Monday, July 19, 2010

విలక్షణమైన కావ్యం ఆముక్తమాల్యద

ఆముక్తమాల్యద చాలా విలక్షణమైన కావ్యం. మనుచరిత్ర, పారిజాతాపహరణం వచ్చిన కాలంలోది ఇది. ఐనా వాటికీ, దీనికీ ఎంతో వ్యత్యాసం ఉంది.
ఆముక్తమాల్యద శృంగారప్రబంధం కాదు దీన్లో వీరభక్తి, వైరాగ్యాలదే ముఖ్య స్థానం. నిజానికి స్థూలంగా చూస్తే దీన్లో ప్రముఖంగా కనిపించేవి పట్టణాల వర్ణన, ఋతువుల వర్ణన, రాజనీతి బోధన, మత, వేదాంత చర్చలు. ఈ నాలుగింట్లో రాజనీతి విషయాలు ఆముక్తమాల్యదలో తప్ప మన సంప్రదాయ గ్రంథాలు వేటిలోనూ లేవు; పట్టణ వర్ణనలు గాని ఋతువుల వర్ణనలు గాని చేసేప్పుడు కూడా మిగిలిన వాళ్ళు ప్రకృతి మీద ధ్యానం ఉంచితే రాయలు మనుషుల జీవన చిత్రణ మీద అధికారం చూపిస్తాడు.
కృష్ణదేవరాయల పలుకుబళ్ళు కొంత వింతగా ఉంటాయి. మిగిలిన కవుల్లో కనపడని ఒక మొరటుతనం కన్పిస్తుందతని తెలుగు పదాల్లో. కాని సంభాషణలు రాయటంలో అతను సమకాలీన వ్యావహారిక భాషని ప్రయోగించాడేమో అనిపిస్తుంది. వీటికి కొన్ని ఉదాహరణల్ని ఈ వ్యాసం చివర్లో ఇస్తున్నా.
ఈ “అనువాదం” ఉద్దేశం నారికేళపాకంగా పేరుపడ్డ ఈ కావ్యాన్ని మా పాఠకులకు వీలైనంత ఆసక్తికరంగా అందజెయ్యటం. అందువల్ల చాలా వర్ణనలు వదిలెయ్యటం జరిగింది. కాని కొంచెం రుచి చూపించటం కోసం మొదట్లో విలిబుత్తూరు, మధురల వర్ణనల్ని కొంతవరకు ఇస్తున్నాను. ఐతే మూలాన్ని శ్రీ వేదం వెంకటరాయశాస్త్రి సంజీవనీ వ్యాఖ్యతో చదవటాన్ని మించింది లేదు. ఎన్నో వింతవింత ప్రయోగాలు, అద్భుతమైన భావచిత్రాలు కనిపిస్తాయి ఈ కావ్యంలో. కనుక రసజ్ఞులకు ఈ “అనువాదం” కేవలం తొలిమెట్టుగా మాత్రం ఉపయోగపడుతుందనీ, మన కావ్యాల్ని స్వయంగా చదువుకోవాలనే కోరికని కలిగించి ప్రోత్సహిస్తుందనీ భావిస్తున్నా.
కృష్ణదేవరాయలు 1474 ప్రాంతాల్లో పుట్టి, 1509లో రాజై, అనేక దిగ్విజయాలు చేసి, 151516ల్లో విజయవాడకు వెళ్ళి, అక్కడికి దగ్గర్లో ఉన్న శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని సేవించేడు (ఈ శ్రీకాకుళం విశాఖపట్టణం దగ్గరిది కాదు, విజయవాడ దగ్గరిది). ఏకాదశి నాడు ఉపవాసం చేసేడు. ఆ పుణ్యదినాన, రాత్రి నాలుగో జామున ఆ “ఆంధ్ర జలజాక్షుడు” అతని కల్లో ప్రత్యక్షమయేడు “లేములుడిపెడు లేజూపు లేమ తోడ”. చిరునవ్వుతో ఇలా అన్నాడు “రసికులు మెచ్చేట్టు మదాలసచరిత్ర పలికేవు, భావం, ధ్వని, వ్యంగ్యం మేళవించి సత్యావధూప్రీణనం చెప్పేవు, వేదపురాణాల కథల్నేరి సకల కథాసారసంగ్రహం తయారుచేసేవు, శ్రోతల పాపాలు ఎగిరిపోయేట్టు జ్ఞానచింతామణిని వినిపించేవు, రసమంజరి మొదలైన మధురకావ్యాలు రచించేవు అన్నీ గీర్వాణభాషలో! ఇలాటి నీకు ఆంధ్ర భాష అసాధ్యమా? మాకు ప్రీతిగా ఓ కృతి నిర్మించు. నా అవతారాల్లో దేన్ని గురించి చెప్పాలా అని నీకు సందేహం రావొచ్చు. కృష్ణావతారంలో సుదాముడిచ్చిన పూలదండలు