Friday, August 17, 2018

రాయల చరిత్రపై కొత్త వెలుగు


నేలటూరి వెంకట రమణయ్య, కె.ఎ.నీలకంఠశాస్త్రి అనుకొన్నట్లుగా 1509 ఆగస్టు 7 లేక 8వ తేదీ కాక, క్రీ.శ.1510 జనవరి 24న కృష్ణరాయలు పట్టాభిషిక్తుడైనాడని హంపీ, సింగనాయకనహళ్లి శాసనాలు నిరూపించాయి.
విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన ఇరవైయేండ్ల పాలనలో అరవయ్యేండ్ల అభివృద్ధిని అందించిన మహోన్నత పాలకుడు. ఆనాటివాడైనా ఈనాటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. ఆ మహా వీరుని పుట్టిన రోజు, పట్టాభిషిక్తుడైన రోజు, మరణించిన రోజు ఇదిఅని ఖచ్చితంగా చెప్పగల ఆధారాలు దొరక్కపోవటం మన దురదృష్టం.

తన పట్టాభిషేకానికి పూర్వం, అన్న వీరనరసింహ రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు అతనికి కృష్ణదేవరాయలు తోడ్పడినట్లు కొంగుదేశ రాజాక్కరన్‌ అన్న గ్రంథంలో ఉంది. కుమార ధూర్జటి రాసిన కృష్ణరాయ విజయంలో వీరనరసింహ రాయలు, శ్రీకృష్ణరాయనికి పట్టం కడతానని అప్పాజీతో అన్నట్లు చెప్పబడింది. స్థానాపతి రచించిన రాయవాచకంలో, వీరనరసింహ రాయలే శ్రీకృష్ణదేవరాయలకు పట్టాభిషేకం చేయమని ఆజ్ఞాపించాడని చెప్పబడింది. క్రీ.శ.1604లో రెండో వీర వెంకటపతి రాయలవారి ఆజ్ఞ మేరకు ఆయన అఠ్ఠవణీయ (దినచర్య) కర్తలు తయారుచేసిన విజయనగర సామ్రాజ్యమనే పాళ్యపట్టు కడితంలో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం క్రీ.శ. 1509 ఆగస్టు 7వ తేదీన మంగళవారం నాడు (శాలివాహన శకం 1432, శుక్ల సంవత్సరం, శ్రావణమాసం, శ్రీకృష్ణ జన్మాష్టమి) జరిగిందని పేర్కొనబడింది.

ఇది ఇలా ఉంటే, శాసనాల్లో మరోరకమైన సమాచారముంది. అవి చూసిన తరువాత, సాహిత్యాధారాలను తడిమిన తరువాత కృష్ణరాయని పట్టాభిషేకానికి సంబంధించిన తేదీల్లో వివాదాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ సందర్భంగా బళ్లారి జిల్లాలోని గుళ్యగ్రామ శాసనం, హంపీలోని విరూపాక్షాలయ శాసనం, సింగ్గెనాయకనహళ్లి శాసనం పొంతన కుదరని పట్టాభిషేక తేదీలను సూచిస్తున్న సంగతిని గుర్తుకు తెచ్చుకోవాలి. బళ్లారి జిల్లా గుళ్యశాసనం శాలివాహన శక సంవత్సరం 1431, శుక్ల, శ్రావణ శు.10 బృహస్పతివారం నాడు కృష్ణరాయల విజయనగర రత్న సింహాసనంపై కూర్చొని పాలిస్తున్నట్లు చెబుతుంది. దీని ప్రకారం ఆయన క్రీ.శ.1509 సంవత్సరం, జూలై 26వ తేదీ నాటికే పట్టాభిషిక్తుడై పాలిస్తున్నాడని చెప్పటానికి వీలు చిక్కింది.

