Friday, August 6, 2010

రాయలు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల చరిత్ర!

శ్రీకృష్ణదేవరాయలు తన ఇష్టదైవమైన తిరుపతి వెంకటేశ్వరస్వామికి సమర్పించిన ఆభరణాల్లో చాలా వరకు గల్లంతైనట్లు వార్తలొచ్చాయి. ఇందులో కొన్ని ఆభరణాలను కరిగిపెట్టి ఉండొచ్చని.. మరికొన్ని ఇతర నగలతో కలిసి పోయి ఉండొచ్చని టీటీడీ అధికారులు నివేదించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల వివరాలు లభ్యమయ్యాయి. శ్రీకృష్ణదేవరాయలు మొత్తం ఏడు సార్లు తిరుమల దర్శించుకున్నట్లు ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ వివరాలిలా ఉన్నాయి. తొలి సందర్శన: శ్రీకృష్ణదేవరాయలు తొలిసారి క్రీ.శ. 1513 ఫిబ్రవరి 10న తిరుమలదేవీ, చిన్నాజీదేవీలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయన రత్నకిరీటం, నగలు, ఇతర విలువైన రాళ్లను శ్రీవారికి సమర్పించారు. రాణులు బంగారు కప్పులు, ప్లేటు బహూకరించారు.

1513 మే 2: రాయలు ఈ పర్యటన సమయంలో ఎంతో ఉదారంగా కత్తులు, విలువైన రాళ్లతో పొదిగిన ఇతర ఆభరణాలు, వజ్రాలు, ముత్యాలతో కూడిన మూడు కిరీటాలు, కెంపులను ఉత్సవర్లకు సమర్పించారు.
1513 జూన్ 13: తొమ్మిది రకాల విలువైన రాళ్లతో కూడిన తొమ్మిది సెట్ల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం గొడగరనాడు ఉప జిల్లాలోని మూడు గ్రామాలైన చత్రవాది, తూరూరు, కరి కంబుడులను సమర్పించారు.

1514 జూలై 6: రాణులతో కలిసి ఒడిషా పర్యటన నుంచి వెనక్కి వెళుతూ శ్రీవారిని శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. అప్పుడాయన శ్రీవారి సన్నిధిలో 30 బంగారు వరహాలతో కనకాభిషేకం నిర్వహించారు. విలువైన రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాలను కూడా సమర్పించారు. తలపాకం గ్రామాన్ని శ్రీవారికి అప్పగించారు. తొమ్మిది రకాల వజ్రాలు పొదిగిన నవరత్న ప్రభావళి సెట్‌ను కూడా శ్రీవారికి బహూకరించారు.
1517 జనవరి 2: భగవంతుని ప్రవే శ ద్వారం వద్ద కృష్ణదేవరాయ, తిరుమలదేవి, చిన్నాదేవిల రాగి విగ్రహాలను ప్రతిష్టించారు. 30 వే ల వరహాలను అభయారణ్యం వద్ద ఏ ర్పాట్లకే కేటాయించా రు. తిరుపతిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు 500 వరహాలు ఇచ్చారు.
1518 అక్టోబర్ 16: పెద్ద రాణి తిరుమలదేవితో ఈ దఫా రాయలవారు శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడే పుట్టిన తమ బిడ్డకు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు ఆయన తిరుమల వచ్చారు. ఆ బిడ్డకు 'తిరుమల' అనే నామకరణం చేశారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఎలాంటి లిఖితపూర్వక ఆధారాలు లేవు.

1521 ఫిబ్రవరి 17: శ్రీకృష్ణదేవరాయులు తిరుమలలో జరిపిన తుది పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన తొమ్మిది రకాల విలువైన రాళ్లతో పొదిగిన పీతాంబరం సెట్‌ను శ్రీవారికి బహూకరించారు. దీంతోపాటు ముత్యాలతో పొదిగిన టోపీ, కెంపులు, 1000 వరహాలు సమర్పించారు. రాణి తిరుమలదేవి నవరత్న హారాన్ని బహూకరించారు. ఇవేగాక శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి బంగారు కిరీటంతో పాటు తొమ్మిది రకాల విలువైన రాళ్లను స్వామివారికి ఇచ్చారు. పలు రకాల విలువైన ఆభరణాలు, వజ్రాలు పొదిగిన వస్తువులనూ సమర్పించారు. అంతే కాకుండా ఎంతో బరువైన బంగారు ఆభరణాలు , 2822 శుద్ధి చేసిన కెంపులు, 160 వైడూర్యాలు, 423 పాత వజ్రాలూ ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి సమర్పించిన వాటిలో పలు కిరీటాలు, నెక్లెస్‌లు, మాణిక్యాలు కూడా ఉన్నాయి.

No comments:

Post a Comment