Friday, July 9, 2010

హంపీయాత్ర ..అద్భుతం..ఆహ్లాదకరం!

తవ్వా ఓబుల్ రెడ్డి 
హంపీలో జరుగుతున్న   శ్రీకృష్ణదేవరాయల 500 వ పట్టాభిషేక  ఉత్సవాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మా మిత్ర వర్గంలోని అరబోలు వీరాస్వామి, ధర్మిశెట్టి రమణ లతో హంపి ఉత్సవాలకు వెళ్లేందుకు సిద్దమయ్యాం.
' దేశభాషలందు తెలుగు లెస్స' అని ఎలుగెత్తి చాటిన సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలన్నా , భాషా, సాహిత్యం కళలకు దాదాపు 300 ఏళ్ల పాటు రాజధానిగా విలసిల్లిన విజయనగరం అన్నా అభిమానం ఉండని వారుండరు కదా!
హంపిలో 2010 జనవరి 27, 28, 29 తేదీలో శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేక 500 వ వార్షికోత్సవాలు జరిగాయి. 28 వ తేది గురువారం ఉదయం మైదుకూరు నుండి బయలు దేరి కడపకు చేరుకున్నాం. చిత్తూరు-హుబ్లీ ల మధ్య తిరిగే ఫాస్టు ప్యాసింజరులో కడప నుండి హోస్పేట వరకు మా ప్రయాణం! ఉదయం 9-45 కు రైలు వచ్చింది.
దాదాపు 300 కి.మీ. ల మా ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. సాయంత్రం ఐదు గంటలకు రైలు మేము దిగాల్సిన హోస్పేటకు చేరింది. ఈ పట్టణానికి 14 కి.మీ. దూరంలోనే హంపి క్షేత్రం ఉంది. అలాగే ఇక్కడికి 7 కి.మీ. ల దూరంలో తుంగభద్ర డ్యాం కూడా ఉంది. స్టేషన్‌ బయట విజయనగరపు రాజచిహ్నంతో నిర్మించిన ఐల్యాండ్‌ మమ్మల్ని ఆకర్షించింది. పంది, కత్తి, సూర్యచంద్రులతో కూడిన ఈ రాజచిహ్నాన్ని గ్రానైట్‌ శిలలపై అందంగా చెక్కారు. అక్కడినుండి బస్టాండుకు చేరాం.
రాయల పట్టాభిషేక మహోత్సవాలను తిలకించేందుకు దేశ విదేశాలనుండి తరలివచ్చిన వేలాది మంది పర్యాటకులతో హోస్పేట బస్టాండు క్రిక్కిరిసి ఉంది. హంపిలో జరిగే రాయల పట్టాభిషేక మహోత్సవాల సమాచారాన్ని పర్యాటకులకు తెలిపే కౌంటర్లను బస్టాండు ఆవరణంలో ఏర్పాటు చేశారు. హోస్పేట పట్టణంతో పాటు హంపికి వెళ్లే దారి పొడవునా గోడలపైనా, ఫ్లెక్సీ కటౌట్లపైనా ఆనాటి విజయనగర వైభవానికి దర్పణం పట్టే చిత్రాలను రంగుల్లో చిత్రించారు. కృష్ణరాయల ఉత్సవాలకు తోరణాలు కట్టినట్లుగా హోస్పేట నుండి హంపి వెళ్లేదారిలో పచ్చని అరటి, చెరుకు తోటలు స్వాగతం పలికాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను విద్యుల్లతలతో అలంకరించారు. చిన్నగా చీకట్లు ముసురుకుంటుండగా, గగనతలాన్ని సాయంకాలపు అరుణకాంతి ఆవరించి ఉన్న హంపిలో అడుగు పెట్టాం!
