Thursday, May 9, 2013

కృష్ణరాయలు-అస్తిత్వాల ప్రశ్నలు: -పాణి

రాజుల సంస్కృతి ప్రజలది అంటే చెల్లదు చెల్లదు చెల్లదులే .. అని ముప్పై ఏళ్ల కింద చెరబండరాజు అన్నాడు. సంస్కృతి, చరిత్ర అఖండం కావని, రాజరికపు సంస్కృతీ చరిత్రల కింద ప్రజల సంస్కృతి, జీవితం అణగారి పోయాయనే సత్య ప్రకటనే ఆ కవిత్వం. అందులో ఆయన రాళ్లకు పూవుల పరిమళం అంటదని కూడా అంటాడు. మట్టిలో పుట్టి పెరిగిన పూవుల గుబాళింపే నిజమైన చరిత్ర అర్థం. గత కాలంలోని ఉజ్వల ఘట్టాలు ఆధిపత్య వ్యవస్థలకు సంబంధించినవి అయినప్పుడు వాటిని విమర్శనాత్మకంగా చూడాలి.

లేకపోతే చరిత్ర పురోగామి స్వభావాన్ని విస్మరించినట్టే . రాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవాల్లో శ్రీకృష్ణదేవరాయలు నేటికీ మనకు ఆదర్శమని పాలకులు అనడం దురదృష్టకరమేమీకాదు. వారు అనవలసిన మాటే అన్నారు. ఐదు వందల ఏళ్ళకిందటి రాజు రాజరిక పాలన, ఆధునిక యుగం లో, ప్రజాస్వామ్యమని చెప్పుకుంటున్న సమాజంలో ఎట్లా ఆదర్శ ప్రాయమనే సందేహం మన పాలకులకు ఇసుమంత కూడా కలగదు. మన ప్రజాస్వామ్య స్వభావానికి అతికిన మాటే అది. అందువల్ల పాలకులు రాయల ఉత్సవాలు జరపడంలో అనౌచిత్యం ఏమీలేదు. అంతవరకే అయితే ప్రమాదం కూడా లేదు. ఇంకా చాలారకాల వాళ్లు వివిధ స్థాయిల్లో ఈ సంరంభంలో భాగమయ్యారు.

చరిత్రలో జనరంజక ఘట్టాలుగా బహుళ ప్రాచుర్యం పొందిన వాటిని పామరోచితంగా స్వీకరించడమేనా? అనే చరి త్ర సంబంధమైన ప్రశ్నను రాయల ఉత్సవాలు మరోసారి ముందుకు తెచ్చాయి.గత వైభవాల తలపోతకు చారిత్రక దృష్టి అవసరం లేదు. రాయల స్వర్ణయుగం అనే అయిదో తరగతి చరిత్ర పాఠం సరిపోతుంది. ఈనాటి పాలకుల దుర్మార్గాన్ని, ఇప్పటి సమాజ సంక్షోభాన్ని దగ్గరగా చూస్తుంటే ఆ రోజులే నయం అని ఎవరైనా అనుకోవచ్చు. ఆ రోజుల్లో ఏదో మానవాంశ ఉందనిపించవచ్చు.

అంతమత్రాన ఆధునిక యుగాని కంటే రాజరికం గొప్పదైౖ పోదు. ఎన్ని అవలక్షణాలున్నా ఆధునికత, ప్రజాసామ్యం రాజరికానికంటే చరిత్రలో ప్రగతిశీలమైన వి. అయిదే వందల ఏళ్లకింద ఓకానొకరాజు పట్టాభిషేకం తెలుగువారందరికి, తెలుగు జాతి లోని అన్ని ప్రాంతాలకు, అన్ని కులాలకు , వర్గాలకు ఎందుకు ఉత్సవం కావాలి?

రాయల ఉత్సవాలకు మూడు రకాల శక్తులు పూనుకున్నా యి. గతాన్ని ఆరాధించే సంప్రదాయ, తిరోగమన వాదులు; తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమకారులు; బలిజ కుల సంక్షేమ సంఘాల నాయకులు. ఈ మూడు బృందాల దృక్పథాలు, ప్రయోజనాలు ఒక్కటి కాదు. మొదటి బృందం పాత సమాజ అవశేషంగా వర్తమానంలో ఊపిరి తీస్తోంది. వాళ్ల భాష, వాద న, వ్యక్తీకరణ రక్తికట్టించలేని సోషల్ ఫాంటసీ. అయితే వీళ్లకు యింక ఆ చాలాకాలం ఈ నేల మీద చోటు ఉంటుంది.