అంతకు కొద్ది ముందువైన మరో రెండు శాసనాల్లో వీరనరసింహరాయలు విజయనగర సింహాసనంపై ఆసీనుడైనట్లు చెప్పబడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అవి, అనంతపురంజిల్లా తాడిపత్రి శాసనం, దక్షిణ ఆర్కాటు జిల్లా విక్రవాండి శాసనం. తాడిపత్రి శాసనంలో శా.శ. 1431 తరువాత, శుక్లనామ సంవత్సర వైశాఖ శు. 15 శుక్రవారం నాడు వీర నరసింహరాయలు విజయనగర సింహాసనం పై నుంచి పృథ్వీ సామ్రాజ్యమేలుతున్నట్లుగా ఉంది. ఈ తేది క్రీ.శ. 1509 మే 4వ తేదీకి సరిపోతుంది. అలాగే విక్రవాండి శాసనంలో విక్రమనామ సంవత్సర కర్కాటక శు. 5 శుక్రవారం, హస్తా నక్షత్రం నాడు వీర నరసింహరాయలు విజయనగరం నుంచి పాలిస్తున్నట్లు పేర్కొనబడింది. ఇది క్రీ.శ. 1509, జులై 22వ తేదీకి సరిపోతుంది.

కడప జిల్లాలోని పులివెందుల శాసనంలో శా.శ. 1431, శుక్ల సంవత్సర కార్తీక మాసమున కృష్ణరాయలు విజయనగర పృథివి రాజ్యము చేయుచున్నట్లుగా నమోదు చేయబడింది. ఇది క్రీ.శ. 1509 ఆగస్టు -సెప్టెంబరు నెలకు సరిపోతుంది. దీనివల్ల వీరనరసింహరాయలు, 1509 జూలై 22వ తేదీ వరకు విజయనగర సింహాసనంపై ఉన్నాడని తెలుస్తుంది. ఇద్దరికీ మధ్య తేడా కేవలం 4 రోజులు మాత్రమే. ఇదే విషయాన్ని నేలటూరి వెంకట రమణయ్య పరిశీలిస్తూ, కృష్ణదేవరాయలు క్రీ.శ. 1509 జూలై 22–-26 తేదీల మధ్య ఒకరోజు రాజ్యాధికారాన్ని చేపట్టాడని చెప్పాడు. ఇదే శ్రీకృష్ణదేవరాయని తొలి తెలుగు శాసనం.

దీనిని బట్టి శ్రీకృష్ణదేవరాయలు, క్రీ.శ. 1509, జూలై 26వ తేదీనాడు సింహాసనం మీద ఉన్నాడని బళ్లారి జిల్లా గుళ్య శాసనంలో ఉండగా, క్రీ.శ. 1509, ఆగస్టు నాటి పులివెందుల శాసనం ఆ విషయాన్ని రూఢిపరుస్తుంది. అయితే ఈ రెండు శాసనాల్లో కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్నట్లుంది గానీ, పట్టాభిషేక ప్రస్తావన లేదు. హంపీలోని విరూపాక్ష దేవాలయ రంగమండపం దగ్గరున్న శ్రీకృష్ణరాయని కన్నడ శాసనంలో తుళువ వంశ వివరాలే కాక ఆయన తన పట్టాభిషేకం జరిగిన నాడు, విరూపాక్ష దేవుని అమృతపడి నైవేద్యం కొరకు సింగనాయకనహళ్లి గ్రామంతో పాటు విరూపాక్ష దేవాలయ రంగమండప, గోపురాలను కూడా నిర్మించాడని చెప్పబడినది. ఈ శాసన తేదీ 1510 జనవరి 24 అవుతుంది. ఈ శాసనం ప్రముఖ చరిత్రకారులైన నేలటూరి వెంకట రమణయ్య, కె.ఎ.నీలకంఠశాస్త్రి అనుకొన్నట్లుగా క్రీ.శ. 1509 ఆగస్టు 7 లేక 8 వ తేదీ అన్న వాదనను సవరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. పైగా ఓరుగంటి రామచంద్రయ్య కూడా పట్టాభిషేకం తేదీ క్రీ.శ. 1510 జనవరి 24 గానే అంగీకరించాడు.