బస్సుదిగి చుట్టూ కలియచూస్తే చుట్టూ కొండలూ, ఎత్తైన రాళ్లగుట్టలూ, ఆగుట్టలపై మండపాలూ, మరో పక్కగా ఆలయగోపురాల శిఖరాలు, వాటిపైకి ఎగచిమ్మబడుతున్న లేజర్‌కాంతులూ కనిపించాయి. జనం తండోపతండాలుగా వెళుతున్న ఒక పెద్ద సభాప్రాంగణంలోకి ప్రవేశించాం. పురందరదాసు కీర్తనల ఆలాపన శ్రవణానందకరంగా సాగుతోంది. సభాప్రాంగణానికి ప్రాకారంగా కోటగోడలను తలదన్నేలా 30 అడుగుల సెట్టింగులను ఏర్పాటు చేశారు. అది శ్రీకృష్ణదేవరాయల పేరుతో ఈ ఉత్సవాలకు ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక. విజయనగర శిల్ప వైభవం ఉట్టిపడేవిధంగా ఈ వేదికను నిర్మించారు. పురందరదాసు కీర్తనల తర్వాత అక్కడే చలనచిత్ర సంగీత దర్శకుడు కీరవాణితో సంగీత కచ్చేరి ఏర్పాటు చేశారు. అక్కడి నుండి ససివేకలు వినాయకుడి మండపం మీదుగా ప్రధాన బజారులోకి వచ్చేశాం. తూర్పు అభిముఖంగా ఎత్తై న గోపురంతో ఉన్న విరూపాక్షుని ఆలయం కనిపించింది. హంపి ప్రధాన బజారులో నడుస్తున్నామన్న భావన మమ్మల్ని ఉద్వేగానికి గురిచేసింది. 750 మీ. ల పొడవు, 50 .మీ. ల వెడల్పులతో రెండువైపులా రాతి మండపాలతో హంపి ప్రధానబజారు గతవైభవ దీప్తిని వెదజల్లుతున్నట్లుగా ఉంది. ప్రతి ఏటా చైత్రమాసం, శుద్ద పాడ్యమి ఉగాదినాడు విరూపాక్షస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయట! అదే మాసంలో పున్నమి నాడు జరిగే రథోత్సవాలను నిర్వహించడానికి వీలుగానే హంపి బజారు ను అంత విశాలంగా నిర్మించారని చెబుతారు. రాయల పరిపాలనా కాలంలో ఈ రథోత్సవాలకు దేశదేశాల రాజులూ, విజయనగర సామ్రాజ్యంలోని సామంతులూ, దండనాయకులూ, విదేశీ యాత్రీకులు హాజరయ్యేవారట!లేజరు కిరణాలను అమర్చడంతో విరూపాక్షాలయ గోపురం కొత్త శోభను సంతరించుకుంది. రాజగోపురం ముందు చాలా సేపు నిలబడ్డాం. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒక వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రదర్శిస్తున్న సంగీత నృత్యరూపకాన్ని కొంతసేపు తిలకించాం. అప్పటికే రాత్రి 11 గంటలు కావడంతో దైవదర్శనానికి ఉదయం వెళ్లాలనుకున్నాం. రత్నాలరాసులవీధి లోని శ్రీకృష్ణాలయం చూసి తుంగభద్ర నదీతీరానికి వెళ్లాం. తుంగభద్ర తళతళ మెరుస్తూ పండువెన్నెల సోయగాలను అద్దుకుని గళగళ ప్రవహిస్తోంది.