అది వేరే కత. రెండో బృందంలోని వాళ్లు ఆధునికులు. ఆంగ్ల భాషా సామ్రాజ్యవాదం ముందు వెల వెలబోతున్న తల్లి భాషల పెనుగులాట వాళ్ల గొంతులో వినిపిస్తుంది. కానీ భాషలోని వైవిధ్యాన్ని, మాతృభాషా సంక్షోభాన్ని రాజకీయార్థిక పునాది మీద వివరించే పరికరాలేవీ వీళ్ల దగ్గర ఉండవు. ఎవరి మాతృభాష, ఏ కుల, ప్రాంత, వర్గాల మాతృభాష? అనే ప్రశ్నలు కీకారణ్యం గా తోచి, అక్కడి నుంచి తప్పించుకొని తాము స్వరపరచుకున్న గీతాన్నే మరింత దట్టించి ఆలపిస్తారు.

భాష సామాజిక ఉత్పత్తి అని తెలియదు కాబట్టి రాయలవారి భాషా సంస్కృతిక సేవ తలుచుకోగానే పులకాకింతులవుతారు. ఎవరి మాతృభాషా పరిరక్షణ ఉద్యమం ఇది అని దళితులో, తెలంగాణ వాళ్ళో ప్రశ్నిస్తే ఇబ్బంది పడిపోతారు. తమ ఉద్యమానికి చరిత్రలో ఒక బలమైన ఆలంబన కావాలి కాబట్టి సహజంగానే రాయలు స్ఫూర్తి ప్రదాత అయ్యాడు. ఈ ఉత్సవాల కంటే ముందు నుంచి భాషా పరిరక్షణ ఉద్యమం రాయల ప్రాభవాన్ని గానం చేస్తున్నది. అచ్చ తెనుగు మీద, మాండలికాల మీద వీళ్ల మక్కువను కాదనలేం, కానీ వీళ్ల మాతృభాషా హృదయాన్ని 'ప్రామాణికం' అనే రూపంలో సంప్రదాయం ఆవరించి ఉంది.

మూడో బృందం - స్వీయ అస్తిత్వం కోసం వెతుకుతున్న బలిజ కులస్తులు. తమ కులంలోని ఒక ప్రభావశీల వ్యక్తితో తమ సామాజిక పరంపరను ప్రతీకాత్మకంగా మలుచుకోవడం అస్తిత్వ స్పృహలో భాగం. ఒక సామాజిక బృందం తనను తాను ఎలా చూసుకుంటుంది, ఇతరులు ఆ బృందాన్ని ఎలా చూస్తారనేది అస్తిత్వానికి సంబంధించిన ముఖ్యమైన అంశం.

తమ కులం నుంచి రాజరికంలోకి ప్రవేశించిన వ్యక్తిగా బలిజ కులస్తులకు రాయలు అస్తిత్వ ప్రతీక అయ్యాడు. ఆ కులానికి అనేక సామాజిక అనుభవాలు, ప్రత్యేకతలు ఉన్నాయి గదా? ఒక రాజు ఎందుకు ప్రతీక కావాలని అంటే వాళ్లు వింటారని నమ్మకమేం లేదు. అయితే సాహు మహరాజ్‌తో పోల్చితే రాయల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం ఉండదు. యాదవుల కయితే పౌరాణిక పాత్ర అయిన శ్రీకృష్ణుడు కుల ప్రతీక అయ్యాడు. స్వీయ అస్తిత్వానికి బైట పుట్టిన వాళ్లు ఏ మాటయినా చెప్తే శంకించడం, దురుద్దేశ్యాలున్నాయనడం అస్తిత్వ చైతన్యంలో అంతర్నిహితం.

