Friday, August 6, 2010

రాయల వంశీకులు ఇంకా ఉన్నారా?

రాజ్యాలు పోయాయి.. రాచరిక వ్యవస్థా అంతరించిపోయింది. అయినా ఒకనాటి రాజరిక ఔన్యత్యాన్ని తలచుకుంటూ శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచశతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ముగింపు ఉత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి రాయలవారి రెండో రాజధాని పెనుగొండలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయన వంశీకులు ఇంకా ఉన్నారా? ఉంటే ఎలాంటి జీవితం గడుపుతున్నారు? అనే ఉత్సుకతతో వారిని వెతుక్కుంటూ వెళ్లింది 'ఆన్‌లైన్'. ఆనెగొందిలో నివసిస్తున్న రాయల వంశానికి చెందిన 17వ తరం వారిని పలకరించింది. రాజసం ఉట్టిపడుతున్నా రాచరికపు పోకడలు ఏమాత్రం కనిపించని శ్రీరంగదేవరాయలు, లలితారాణిల జీవితాలను గమనించింది. ఆ సంగతులేంటో చదవండి.
శ్రీకృష్ణదేవరాయలు వంశానికి చెందిన 17వ తరం వారు ప్రస్తుతం గంగావతి, ఆనెగొందిలో నివాసం ఉంటున్నారు. అక్కడి ప్రజలకు ఇవాళ్టికీ రాయల కుటుంబమంటే ఎంతో గౌరవం. ఆ కుటుంబంలోని వారు ఎవరు వీధి వెంబడి వస్తున్నా పురుషులు వెంటనే లేచి నిలబడతారు. మహిళలు ఇళ్లలోకి వెళ్లిపోతారు. ఆనెగొందిలోనే కాదు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగినా రాయల కుటుంబీకులకు ప్రత్యేక ఆహ్వానం అందుతుంది. ఇంటికి వచ్చేవారిని ఆప్యాయంగా పలకరించడం, చేతనయిన సాయం చేయడం రాయల కుటుంబీకుల సంప్రదాయం.

ఆనెగొందిలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా రాయల వారి ఇంటి నుంచే తాళిబొట్టు వెళుతుంది. చిన్నాపెద్ద, కులమత తారతమ్యాలు ఈ గ్రామంలో అస్సలు కనిపించవు. ముస్లింలు సైతం ఏ పండుగ వచ్చినా నమాజ్ చేసిన తర్వాత నేరుగా రాయలవారి ఇంటికే వెళ్లిపోతారు. వారికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలుపెడతారు. అలాగే హిందువుల పండగలప్పుడు కూడా గ్రామస్థులకు రాయలవారి నుంచి కానుకలు అందుతాయి.
ఈ ఆచారం వందల సంవత్సరాలుగా ఆ గ్రామంలో కొనసాగుతోంది. గ్రామంలో ఏ మతస్థుల ఇంట్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిగినా మరో మతం వారు సహాయం చేస్తారు. ఇంతటి ఐక్యత ఆనెగొందిలో కనిపిస్తుందంటే అది రాయల వారి చలవే అని చెబుతారు గ్రామస్థులు. ప్రభుత్వ పరంగా కూడా అధికారులతో మాట్లాడి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కూడా రాయల కుటుంబీకులు ముందుంటారు. వారి సూచన మేరకే ఇప్పటికీ ఆనెగొందిలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతుంటాయి. ఏకగ్రీవ ఎన్నిక విధానం అక్కడ ఆనవాయితీ. ఒక్కోసారి ఒక్కో సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.
ఉత్సవాల్లోనూ అదే గౌరవం
హంపి విరూపాక్ష ఆలయంలో ఇప్పటికీ ప్రధాన ద్వారం నుంచి వెళ్లి స్వామిని దర్శించుకునే అవకాశం కేవలం రాయల కుటుంబీకులకే ఉంది. మిగతా ఎవరికీ ఆ అవకాశం లేదు. హంపి రథోత్సవాన్ని ప్రారంభించేది ఈ కుటుంబీకులే. ఆనెగొంది చుట్టూ ఉన్న పలు ప్రముఖ దేవాలయాలు ఇప్పటికీ వీరి ఆధీనంలోనే ఉన్నాయి.
అందులో శ్రీరంగనాథస్వామి దేవాలయం, నవ బృందావనం, ఉచ్చప్పయ్య మఠం, 64 స్తంభాల మండపం, చింతామణి ఆలయం, గజశాల, ఒంటెశాల, ఆదిశక్తి దుర్గాదేవి ఆలయం, మేల్కోటే, గవి రంగనాథస్వామి దేవాలయం, పంపాసరోవరం (విజయలక్ష్మి దేవస్థానం), అంజినాద్రిబెట్ట ముఖ్యమైనవి. ఈ పురాతన ఆలయాలన్నింటిలోనూ రాయల కుటుంబీకుల ఆధ్వర్యంలోనే హోమాలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. రాయల కుటుంబీకుల్లో ఎవరి వివాహం నిశ్చయమైనా మొదట హంపీలోనే పూజలు చేస్తారు. ఆ తర్వాతే పెళ్లి పనులు మొదలవుతాయి. వీరి కుటుంబాల్లో పెళ్లిళ్లు ఇప్పటికీ కృష్ణదేవరాయల కాలంనాటి పద్ధతుల్లోనే జరుగుతుంటాయి.
వ్యవసాయమే జీవనాధారం
శ్రీకృష్ణ దేవరాయల వంశీయుల్లో 16వ తరానికి చెందినవారు శ్రీవెంకటపతిరాజు. ఆయనకు ముగ్గురు కుమారులు శ్రీఅచ్యుతదేవరాయలు, శ్రీరంగదేవరాయలు, శ్రీనరసింహదేవరాయలు. అచ్యుతదేవరాయలు మరణించగా, నరసింహదేవరాయలు హోస్పెట్ నగరంలో న్యాయవాదిగా ఉన్నారు. శ్రీరంగదేవరాయలు, ఆయన పెదనాన్న కొడుకు శ్రీరామదేవరాయలు మాత్రం ఆనెగొందిలోనే ఉంటున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా సాధారణ జీవితం గడుపుతున్నారు. శ్రీరంగదేవరాయలు భార్య లలితారాణి.
వీరికి పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి 30 ఎకరాల దాకా ఉంది. ఇందులో వరి, అరటి, మల్బరీ, కొబ్బరి తదితర పంటలను సాగు చేస్తున్నారు. నిత్యం స్వయంగా పంట పొలాలను పరిశీలిస్తూ కూలీలకు సూచనలిస్తుంటారు. ఆనెగొందిలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఇంటిని ఆధునీకరించుకున్నారు. గంగావతిలోనూ ఓ చిన్న ఇల్లు నిర్మించుకున్నారు.
రాజకీయాల్లోనూ చురుకుగా...
శ్రీరంగదేవరాయలు 1983 నుంచి వరుసగా ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున గంగావతి నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర ఖాదీ గ్రామోద్యోగ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనకు 72 సంవత్సరాలు.
ఆయన సతీమణి లలితారాణి కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1987లో జడ్పీ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో పోటీ చేయాలని పార్టీ నుంచి, అభిమానుల నుంచి ఒత్తిడి రావడంతో ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చారు.
గంగావతి తాలూకా సమితి అధ్యక్షురాలిగా పనిచేశారు. 2005-06లో కొప్పళ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆహ్వానం మేరకు 2008లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర హస్తకళల బోర్డు చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. వారి పూర్వీకులు స్థాపించిన విజయలక్ష్మి మహిళా మండలి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.
ప్రాజెక్టులకు రాయలు పేరు పెట్టాలి
'మాకు ఇద్దరు అబ్బాయిలు. ఒకరు హోస్పేట్‌లో వ్యాపారం చేసుకుంటున్నారు. మరొకరు లండన్‌లో ఎంఆర్‌సీఎస్ పూర్తి చేసి బెంగుళూరులో స్థిరపడ్డారు. ప్రముఖుల పిల్లలు అనే భావన రాకుండా వారిని దూరంగా చదివించాం. మాకు ఉన్నంతలో ఇతరులకు సాయం చేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయల వంశీకులుగా మాకు కీర్తి ఉంది. అదే మాకు గర్వకారణం.

గతంలో ప్రభుత్వ పరంగా రాయల కుటుంబీకులకు పెన్షన్ వచ్చేది. ఇప్పుడు అది ఆగిపోయింది. మేం మళ్లీ దరఖాస్తు చేసుకోలేదు. ఆంధ్రాలో జలయజ్ఞం పేరుతో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నారు. శ్రీకృష్ణదేవరాయలు భవిష్యత్ తరాలకు గుర్తుండాలంటే ఆయన పేరు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు పెట్టాలి. ఇలా చేస్తే జనం కూడా హర్షిస్తారు. రాయల ఉత్సవాలను రెండు రాష్ట్రాలూ జరపడం సంతోషమే. కర్ణాటక నుంచి మాకు ఆహ్వానపత్రికయినా అందింది. కాని పెనుగొండలో జరిగే ముగింపు ఉత్సవాలకు అదీ లేదు.
- శ్రీరంగదేవరాయలు, లలితారాణి దంపతులు 
- పట్టుపోగుల రామాంజనేయులు, ఆన్‌లైన్, అనంతపురం. ఫోటోలు: కరణం హనుమేష్ రావు, ఎండీ జాకీర్ హుస్సేన్.
ఆంధ్రజ్యోతి సౌజన్యంతో..



No comments:

Post a Comment