విదేశీ పర్యాటకులు అక్కడ అందాలను ఆస్వాదిస్తూ తన్మయత్వం చెందుతున్నారు. పడవలో ఉత్తర తీరాన్ని చేరుకుంటే అక్కడినుండి విదేశీయుల విడిది కేంద్రాలకు, రిసార్టులకు, ఆనెగుంది, గంగావతిలకు వెళ్లవచ్చు. గంగావతిలో పాత్రికేయులుగా పనిచేస్తున్న మిత్రులు తిరుపాలయ్య, జాకీర్‌లు మమ్మల్ని కలుసుకున్నారు. 14 కి.మీ. దూరంలోని గంగావతిలోని ప్రభుత్వబంగళాలో వారు విడిదిని ఏర్పాటు చేశారు. ఆనెగొంది మీదుగా ఆ అర్థరాత్రి సమయంలో మిత్రులు ఏర్పాటు చేసిన బైకులపై గంగావతికి బయలు దేరాం. ఉదయం తిరిగి హంపికి వచ్చేటప్పుడు మార్గమధ్యంలోని ఆనెగుందినీ, అంజనాద్రినీ, పంపా సరోవరాన్నీ చూడాలనుకున్నాం. కొప్పల్‌ జిల్లా పరిధిలో ఉన్న గంగావతి పట్టణం చిన్నదే అయినా అందమైన తాలూకా కేంద్రం. మనరాష్ట్రంలోని కోనసీమలా పాడి, పంటలతో పచ్చగా విలసిల్లే గంగావతిని 'రైస్‌బౌల్‌ ఆఫ్‌ కర్నాటక' అని అంటారు. గంగావతి పరిసర ప్రాంతాల్లో కన్నడ సినిమా షూటింగులు జరుగుతుంటాయి. గంగావతి చేరేటప్పటికే బాగా అలసి ఉన్న మేము, విడిదిలో హాయిగా నిదురపోయాం.
కొత్త ప్రదేశంలో ఉషోదయపు అనుభూతులు ఆహ్లాదకరంగా ఉంటాయి. నీరెండ శీతల గాలులలో గంగావతి పట్టణం శోభాయమానంగా తోచింది. ఉదయమే గంగావతి నుండి హంపికి బయలుదేరాం.
విజయనగర తొలి రాజధాని 'ఆనెగుంది'
గంగావతి నుండి హంపి వెళ్లే దారిలో ఉన్న 'ఆనెగుంది' గ్రామస్తులు కూడా రాయల పట్టాభిషేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆనెగుంది గ్రామంలో ఆగాం. హంపి, తుంగభద్ర నదికి దక్షిణతీరంలో ఉంటే, ఆనెగుంది హంపికి ఈశాన్యంగా రెండు కిలోమీటర్ల దూరంలో నది ఉత్తర తీరంలో ఉంది. 'ఆనె' అంటే ఏనుగు అనీ, 'గుంది' అంటే గుంత అని అర్థం. ఆనెగుందికి హస్తినాపతి, కుంజరకోన అనే పేర్లుకూడా ఉన్నాయి. ఆనెగుంది రామాయణ కాలంలో వానరుల రాజధాని కిష్కిందగా చెప్పబడుతోంది.
13వ శతాబ్దం ప్రథమార్థంలో ఆనెగుంది ప్రాంతాన్ని పరిపాలిస్తుండిన జంబుకేశ్వర రాయలును ఢిల్లీ సుల్తాన్‌ తుగ్లక్‌ ఓడించి ఆనెగుందిని స్వాధీనపర్చుకుంటాడు. ఆనెగుంది పాలనా బాధ్యతలను తుగ్లక్‌ తన ప్రతినిధి మాలిక్‌నాయబ్‌కు అప్పగిస్తాడు. నాయబ్‌ ఎప్పుడూ విలాసాల్లో మునిగితేలుతూ,మత్తులో జోగుతూ ప్రజాకంటకుడుగా వ్యవహరిస్తూఉండేవాడు. హరిహరరాయలు, బుక్కరాయలు నాయబ్‌పై తిరుగుబాటును లేవదీసి ఆనెగుందిని స్వాధీనం చేసుకుంటారు. ఆతర్వాత విజయనగర సామ్రాజ్యస్థాపన జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యాన్ని ఆనెగుంది నుండి హంపి(విజయనగరం)కి మార్చిన తర్వాత ఆనెగుందిలో పెద్ద గజశాలను నిర్వహించేవారట! విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన చివరి రాజవంశం అరవీడు వంశం. ఆ వంశవారసులైన రాజా శ్రీరామదేవరాయలు ఆధ్వర్యంలో ఆనెగుందిలో మేళతాళాలతో అంగరంగవైభవంగా జరుగుతున్న ఉత్సవాల్లో కొందరు విదేశీయులతో పాటు మేము కూడా కలిసిపోయాం. ఆనెగుంది గ్రామాన్ని రంగవళ్లులతో, పూలతో సర్వోపసుందరంగా అలంకరించారు. చారిత్రక ప్రదేశాలూ, దేవాలయాలూ, కూడళ్లూ, వీధులూ సప్తవర్ణశోభను సంతరించుకున్నాయి. పచ్చని తోరణాలు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆనెగుందిలోని పురాతన రంగనాథస్వామి ఆలయం, గగన్‌మహల్‌ లను దర్శించాం.
తుంగభద్ర నదీపాయలో శ్రీకృష్ణదేవరాయల సమాధిగా భావించే 64 స్థంభాల మండపం వద్ద కొంత సేపు గడిపాం! రాయలు 64 కళలందు పాండిత్యాన్ని గడించినందుకు చిహ్నంగా 64 స్థంభాలతో ఈ మండపాన్ని నిర్మించినట్లు చెబుతారు. అక్కడ రాయలవారికి ఘనంగా నివాళి అర్పించాం.
మరికొన్ని చారిత్రక కట్టడాలను చూశాం. సమీపంలో ఋష్యమూక పర్వతం, నవబృందావనం, చంద్రమౌళీశ్వర ఆలయం, శిధిలమైన పురాతన రాతివారధి, పంపాసరోవరం, రంగనాథగుహ, శబరి ఆశ్రమం ఉన్నాయి. పంపాసరోవరాన్ని చూసినతర్వాతపడవలో నదినిదాటి తిరిగి హంపిని చేరుకున్నాం.
అంతులేనిది.. హంపి సౌందర్యం!
తుంగభద్రనది ఒడ్డున్నే ఉన్న విరూపాక్ష ఆలయాన్ని సందర్శించాం. ఆలయంలో విరూపాక్షున్నీ, పంపాదేవి, భువనేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్నాం. అక్కడి శిల్పాలనూ, చిత్రకళనూ, ఆలయ విశిష్టతలను గురించి తెలుసుకున్నాం.
హంపీలో చూడాల్సిన ప్రదేశాల జాబితా కొండవీటి చాంతాడంత ఉంది. కొన్నింటినైనా చూడాలనే ఆత్రంతో విరూపాక్షాలయం నుండి తుంగభద్ర దక్షిణతీరం వెంబడి ఏకశిలారథం ఉన్న విఠలాలయానికి బయలు దేరాం. ముందుగా కోదండరామాలయాన్ని దర్శించుకున్నాం. రావణ వధానంతరం శ్రీరాముడు పుష్పకవిమానంలో వెళ్తూ సుగ్రీవుని కోరికపై ఒక క్షణం కిష్కిందపై ఆగాడట. అందుకు చిహ్నంగా ఈ కోదండరామాలయం వెలసిందని స్థలపురాణం. కోదండరామాలయం వద్ద తుంగభద్ర నదీ తీర ప్రదేశాన్ని చక్రతీర్థం అంటారు. తుంగభద్ర పడమర నుండి తూర్పునకు ప్రవహిస్తూ చక్రతీర్థం వద్ద ఋష్యమూక పర్వతాన్ని చుడుతూ ఉత్తరానికి మళ్లుతుంది. ఎత్తైన రాళ్లగుట్టల మధ్య సుడులు తిరుగుతూ వెళ్లే నదీ ప్రవాహదృశ్యం మనసులను రంజింపజేస్తుంది. నది ఉధృతంగా ప్రవహించేటప్పుడు ఆ ప్రదేశంలో సుడిగుండాలు ఉంటాయని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. నదీ తీరంలోని కొండగుట్టలపై విజయనగరాధీశులు అందమైన మండపాలను నిర్మించారు. కృష్ణదేవరాయలు తన ఇష్ట సఖులతో కలిసి చక్రతీర్థం వద్ద నదిలో పడవల్లో విహరించడం, గుట్టలపై మండపాలలో విహరించటం చేసేవారట! ఇప్పుడు కూడా పర్యాటకులకు నదిలో తెప్పల్లో విహరించే సౌకర్యం ఉంది.