ఈ మూడింటితో పాటు రాయలసీమ అస్తిత్వ స్నృహ కూడా రాయల వేడుకల్లో ఉన్నట్టుంది. ఆ ప్రాంతం వాళ్లు రాయలతో ఐడెంటిఫై కావడానికి రాయలసీమ అనే మాటే చాలు, రెండో మాట అక్కర్లేదు. రేప్పొద్దున ఆ ప్రాంత అస్తిత్వ స్పృహ నిలదొక్కుకుంటే అందులో రాయలవారు స్థిరపడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణలో ఇది చూస్తునే ఉన్నాం. తెలంగాణ వాదులు తమ ఉజ్వలమైన సంప్రదాయాలను, ప్రత్యేకతలను పునర్నిర్మించే పనిలో పనిగా నిజాం నవాబుకు కూడా సముచితస్థానం ఇచ్చేశారు. కోస్తాంధ్ర వలసవాదులతో వాళ్లు- మీ విక్టోరియా మహారాణి, మా నిజం నవాబు అని సంవాదం చేశారు.

రాయల ఉత్సవాల సందర్భం గా చారిత్రక దృక్పథం, భాషా సాహిత్య విషయాలు, అస్తిత్వ స్పృహ మొదలైనవి మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. చరిత్ర గురించి పిట్టకథలు ప్రచా రం కావడం కూడా చరిత్ర ప్రాబల్యాన్ని, వర్తమాన ప్రజలకు గతం తో ఉండే పేగు బంధాన్ని సూచిస్తుంది. చరిత్ర అనే సామాజిక శాస్త్రం పట్టుబడని సమాజంలో పౌరాణికాలు, పిట్టకథలే చలామణిలో ఉంటాయి. రాయలనాటి వైభవం అంతఃపుర వైభవమా? ప్రజా వైభవమా? అనే ప్రశ్న చారిత్రక దృష్టికి సంబంధించింది.

విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర మినహా మెట్ట వ్యవసాయం కింద నిర్మాణమైంది. కనీసం తెలుగు ప్రాంతం వరకైనా, అప్పుడు రత్నాలు రాసులు పోసి అమ్మినారనే గాథ వెనుక ఏ ముందో తెలుస్తుంది. మెట్ట ప్రాంతంలో రాజరికాన్ని నిలబెట్టుకోవడానికి ఏమి చేయాలో రాయలకు బాగా తెలుసని చెప్పవచ్చు. దీనికి ఆయన చేపట్టిన నీటి పారుదల పద్ధతులు మంచి ఉదాహరణ.

బహుశా రాజులు, సంస్థానాధీసు లు చాలావరకు ఇలాంటి పద్ధతులు పాటించిన వాళ్లే. వీటి అమలులో రాజుల ఉద్దేశ్యాలే గాక ప్రజల పరంపరాగత జ్ఞానం కూడా ఉన్నది. రాయల ప్రాభవం గురించి కథనాలున్నట్టే ప్రజా జీవితం దుర్భరంగా ఉండేదనడానికి చాలా ఆధారాలున్నాయి. రాజరిక వ్యవస్థకు భిన్నంగా రాయల సామ్రా జ్యం మాత్రం ఎట్లా ఉండి ఉంటుంది? రాయలు ఒక ఆధిపత్య వ్యవస్థకు మేటి ప్రతినిధి. విజయనగర సామ్రాజ్యం కింద ఉన్న భూభాగంలో నిత్య యుద్ధాలతో పాటు సుస్థిర పాలన కొనసాగింది కృష్ణ రాయల కాలంలోనే. పల్లెల నుంచి సంపద కొల్లగొట్టకుండా సుస్థిర పాలన, పటిష్టమైన సామ్రాజ్య విస్తరణ, నిర్మా ణం సాధ్యం కాదు.

రాయల భాషాభిమానం అంతఃపుర సంప్రదాయానికి చెందినది. ఇది రాజరిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. అంతకంటే భిన్నంగా ఉంటుందనుకోవడం చరిత్ర పట్ల అమాయకమైన ప్రేమే. రాయల భాషా సేవ ప్రాతిపదిక మీద ఆయనతో తెలుగు ప్రజలందరి మమేకత సాధించాలనుకోవడం చారిత్రక దృక్పథం అనిపించుకోదు.

కన్నడరాయుడుగా పేరు పొందన రాయలను తెలుగు రాజుగా చూపడానికి చేస్తున్న ప్రయత్నాలలో జాతి ప్రాతిపదిక ఉన్నది. ఆయన తెలుగువాడు అవునా కాదా అనే చర్చలోకి పోవడం లేదు గాని, జాతి భావనను రాజుల ఆధారంగా కూడా నిర్మిద్దామనే ప్రయత్న మది. మాతృభాషా ఉద్యమానికి పాల్కుర్కి సోమనాథుడు, వేమన , వీర బ్రహ్మం స్ఫూర్తి అవుతారు కాని రాయలు కాడు. రాయలసీమ అస్తిత్వానికి కూడా ఆధిపత్య వ్యవస్థ ప్రతినిధి అయిన రాÄలు ప్రతీక కాజాలడు.

