, ఇరవై ఏనుగులు

3. తిమ్మప్ప నాయకుడు : 60,000కాల్బలము, 3,500 ఆశ్విక దళము, 30 ఏనుగులు

4. ఆదెప్ప నాయకుడు : లక్ష కాల్బలము, ఐదువేల ఆశ్విక దళము, 50 ఏనుగులు

5. కొండమ రెడ్డి 1 : 1,20,000 కాల్బలము, 6000 గుర్రాలు, 60 ఏనుగులు

6. కొండమ రెడ్డి 2 : 80,000 కాల్బలము, 2050 గుర్రాలు, 40 ఏనుగులు

7. సాళువ గోవింద రాజు : 30,000 కాల్బలము, 1000 గుర్రాలు, 10 ఏనుగులు

8. మధుర నాయకుడు : 15,000 కాల్బలము, 200 గుర్రములు

9. కుమార వీరయ్య : 8,000 కాల్బలము, నాలుగు వందల గుర్రములు

10. రాయలు : 44,000 కాల్బలము, 7,000 గుర్రములు, 315 ఏనుగులు

మొత్తం 5,37,000 కాల్బలము, 27,150 గుర్రములు, 1151 ఏనుగులు. పోరు భీకరముగా జరిగింది. ఇరువైపులా అనేక మంది నేలకూలారు. ఆదిల్ షా ఏనుగునెక్కి పారిపోయినాడు. సేనానులు దిక్కుతోచని వారైనారు. చివరకు ఎంతో ప్రాణ నష్టము తరువాత యుద్ధం 1520 మే 19న ముగిసింది. ఈ విజయం వలన రాయలుకు విశేషమైన డబ్బు, గుర్రాలు, ఏనుగులు లభించినాయి.

రాయచూరు యుద్ధము

తరువాత రాయచూరు కోటను ముట్టడించి ఇరవై రోజులు యుద్ధం చేసి పోర్చుగీసు సైనికుల సహాయంతో విజయం సాధించాడు (రాయచూరి యుద్ధము). రాయలు రాజధానికి వెళ్ళినా, త్వరలోనే మరలా ముద్గల్లు, బీజాపూరు లను ముట్టడించి ధ్వంస పరచి కల్యాణి, గుల్బర్గా కోటలను స్వాధీనం చేసుకున్నాడు.



తరువాత రాయలు రాజధానికి వచ్చి నిశ్చింతగా కవితా గోష్టులను నిర్వహించినాడు.

వారసులు

• ఇతనికి ఇద్దరు భార్యలు, తిరుమల దేవి, చిన్నాదేవి .

• ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను రామ రాయలు కు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలు కు ఇచ్చి వివాహం చేసాడు.

• ఒక్కడే కొడుకు, తిరుమల దేవ రాయలు . ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయం పై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి అతనిని గుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలు ను వారసునిగా చేసాడు.

• రాజ్య పాలన

240 కోట్ల వార్షికాదాయము కలదు.

సాహిత్య పోషకునిగా

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

అష్టదిగ్గజములు

1. అల్లసాని పెద్దన,

2. నంది తిమ్మన,

3. ధూర్జటి,

4. మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి),

5. అయ్యలరాజు రామభద్రుడు,

6. పింగళి సూరన,

7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి),

8. తెనాలి రామకృష్ణుడు

9. కవిగా

ఇతను మత సహనం కలవాడు. అనేక వైష్ణవ, శైవ దేవాలయములను నిర్మించినాడు; అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.