కోదండరామాలయానికి కాస్త వెనుక యంత్రోద్దారక హనుమంతుని ఆలయం ఉంది. ఆ తర్వాత అచ్యుతరామాలయం చేరుకున్నాం. ఈ ఆలయంలో కొలువుండిన దేవుడు తిరువెంగళనాధుడు కాగా అచ్యుతరాయల ఆలయంగా పేరు పొందడం విశేషం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1534లో అచ్యుతరాయల బావమరిది హిరయ తిరుమలరాజ నిర్మించారు. ఇక్కడి శిల్పకళ రమణీయంగా ఉంటుంది. ఆలయానికి పడమర వైపున మాతంగ పర్వతం, ఆ పర్వతంపై వీరభద్రస్వామి దేవాలయం ఉన్నాయి. తూర్పున గంధమాదన పర్వతం ఉంది. ఉత్తరం దిక్కుగా రెండువైపులా మండపాలతో విశాలమైన బజారు ఉంది. దీనికి అచ్యుతరాయ బజారు అని పేరు. తర్వాత రాజ తులాభారాన్ని దర్శించాం. వజ్రాలు, బంగారం, వెండి లాంటి విలువైన వాటితో కృష్ణరాయలు ఈ తులాభారంలో తులతూగి వాటిని బ్రాహ్మణులకు దానం చేసేవారని ప్రతీతి. అక్కడినుండి పురందరదాసు మండపం మీదుగా విఠలాలయానికి వెళ్లాం. ఏకశిలా రథం, సరిగమలు పలికే స్థంబాలున్న మండపం ఇక్కడ ఉండటటం వల్ల ఈ ఆలయం అత్యంత ప్రధానమైనదిగా హంపి పర్యాటకులు భావిస్తారు. ఏక శిలారథాన్ని చేతులతో తడుముతూ తనివితీరా చూసే అవకాశం అయితే కలిగింది కానీ, సరిగమల స్థంబాలను ముట్టుకోవడానికి కూడా పురావస్తుశాఖ సిబ్బంది అనుమతించడం లేదు. విఠలాలయం వెలుపల కూడా రెండువైపులా మండపాలతో పెద్దబజారు ఉంది. ఉత్సవాల రోజుల్లో ఇక్కడ అంగళ్ల రతనాలు అమ్మినట్లు చెబుతారు. అప్పటికే సాయంత్రం అయ్యింది. సాయంత్రం విరూపాక్ష బజారులో పట్టాభిషేకోత్సవాల ముగింపు కార్యక్రమాలు ఉండటంతో అక్కడినుండి వెనుతిరిగి విరూపాక్షాలయం చేరుకున్నాం.
విజయనగర వైభవాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలతో అప్పటికే కార్యక్రమాలు మొదలయ్యాయి. అద్భుతమైన కళారూపాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ' వీరగాసే ' కళాకారుల రౌద్రనృత్యాలూ, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, సైనికుల యుద్ధభేరీనాదాలతో హంపి వీధులు హోరెత్తాయి. తన్మయత్వంతో మేం కూడా ఆ కళాకారుల్లో కలిసిపోయాం. ఏకశిలారథం, రాజులూ, రాణుల వేషధారుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పున్నమికి ఒక రోజు ముందునాటి సాయంసంధ్యలో రథ, గజ, తురగ ఘట్టనలతో హంపి వినువీధులు ఎరుపెక్కాయి. రాళ్లగుట్టలూ, గోపుర శిఖరాల మధ్యనుండి చంద్రుడు మెల్లగా ఆకాశంలోకి వస్తున్న దృశ్యం అధ్భుతమనిపించింది. గంగావతికి తిరుగు ప్రయాణం అయ్యేందుకు సమాయత్తం అవుతూనే ఉగ్రనరసింహం, బడివే లింగాలను దర్శించుకుని, హేమకూట పర్వతం మీది మండపాలనూ, ఆలయాలను చూస్తూ విరూపాక్షాలయాన్ని చుట్టుకుంటూ తుంగభద్ర ఒడ్డుకు చేరాం.