అస్తిత్వ భూమిక మీదికి వెళ్లాక చరిత్ర గురించిన వాస్తవిక దృష్టి కొరవడుతుందని రాయలచుట్టూ తిరుగుతున్న తెలుగు ఆలోచనా పరులు రుజు వు చేస్తున్నారు. ఎవరి మాతృభాష? ఎవరి సాహిత్యం? అని ప్రశ్నించిన అస్తిత్వ చైతన్యంలోకి రాజరికం-ప్రజలు మౌలిక విభజన విస్మరణకు గురైందని చెప్పక తప్పదు. రాజరికం ఒక రాజకీయార్థిక సాంఘిక వ్యవస్థ అనే విషయాన్ని పక్కన బెట్టి జాతి సాంఘిక అస్తిత్వం , భాషా సంస్కృతుల తలపోత ఇది. 'తెలుగు భాషలెస్స' అన్నాడు కాబట్టి రాయలు తెలుగు భాషా సాహిత్య వికాసానికి , బలిజ కులంలో పుట్టాడు కాబట్టి ఆ కులస్తులకు, రాయల పాలనలో ఉన్న భూ భాగం కాబట్టి రాయలసీమ వాళ్లకు ప్రతీక కావడం దీని వల్లనే.
-పాణి(Andhra jyothy: 21 july 2010)

Tuesday, April 16, 2013

తెలుగు భాషోద్దారకుడు శ్రీ కృష్ణదేవరాయలు !

శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది పట్టాభిషే కోత్సవం కర్ణాటకలోని బళ్ళారి జిల్లా 'హంపి'లో 2010 జనవరి 27, 28, 29 తేదీల్లో 'హంపీ మహోత్సవ్‌' పేర కర్ణాటక ప్రభుత్వం ఎంతో డబ్బు ఖర్చుచేసి మహా వైభవంగా నిర్వహించింది. ఆ సందర్భంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన ఆనాటి సమాచార వివరణలో ప్రొ|| ఎం.ఎం.కల్‌బురిగి ప్రసంగంలోని మాటలు అందరినీ ఆకర్షించాయి. కల్‌బురిగి గారు హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయం మాజీ కులపతులు; పండితులు; విమర్శకులు. వారు ఆంగ్లంలో వివరించిన మాటలు గమనించదగ్గవి. 'విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు (శ్రీకృష్ణదేవరాయలు) వాస్తవానికి కన్నడ సంస్కృతి అంటే అభిమానమున్న వాడేనా, పోషించినవాడేనా అని ఆలోచించాలి. ప్రస్తుతం కర్ణాటకలో శ్రీకృష్ణదేవరాయలు కన్నడ సంస్కృతికి అత్యుత్సాహం చూపలేదని భావించే కన్నడ పరిశోధకులు, కన్నడ చారిత్రకవేత్తలు చాలామందే ఉన్నారు. అంతేగాక శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక ప్రాంతంలో వలసదారులు చొరబడటానికి పాక్షికంగా బాధ్యుడు'.
'కన్నడ భాషాభ్యున్నతికి శ్రీకృష్ణదేవరాయులు ఏ మాత్రం కృషి చేయలేదు. శూన్యం. ఆయనను కన్నడ వ్యతిరేకి అనడానికి నేనుమాత్రం సందేహించడం లేదు. ఒక రకంగా మా భాషను (కన్నడం) తొక్కిపె ట్టాడు. తన ఆస్థానంలో తెలుగు కవులను పోషిం చాడు. అంతేగాదు, దీనికితోడు తమిళులను ప్రోత్స హించాడు. ప్రస్తుతం బెంగళూరులో ప్రముఖ స్థానా ల్లో తమిళులు జీవిస్తున్నారంటే, దీనికంతటికీ శ్రీకృష్ణ దేవరాయలే కారణం' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతేగాదు ప్రొ|| కల్‌బురిగి కన్నడ భాషలో 'కృష్ణదేవరాయ తెలుగు సంస్కృతియ ఆక్రమణ' (కృష్ణదేవరాయల తెలుగు సంస్కృతి ఆక్రమణ) అనే పేరుతో రచించిన వ్యాసంలో శ్రీకృష్ణదేవరాయులు తెలుగువాడు కాబట్టి తెలుగు భాషా సాహిత్య సంస్కృతులకిచ్చినంత ప్రాధాన్యం కన్నడ భాషా సాహిత్యాల కివ్వలేదని చాలా ఆవేదన వ్యక్తం చేశారు. 'శ్రీకృష్ణ దేవరాయలు స్వంతంగా ఆముక్తమాల్యద కావ్యాన్ని తెలుగులో రచించాడు. అష్టదిగ్గజాలనే పేరుతో తెలుగులో ఎనిమిదిమంది ప్రసిద్ధ కవులకు ఆశ్రయమిచ్చాడు. అల్లసాని పెద్దనకవికి 'ఆంధ్ర కవిపితామహుడు' అన్న బిరుదుతో సత్కరించి, తమ చేతులతో ఆ కాలికి గండపెండేరం తొడిగి, ఆ కవి పల్లకిని తాను మోసి ప్రసిద్ధికెక్కాడు. తెలుగు సాహిత్య చరిత్రలో కృష్ణదేవరాయల యుగం 'స్వర్ణయుగంగా నిర్మించి తెలుగు భాష, సాహిత్యాలకు కర్ణాటకలో ప్రాధాన్య మిచ్చి ప్రసిద్ధి తెచ్చాడు. రాయలు కన్నడ రాజయినప్పటికీ 'ఆంధ్రభోజుడు'గా కీర్తింపబడ్డాడు. పై పెచ్చు 'దేశభాషలందు తెలుగు లెస్స' అని చాటాడు. తెలుగుభాష తరువాత ఆయనకు ప్రీతిపాత్రమైనది, పోషించింది 'సంస్కృతం'. స్వంతంగా తానే 'జాంబవతీపరిణయము' అనే పేరు తో సంస్కృతంలో నాటకం రచించాడు. సంస్కృతం లో అనేక గ్రంథ రచనకు అవకాశం కల్పించాడు. కాగా ఇతర భాషా సాహిత్యాల వైభవాలనడుమ గుడ్డిలో మెల్లగా చమత్కారంగా తిమ్మణ్ణ (కన్నడకవి) నుంచి ఒకే ఒక కన్నడ కావ్యం 'దత్తరార్ధ మహా భారతం' స్వీకరించాడు. బహుశా ఈ 'తిమ్మణ్ణ' పేరు వింటే తెలుగు మాతృభాషగా గలవాడై ఉంటాడని పిస్తుంది. మొత్తంమీద కృష్ణదేవ రాయల రాజ్యకాలం లో కన్నడ భాషా సాహిత్యాలకు ప్రోత్సాహం లేదనే చెప్పవలసి ఉంది'.
