భారత దేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిందని, విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని చిరకాలం గుర్తుండేలా హంపి ఉత్సవాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. ఆయన గురువారం రాత్రి హంపిలో శ్రీకృష్ణదేవ రాయల వేదిక వద్ద భువనేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనాదక్షుడు, స్వతహాగ కవి, సాహితీవేత్త అని ప్రశంసించారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు, కన్నడ, తుళు బాషల్లో మంచి ప్రావీణ్యం పొందిన యోధుడన్నారు. శత్రువులను తుదముట్టించడానికి స్వతహాగా ఖడ్గాన్ని చేతపట్టి యుద్ధం చేసిన మహావీరుడుగా కీర్తి పొందిన సామ్రాజ్యాధినేత అని ఆయన పేర్కొన్నారు. 300 ఏళ్ల విజయనగర సామ్రాజ్యం పరిపాలనలో శ్రీకృషదేవరాయల పాలన స్వర్ణయుగంగా కీర్తింపబడిందంటేఆయన గొప్పదనం, పరిపాలన దక్షత ఏంటో అర్థం చేసుకోవచ్చునని, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు రాయల పాలన వేనోళ్ల కీర్తింపబడుతుందని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు 500 సంవత్సరాల పట్టాభిషేకం మహోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున హంపి సమగ్ర అభివృద్ధికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. హంపిలో థీమ్ పార్కు ఏర్పాటుకు ప్రతి ఏటా రూ. వందలాది కోట్ల నిధులు విడుదల చేస్తున్నామన్నారు. వచ్చే నెలలో థీమ్ పార్క్ పనులు ప్రారంభించి శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని గుర్తుండేలా స్థానిక మంత్రులు కృషి చేయాలన్నారు. థీమ్ పార్కు ఏర్పాటుకు రూ. 300 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి గాలి జనార్దనరెడ్డి మాట్లాడుతూ హంపిలో త్వరలోని థీమ్ పార్కుతో పాటు యూనివర్సల్ జూ పార్కు ఏర్పాటుకు 65 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా హెలీటూరిజం కూడా 15 రోజుల్లో ముఖ్యమంత్రి చేతుల మీదగా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా గాలి జనార్దనరెడ్డి తెలిపారు. హంపి ఉత్సవాలను జనోత్సవాలుగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు మంత్రి గాలి జనార్దనరెడ్డి యడ్యూరప్పకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వేదికపై సీఎంకు మంత్రి గాలి జనార్దనరెడ్డి పాదాభివందనం చేయడం విశేషం. వేదికపై సీఎం, మంత్రులు హంపి ఉత్సవాల స్మరణ సంచికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీరాములు, వీఎస్ ఆచార్య, రేణుకాచార్య, హంపి గాయత్రిపీఠం శ్రీవిద్యారణ్య భారతీస్వామీజీ, ఎంపీలు శాంత, పక్కీరప్ప, శివరామగౌడ, ఎమ్మెల్యేలు గాలి సోమశేఖరరెడ్డి, ఆనందసింగ్, నాగేంద్ర, నేమిరాజ్‌నాయక్, సురేష్‌బాబు, సోమలింగప్ప, విధాన పరిషత్ సభ్యులు మృత్యుంజయ జినగ, హాలప్పాచార్, జిల్లా అధికారి శివప్ప, జిల్లా ఎస్పీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment