సంస్కృత సాహిత్యంలో కవిపండిత పోషకుడు భోజ రాజు ఉన్నాడు. తెలుగులో ఆయనంతటి వాడు శ్రీకృష్ణదేవరాయలు అనే భావనతో ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచేవారు. భోజరాజు ముఖం చూస్తే ఎలాంటి వాడికైనా కవిత్వం వస్తుందని అనేవారు. అలాగే దక్షిణాదిలో రాయల సముఖానికి వచ్చి సాహిత్యాన్ని పాండి త్యాన్ని ప్రదర్శించి బహుమానాలు అందుకున్న వారెందరో ఉన్నారు. రణరంగంలో వీరవిజృంభణ చేసిన విధంగానే సాహిత్యరంగంలోనూ విజృంభణ చేసిన ఘనత రాయలకు ఉంది. ఆయన కవి, పండిత పోషకుడే కాదు స్వయంగా కవి. రాయల పేరు వినగానే మనకందరికి గుర్తుకువచ్చేది ఆముక్తమాల్యద గ్రంథం. కానీ నిజానికి ఆయన తెలుగులో కన్నా సంస్కృతంలోనే ఎక్కువ గ్రంథాలు రాశాడు. ఆ మాట ఆయనే ఆముక్తమాల్యద గ్రంథంలో శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు మాటల ద్వారా చెప్పుకున్నాడు . భారీగా యుద్ధాలు చేసి అలసిపోయిన రాయలు తీర్థయాత్రలు చేశాడు. అపðడు ఆయన కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళానికి వచ్చాడు. అక్కడ ఆ రాత్రి విశ్రమించినపుడు ఆంధ్రదేవుడు కలలో కనిపించి ఆముక్తమాల్యద రాయమని ఆదేశించాడు. ఆ సందర్భంలో ఆంధ్రదేవుడు మాట్లాడుతూ
'పలికితుత్ప్రేక్షోపమలు జాతి పెంపెక్క రసికులౌనన 'మదాలస చరిత్ర'
భావధ్వని వ్యంగ్య సేవధికాగ చెప్పితివి 'సత్యావధూ ప్రీణనంబు'
శ్రుతి పురాణోపసంహిత లేర్చి కూర్చితి 'సకల కథాసార సంగ్రహంబు'
శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగ రచించితి సూక్తినైపుణి 'జ్ఞానచింతామణి' కృతి
అంతేగాక 'రసమంజరీ' ముఖ్య మధుర కావ్య రచన మెప్పించికొంటి గీర్వాణ భాష
ఆంధ్ర భాష అసాధ్యంబె అందు ఒక్క కృతి వినిర్మిం పుమిక మాకు ప్రియము కాగ
అంటాడు. ఈ పద్యం ప్రకారం రాయలు మదాలస చరిత్ర, సత్యావధూ ప్రీణనంబు, సకల కథాసార సంగ్రహంబు, సకల కథాసార సంగ్రహం, జ్ఞానచిం తామణి, రసమంజరీ గ్రంథాలను ఆయన రచిం చాడు. అయితే కాలగతిలో అవన్నీ కనుమరుగైపోయి ఒక్క ఆముక్తమాల్యద మాత్రమే దక్కింది. ఇవికాక జాంబవతీ పరిణయం అనే నాటకం కూడా రాశాడని అంటారు. కానీ అది కూడా దొరకడంలేదు.
రామాయణం, మహాభారతం, మహాభా గవతం, హరివంశం వంటి గ్రంథాలు సంస్కృత మూల గ్రంథాలకు అను వాదాలు. మక్కీకి మక్కీ అను వాదాలు కాకపోయినా, వా టిలోనూ కొన్ని స్వ కపోల కల్పన లున్నా గాస టబీసట గాథలుగా జనపదాలలో వినిపించే ప్రఖ్యాత కథలు తెలుగు గ్రంథాలలో చోటు సంపా దించుకున్నా, వాటిలో తెలుగు ముద్ర కంఠదగ్నంగా ఉన్నా వాటిని స్వతంత్ర రచనలు అన డానికి ఆస్కారంలేదు. తన హయాంలోనూ మను చరిత్ర, వసుచరిత్ర, పాండురంగ మాహాత్మ్యం, కళాపూర్ణోదయం వంటి రచనలు వెలువడినా వాటికి మూలకథలు సంస్కృత ప్రఖ్యాత కథలే కావడం గమనార్హం. శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాదిలో ఎంతో ప్రఖ్యాతమైన కథను ఎన్నుకుని దానికి ప్రబంధోచిత హంగులన్నీ అద్ది ఆండాళ్చరిత్రకు అక్షర రూపమిచ్చాడు. వైష్ణవులకే పరిమితమైన ఆమె కథను తెలుగు వారందరికీ తెలిసేలా చేశాడు. ద్రవిడ సాహిత్యం లో చిరకీర్తులున్న మహానుభావులెందరో ఉన్నా వారి ఇతిహాసాలను పుస్తకాలకెక్కించిన పెద్ద కవులు తెలుగులో దాదాపుగా లేరంటే అతిశయోక్తికాదు. స్వయంగా వైష్ణవమతానుయాయుడైన రాయలు ఆండాళ్తల్లి మీద అభిమానం, శ్రీకాకుళ ఆంధ్రదేవుని ఆదేశంపై ఆ దేవుడు గోదాదేవిని పరిణయమాడిన గాథను ఇతివృత్తంగా తీసుకున్నాడు. ఆంధ్రదేవుడు ఆదేశం ప్రకారమే ఈ గ్రంథాన్ని తిరుపతి వేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. ఈ పుస్తకంలో కథాప్రణాళికను రూపొందించు కో డానికి గురు పరం పరా ప్రభావం, ప్రపన్నామృతం, దివ్యసూరి చరిత్ర వంటి వైష్ణవ మత గ్రంథాలనే స్వీ కరించాడు. ఈ గ్రంథా నికి గోదా దేవి పేరు నేరుగా పెట్టినా, ఆరు ఆశ్వాశాల గ్రంథంగా దీన్ని విస్తరించినా ఆండాళ్ చరిత్ర 5వ ఆశ్వాసంలోనే ఆరంభమవు తుంది. మొత్తం 872 పద్యాలు సంతరించినా ఆండాళ్కు దక్కినవి 140 పద్యాలు మాత్రమే! ఈ గ్రంథంలో 5 విడి కథలు కనబడ తాయి. విష్ణు చిత్తుడికథ, ఖాండిక్య కేశిధ్వజ వృత్తాంతం, యామునాచార్య వృత్తాం తం, గోదాదేవి వృత్తాంతం, చండాల, బ్రహ్మరాక్షసుల కథ ప్రధానంగా కనబడతాయి.
-డా.వంగల రామకృష్ణ