'తులనాత్మకంగా పరిశీలించి చెప్పాలంటే ఈ కర్ణాటక చక్రవర్తి కన్నడ దేశంలోని దేవతలకంటే తెలుగునాడులోని దేవతలకు ఎక్కువ తీర్ధయాత్రలు చేసినట్లు తెలుస్తుంది. కొన్ని దేవాలయాలకు ఒక్కొక్క సారి తీర్థయాత్ర చేసినా, తిరుపతికి మాత్రం ఏడు పర్యాయాలు తీర్ధయాత్ర చేసినతీరు గమనార్హం.'
'వాస్తవస్థితి ఏమంటే కృష్ణదేవరాయలు కర్ణాటక సంస్కృతికి మిక్కిలి హాని చేసినవాడుగా కనిపిస్తాడు. ఇప్పుడు దానికి సంబంధించి సత్యాలను శోధించ వలసిన అవసరముంది'.
'కృష్ణదేవరాయలు కన్నడ విరోధాన్ని ప్రారంభిం చాడు. తెలుగు పరోపకారమనే దుష్టపరిణామానికి తెరతీశాడు. కర్ణాటకలోని బళ్ళారి, రాయచూరు, కొప్పళ జిల్లాలు తెలుగువారి వశమయ్యాయి. వ్యాపారం, రాజకీయం మొ||నవి ఆ తెలుగువారి చేతుల్లోకి పోయాయి. ఇంతేగాక తుంగభద్రానది ఆనకట్ట సిద్ధమయ్యేసరికి తెలుగువారు కన్నడిగుల అపార భూములను కొన్నారు. ఒక అర్థంలో వారు కొన్నది పొలం కాదు. భూమి కొన్నారు. ఈ మూడు జిల్లాల్లో రాజకీయంగా శాసనసభ మొదలుకొని మండల పంచాయితీ, తాలూకా పంచాయితీలలో అధ్యక్షత వహించి, తెలుగువాళ్ళే ఏలుతున్నారు. కర్ణాటక దేవుడైన విరూపాక్ష దేవుని ఆచార్యత్వంలో తెలుగువారే ముందున్నారు. వీటన్నింటిలోను శ్రీకృష్ణదేవరాయలు తెలుగువారికిచ్చిన అవకాశాల్లో మూలాలున్నాయి'.
ఇలాగే ఇంకా శోధిస్తే అనేకాంశాలు తెలుస్తా యని పేర్కొన్నారు ప్రొ|| కల్‌బురిగి గారు.
ప్రొ|| కల్‌బురిగి ఆవేదనతో పేర్కొన్న మాటలలో ఎంతవరకు సత్యముందో కొందరు ఇతర కన్నడ సాహితీవేత్తల, చరిత్రకారుల మాటలను గమనిస్తే మనకు స్పష్టమవుతుంది. రాయలు ఎక్కడివారు? సొంతభాష ఏది? రాజభాష ఏది? అనే అంశాలను పరిశీలించవలసి ఉంది.
డా|| సూర్యనాధకామత్‌ తుళువంశ మూలాల్ని వివరిస్తూ తుళువంశ సంభూతులుగా వీరిని యాదవులుగా పేర్కొన్నారు. తుళునాడు నుంచి వచ్చారని కూడా చెప్పారు.
ప్రసిద్ధ చరిత్రకారులు మారేమండ రామారావు కూడా 'కృష్ణదేవరాయ' అనే ఆంగ్ల గ్రంథంలో ఈ అంశాల్నే పేర్కాన్నారు. ఇంకా డా|| చా.రా.గోపాల్‌ సైతం ఈ అంశాన్ని స్థిరీకరించారు. 8 తుళువంశ సంజాతులనీ, వారు యాదవులనీ నిర్ణయం. ఈ విషయాలనే రాయలు ఆముక్తమాల్యదలోను, అల్లసాని పెద్దన మనుచరిత్రలోను, నంది తిమ్మన పారిజాతాపహరణంలోను తుర్వసువంశీయులని ప్రశంసించారు. కాగా నంది తిమ్మన కృష్ణదేవరాయలు రిష్ష్వంశ సంభూతుడు శ్రీకృష్ణ దేవరాయలు కృష్ణునిలా యాదవంశంలో జన్మించినట్లు స్పష్టం చేశారు.
'నాడు నేడును యాదవాన్యాయమునందు
జననమందెను, వసుదేవ మనుజవిభుని
కృష్ణుడను పేర నరసేంద్రు కృష్ణదేవ
రాయడనుపేరనాది నారావియన్నుండు.'(పు.12)
శ్రీకృష్ణదేవరాయల భాష కన్నడం. కానీ రాజభాష మాత్రం తెలుగు. ఈ విషయాన్ని కన్నడ సాహితీవేత్తలే పేర్కొన్నారు.