రైలు ప్రయాణం ఆద్యంతం..ఆహ్లాదకరం!
మా రైలు ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరంగా, ఆసక్తిగా సాగింది. కడపజిల్లా కమలాపురం ఎర్రగుంట్ల ప్రాంతాల్లో రైల్వేలైనుకు పక్కగా ఉన్న నాపరాళ్ల గనులను రైళ్లో వెళ్తూ చూశాం. భూగర్భంలో వరుపలు, వరుసలుగా నిక్షిప్తం అయి ఉన్న రాతి పలకలను బయటికి తీస్తున్న గనికార్మికుల శ్రమైకజీవన సౌందర్యాన్ని చూశాం. మా వెంట తిరుమల రామచంద్రగారి ' హంపి నుంచి హరప్పాదాకా' పుస్తకాన్ని తీసుకువెళ్లిన మేము అందులోని విజయనగర విశేషాలపై చర్చలు జరుపుకున్నాం. తినబోతూ రుచుల గురించి మాట్లాడుకున్నట్లుంది కదూ మా వ్యవహారం. కొండాపురం, తాడిపత్రి, గుత్తి ప్రాంతాల్లో జామపండ్లు, సపోటా పండ్లు విరివిగా పండుతాయి. ఆ ప్రాంత మహిళలు గంపలతో తెచ్చి పండ్లను రైళ్లలో అమ్ముతుంటూ ఉంటారు. పండ్లు చాలా రుచికరం.
గుత్తి స్టేషన్‌కు ముందున్న స్టేషన్‌ 'రాయలచెరువు'. రాయలవారు అక్కడ చెరువు తవ్వించడం వల్ల ఆ వూరికి 'రాయలచెరువు' అని పేరు వచ్చిందట!. శ్రీకృష్ణదేవరాయలు, మరికొందరు విజయనగర రాజులు రాయలసీమ ప్రాంతంలో వీలైన చోట్లల్లా చెరువులు తవ్వించినట్లుగా అప్పట్లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రీకులు శ్లాఘించిన విషయం ఈ సందర్భంగా మా స్ఫురణకు వచ్చింది. భుక్తి, రక్తి, ముక్తి అంశాల్లో దేనికీ లోటు లేకుండా విరాజిల్లిన సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం. భుక్తి కోసం చెరువులు తవ్వించారు. రక్తి కోసం కళలు సాహిత్యాన్ని పోషించారు. ముక్తి కోసం దేవాలయాలను, ఆథ్యాత్మిక కేంద్రాలను నిర్మించారు. గుత్తి సమీపంలో రైలు పట్టాలకు దక్షిణంగా రెండు కి.మీ. దూరంలో గుత్తి దుర్గం కనిపించింది. 300 మీటర్ల ఎత్తులో ఒక కొండపై ఉన్న ఆ దుర్గాన్ని విజయనగర రాజులు నిర్మించారు. కడపకు 150 కి.మి., అనంతపురానికి 52 కి.మి. దూరంలో ఈ దుర్గం ఉంది. 15 ద్వారాలతో ఈ కోటను శత్రు దుర్భేధ్యంగా నిర్మించారట! రాయల చెరువు, గుత్తి ప్రాంతాల్లో రైలు పట్టాల పక్కగా సహజమైన రీతిలో పెరిగిన తాటితోపులూ, ఈతతోపులూ కనిపించాయి.