మరో విషయం ఏమిటంటే, హంపీకి దక్షిణంగా 4 కి.మీ. దూరంలో వున్న సింగనాయకనహళ్లిలోని కృష్ణరాయని మరో కన్నడ శాసనంలో కూడా రాయలు పట్టాభిషేకం చేసుకొన్న సందర్భంగా విరూపాక్ష దేవునికి అదే గ్రామాన్ని క్రీ.శ. 1510 జనవరి 24న దానం చేస్తున్నట్లు వివరాలు మేళవించబడినాయి. హంపీ విరూపాక్ష దేవాలయశాసనం, సింగనాయకనహళ్లి శాసనాలు రెండూ శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1510 జనవరి 24వ తేదీ తన పట్టాభిషేకం సందర్భంగా దానాలు చేసినట్లు పేర్కొంటున్నాయి. ఈ రెండు శాసనాలలో కృష్ణదేవరాయల పట్టాభిషేకం క్రీ.శ. 1509 జూలై ఆగస్టు నెలలో కాక క్రీ.శ. 1510 జనవరి 24న జరిగిందని కచ్చితంగా రుజువు చేస్తున్నందున, సాంప్రదాయ చారిత్రక నమోదు పద్ధతిలో రెండవ వేంకటపతి రాయల కోరిక మేరకు రాసిన విజయనగర సామ్రాజ్య వివరాల్లో పేర్కొన్న పాలనా ప్రారంభ తేదీ క్రీ.శ. 1509 ఆగస్టు 7వ తేదీని ప్రశ్నించడమే కాక కృష్ణరాయని పట్టాభిషేక సందర్భంగా క్రీ.శ. 1510 జనవరి 24వ తేదీన కొన్ని దానాలు ఇచ్చినట్లు తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని సి.యస్‌. పాటిల్‌తోపాటు డాక్టర్‌ డి.వి.దేవరాజ్‌ కూడా బలపరిచారు.

కర్ణాటకలోని విజయనగర శాసనాలను క్రోడీకరించిన బి.ఆర్‌.గోపాల్‌ కూడా ఈ రెండు శాసనాధారాలను విస్మరించటం బహుశా వారి దృష్టికి రాకపోవటమేనేమో. ఏది ఏమైనప్పటికీ వీరనరసింహరాయనికి పాలనా వ్యవహారాల్లో సహకరిస్తున్న కారణంగా అతని పేరున శాసనాలు విడుదలై వుండవచ్చు. నిజానికి హంపీ, సింగనాయకనహళ్లి శాసనాలు కృష్ణదేవరాయలు క్రీ.శ. 1510 జనవరి 24న పట్టాభిషిక్తుడైనాడని నిరూపిస్తూ, ఇంతవరకు ఈ విషయంగా పేర్కొన్న ఆధారాలను సవరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. అంతే కాక కొందరు చరిత్రకారులు పేర్కొంటున్నట్లుగా ఫిబ్రవరి 4వ తేదీ రాయలు పట్టాభిషిక్తుడైనాడన్న వాదన కూడా వివాదమైంది.

పైన పేర్కొన్న స్థానిక రికార్డులు, సాహిత్య శాననాధారాలను ఒక్కచోట ఉంచి పరిశీలించి చూస్తే, వీర నరసింహరాయని పాలనా వ్యవహారాలలో కృష్ణరాయలుకు 1508 జూలై చివరి వారం నుంచి ప్రత్యక్ష ప్రమేయమున్నా, రాయలే విడుదల చేసిన హంపీ, సింగనాయకనహళ్లి శాసనాలద్వారా అతడు క్రీ.శ. 1510 జనవరి 24వ తేదీన పట్టాభిషిక్తుడైనాడని తేదీల్లో వాదాలను, వివాదాలను పక్కన పెడుతూ నిజాన్ని నిరూపించాయి.

ఆంధ్రజ్యోతి 8-8-18
 డా. పెదారపు చెన్నారెడ్డి
 డా. ఈమని శివనాగిరెడ్డి - స్థపతి

No comments:

Post a Comment