'ఈ చక్రాధిపత్యద రాజధాని విజయనగరం ఇల్లిన ప్రసిద్ధ అరస కృష్ణదేవరాయ. ఆతన ఆస్థానదల్లి అదను తెలుగు, ఆస్థానవల్లి అనేక భాషగళన్ను మాతనాడుత్తిద్దరు. ఆతన సహజ వాద భాషె కన్నడ' 'ఈ సార్వభౌముని రాజధాని విజయనగరం. ఇందు ప్రసిద్ద రాజు శ్రీకృష్ణదేవరాయలు. రాయల ఆస్థానం లోని భాష తెలుగు. ఆస్థానంలో అనేక భాషలు మాటలాడుతూ ఉంటారు. అయినా అతని సహజ మైన భాష కన్నడం కాబట్టి రాయలు అభిమానించే ఆస్థానంలోని అధికారభాష తెలుగు. తన మాతృభాష కన్నడం. అలాంటి కన్నడ రాయడు తెలుగును రాజభాష చేసుకోవడం విశేషం. 'దేశభాషలందు తెలుగులెస్స' గనుక.
తెలుగును అధికార భాషగా చేసుకొన్న ఘనత రాయలవారిది. ఈ విషయాన్ని శ్రీనిడదవోలు వెంకటరావు స్థిరీకరించారు. 'తెలుగు అధికార భాష: నేడాంధ్ర రాష్ట్రమున తెలుగును అధికార భాషగా చేయు ప్రయత్నములు సాగుచున్నవి. కానీ ఇప్పటికి నాలుగు వందల యేండ్ల క్రిందటనే కృష్ణదేవరాయలు, తెలుగును అధికార భాషగా చేసినాడు' అధికార భాషగా తెలుగు చేయడమేగాక 'దేశభాషలందు తెలుగులెస్స' అని చాటినది రాయలే. తెలుగు, కన్నడ, తమిళ భాషల రాజులు తమ సభలోనుండగా, రాయలు తెలుగు భాషలోనే ప్రసంగించెను. తెలుగు భాష (రాజకీయాధికార భాష)లోనే మాట్లాడెనని సిద్ధాంతము. తెలుగును మొదట అధికార భాషగా చేసిన కీర్తి ఆయనకే దక్కినది'.
కాగా రాయలు తెలుగు కవి పండితులను మాత్రమే పోషించాడనీ, రాయలు తెలుగు సంస్కృతికి మాత్రమే వారసుడని ప్రొ|| కల్‌బురిగి పేర్కొని ఆవేదనను ప్రకటించినప్పటికీ అది వాస్తవం కాదని భావించవలసి ఉంది.
శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. సంస్కృతంలోనేగాక తెలుగులో 'ఆముక్తమాల్యద' మహాప్రబంధకర్త. అష్టదిగ్గజ కవుల పోషకుడు. ఇంతేగాదు కన్నడకవి 'తిమ్మణ్ణ' రచించిన 'భారత కథామంజరి' కన్నడ కావ్యాన్ని అంకితం పుచ్చుకొన్నారు. కన్నడ భాషలో దాస సాహిత్యానికి మూల పురుషుడైన వ్యాస రాయలు రాయల రాజగురువు వ్యాసరామ మఠంలో పురంచరదాసు, కనకదాసాది కన్నడ కీర్తనకారులు రాయల పోషణలోని వారే. ఆంధ్ర దేవాలయాలతో పాటు కన్నడ దేవాలయాలను దర్శించి కానుకలర్పించిన మహా ధార్మికుడు. ఈ వివరణతో ప్రొ|| కల్‌బురిగి ఆవేదన పరాస్తమవుతుంది.
శ్రీకృష్ణదేవరాయులు తుళువంశ సంభూతుడు. కన్నడం తన భాష. కానీ రాయల తల్లి నాగలాంబ. తెలుగు వనిత. తల్లి భాష తెలుగు. తెలుగుతోపాటు ఆనాటి దక్షిణదేశ స్థితినిబట్టి కన్నడం, తమిళభాషలను పోషించిన మహనీయుడు. చిత్రశిల్ప కళలను, సంగీతములను సమంగా పోషించిన కళాప్రియుడు. దేవాలయ నిర్మాణంలో అతనికతనే సాటి. అన్ని యుద్ధాలలోను విజేత. భారత జాతీయ సమైక్యాన్ని, లౌకికవాదాన్ని ఆదరించి, శ్రేయోరాజ్యాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి- కాదు- శక్తి. ఆ మహనీయుని పంచశతాబ్ది పట్టాభిషేకోత్సవాలు ప్రజలకు స్ఫూర్తిదాయకం. పై పెచ్చు తెలుగు భాషకు ఆనాడే ఎంతో ప్రాధాన్య మిచ్చిన తెలుగు భాషా ప్రియుడు, పోషకుడు.
'తెలుగ దేలయన్న దేశంబు తెలు, గేను
తెలుగు వల్ల భుండ, తెలుగొకండ
ఎల్లనృపులుగొలువ నెరుగనేబాసాడి ,
దేశభాషలందు తెలుగులెస్స'.
- ఆచార్య ఎస్‌.గంగప్ప