శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో కడప జిల్లా చెన్నూరు వద్ద గల నాగనాధ స్వామి ఆలయం వద్ద ఉదయగిరి సామంత పాలకుడు
జూపల్లి పెద సింగమ నాయుడు వేయించిన అరుదైన గండభేరుండ శాసనం ఆలనా పాలన లేక ఆలయ ప్రాంగణంలో పడి ఉంది. పది అడుగుల ఎత్తు గల రాతి స్తంభం పై ఈ శాసనాన్ని చెక్కారు. క్రీ.శ .1524 లో ఆ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసిన సందర్భంగా ఈ శాసనాన్ని వేశారు. శాసనం లోని అంశాలు మూడు వైపులా చెక్కబడి ఉన్నాయి. జూపల్లి రాజవంశీకుల వంశావళిని సంస్కృత శ్లోకాల రూపంలో ఈ రాతిపై చెక్కారు.ఆలయ జీర్ణోద్ధరణ సందర్భంగా ఆలయానికి మడులు మాన్యాలు సమర్పించిన దాతల వివరాలను కూడా ఈ శాసనంలో పొందుపరిచారు.ఈ శాసనంలో చెక్కబడిన రెండు తలల గండభేరుండ పక్షి నాలుగు హస్తాల్లో నాలుగు సింహాలను, రెండు పాదాల్లో రెండు ఏనుగులను పట్టుకుని బీభత్స రూపంలో ఉంది. గండభేరుండ పక్షి సింహాల తలలను రెండు నోళ్ళతో భక్షిస్తూ ఉంది. ఈ స్తంభానికి మరో పార్శ్వంలో పెద్దపులి, భైరవ ప్రతిమలను కూడా చెక్కారు.
****
**గతంలో చెన్నూరు గ్రామం ఈ ఆలయానికి సమీపంలో ఉత్తరదిశగా ఉండేదని, కాలక్రమంలో ఇక్కడికి
ఈశాన్యదిశలో పెన్నానది ఒడ్డున గ్రామం వేలిసిందని తెలుస్తోంది. ఆలయానికి ఉత్తరదిశలో ప్రజల ఆవాసానికి సంబంధించిన ఆధారాలు పెంకులు, కట్టడపు రాళ్ళ రూపంలో కనిపిస్తూ ఉంటాయని ఉప్పరపల్లె గ్రామప్రజలు తెలిపారు.
***
జూపల్లి రాజవంశీకులు శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామంతులు గా, ఉదయగిరి దుర్గ నాయంకరులుగా కడప జిల్లాలోని చెన్నూరు, పొట్లదుర్తి సీమలను కూడా పాలించారు.