అప్పటికే మధ్యాహ్నభోజన సమయం దాటిపోయింది. మిత్రుడు వీరాస్వామి ఇంటి నుంచి పట్టుకొచ్చిన చిత్రాన్నం, చపాతీలు వాటిలోకి ఉర్లగడ్డ తాళింపు నోరూరిస్తున్నాయి. చిత్రాన్నంలో నిమ్మరసం, వేయించిన వేరుశనగ విత్తనాలు కలుపుతారు కదా! గుంతకల్లు దాటిన తర్వాత చిత్రాన్నాన్ని ఆరగించాం. గుంతకల్లు నుండి బయలుదేరిన రైలు మరో గంట సమయానికి బళ్లారికి చేరింది. బళ్లారి రైల్వే స్టేషన్‌కు ఒక కిలోమీటరు దూరంలోని ఒక గుట్టపై బళ్లారి కోట కనబడుతుంది. బళ్లారి కోటను కూడా విజయనగర రాజుల కాలంలో కనుమప్పనాయకుడనే ఆ ప్రాంత నాయకుడు నిర్మించాడట!. ఈ కోట ఉన్న గుట్ట ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఏకరాతి గుట్టగా గుర్తింపు పొందింది. ఈ గుట్టను స్థానికులు బళ్లారిగడ్డ అని అంటారు.బళ్లారి దాటిన తర్వాత విరూపాపుర సమీపంలోని కర్నాటక సరిహద్దులో రైలు కర్నాటకలోకి ప్రవేశిస్తుంది. అక్కడికి సమీపంలో 'దరోజి' అనే గ్రామం ఉంది.ఇక్కడ విజయనగర ప్రథమ ప్రాకారానికి దర్వాజా ఉండటం వల్ల ఆ గ్రామానికి దరోజి అనే పేరు వచ్చిందని చెబుతారు.
బళ్లారి-తోరణగల్లు మధ్యలో విశాలమైన బీడుభూములు, వాటిలో పశువులను, గొర్రెలను మేపుకుంటూ పశువుల కాపరులు, అక్కడక్కడ పండిన కుసుమ చేలు, ఆ పంటను ఒడుపుకుంటూ రైతులు కనిపించారు. అలాగే బళ్లారి నుండి తోరణగల్లు వరకు రైలు పట్టాలకు ఇరువైపులా ఇనుపఖనిజం నిల్వచేసిన దిబ్బలు, వాటిని ఓడరేవులకు తరలించే లారీలు కొల్లలుగా దర్శనమిస్తాయి. ఎర్రగా ఇనుపఖనిజం దుమ్ము రేగుతూ ఉంటుంది. బళ్లారి, తోరణగల్లు, సాండూరు ప్రాంతం ఒక ఖనిజమేఖలగా గుర్తింపు పొందింది. పారిశ్రామికంగా బాగా అభివృద్ది చెందిన ఆ ప్రాంతంలోనే జిందాల్‌ విజయనగర్‌ స్టీల్స్‌ తదితర కర్మాగారాలు మనకు కనిపిస్తాయి. మా ప్రయాణంలో పాపాఘ్ని, చిత్రావతి, పెన్నా, హగరి, తుంగభద్ర నదులను కూడా దర్శించే అవకాశం కలిగింది.
హంపీ, అక్కడి పరిసరాల్లో మేం గడిపిన రెండు రోజులూ అంతా ఆదుర్దానే! ఒక పక్క హంపి అందాలు, మరో పక్క రాయల పట్టాభిషేక ఉత్సవాలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. భువన విజయ సభా ప్రాంగణం, పద్మ మహల్‌, రాజప్రాసాదాలూ, రాణుల స్నానవాటికలూ, కావలి మండపాలూ, కిష్కింద, మాల్యవంత పర్వతం, మహర్నవమి దిబ్బ, రామలింగడి మండపం, కామలాపుర సంగ్రహశాల, ఇంకా ఇంకా చూడాల్సినవి ఎన్నో ఎన్నెన్నో మిగిలిపోయాయి. రెండే రెండు రోజుల్లో హంపిని ఆసాంతం చూడాలనుకోవడం అత్యాశే అవుతుంది కదా! అడుగు అడుగుకూ, జాముజాముకూ,ఋతువు ఋతువుకూ అందాలను మార్చుకుంటూ పర్యాటకులను అబ్బురపరిచే హంపి, నిజంగా ఓ అద్భుత కావ్యం..నవరసాలొలికించు రాచనగరం!

No comments:

Post a Comment