వెనకాడుతూ తీసుకున్నాను అతను మగవాడాయె! శ్రీరంగంలో తను ముందుగా ధరించిన పూదండల్ని నాకిచ్చిన వయ్యారిని పెళ్ళి చేసుకున్నా ఆ కొరత తీరలేదు నాకు. నేను తెలుగురాయడిని, నువ్వో కన్నడరాయడివి. కనుక నువ్వు ఆ మా పెండ్లికథను చెప్తే అది పూర్తిగా తీరిపోతుంది. తెలుగెందుకంటావా? ఇది తెలుగుదేశం, నేను తెలుగువల్లభుణ్ణి, కలకండలాటి తియ్యటిది తెలుగు, ఎన్నో భాషల్లో మాట్టాడే నీకు తెలీదా అన్నిట్లోనూ ఉత్కృష్టమైంది తెలుగని! ఈ కృతిని నీ ఇష్టదైవమైన వెంకటేశ్వరుడికి అంకితం చెయ్యి మాకేం భేదం లేదు. ఇలా చేస్తే నీకు ఉత్తరోత్తరాభివృద్ధి కలుగుతుంది” అని ఆనతిచ్చేడు. వెంటనే నిద్ర మేల్కుని, దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని, తెల్లవారేక నిండుసభలో దండనాథ సామంతుల పనులు త్వరగా ముగించి వేదవేదాంగ వేత్తల్ని రప్పించి వాళ్ళకీ కల గురించి వివరించేడు రాయలు. వాళ్ళు ఎంతో ఆనందించి ఆ స్వప్నాన్ని విశ్లేషించి దాన్లోని అన్ని అంశాలూ మంగళప్రదమైనవని తేల్చి సాహితీసమరాంగణ సార్వభౌముడైన అతను ఆంధ్ర మహావిష్ణుడు కోరిన విధంగా ఆముక్తమాల్యదని నిర్మించమన్నారు. అతను కూడా సంతోషంగా కావ్యరచనకి పూనుకున్నాడు. 1521 నాటికి ఇది పూర్తయిందని పరిశోధకుల అభిప్రాయం. 1530లో రాయలు మరణించేడంటారు. )
పాండ్య మండలం.
విలిబుత్తూరు నగరం.
ఆకాశాన్నంటే మేడలు. వాటి ఉద్యానవనాల్లో ఎక్కడ చూసినా ఆనందంగా కూస్తున్న చిలకలు, కోయిళ్ళు. ఆ మేడల మీదేమో మణుల్తో చేసిన చిలకల బొమ్మలు. చూసే వాళ్ళకి ఆ బొమ్మలే నిజంగా కూస్తున్నాయా అనిపిస్తయ్‌.
వీధులు విశాలంగా, తిన్నగా ఉన్నయ్‌. ఇళ్ళ ద్వారాల మీద “ఏనుగులు జలకాలాడిస్తున్న లక్ష్మీదేవి” బంగారు చిత్రాలు. ద్వారాల మెట్లలో ఏనుగుల, సింహాల మరకతపు బొమ్మలు. వాకిళ్ళ ముందు పొట్టి కొబ్బరి చెట్లు.
రెండు పెద్ద రథాలున్నాయా ఊళ్ళో ఒకటి లక్ష్మిది, మరొకటి విష్ణువుది.
పసుపు పూసుకుని కొలన్లో స్నానాలు చేసి శ్రీహరి పూజకోసం బిందెల్లో నీళ్ళు నింపుకుని చేతుల్లో తామరపూలతో నడుస్తున్నారు ద్రావిడస్త్రీలు, భక్తిగీతాలు పాడుకుంటూ.
ఇప్పుడేముంది గాని తర్వాత వాళ్ళు ఉత్సాహంగా బంతులాటలు ఆడేప్పుడు చూడాలి!
అరుగుల మీద కూర్చుని ఉల్లాసంగా పాచికలాడుతున్న ఆటవెలదుల్ని ఏమని వర్ణించగలం? సన్యాసికైనా గుండె జల్లు మనిపించేది సారె విసిరేటప్పుడు వాళ్ళ కంకణాల చప్పుడు. మన్మథుడే ఎదురుగా వచ్చినా పట్టించుకోనిది వాళ్ళ ఆట తన్మయత్వం. ఇంద్రుణ్ణైనా సరే అక్కడికి లాక్కొచ్చేది భక్తుల్ని చూడ్డంతోటే లేచి వాళ్ళు పెట్టే నమస్కారం భంగిమ. బజార్లో జనం గుండెల్ని కోసేవి ఆలయాన్నుంచి వచ్చే శంఖనాదం వినటానికి తలతిప్పినప్పుడు పరిగెత్తే వాళ్ళ కొనచూపులు. ఇక వాళ్ళు మాంచి ఊపుగా పాచికల్ని వేస్తూ ఆ ఊపుకి జారిన పైటని రెండో చేత్తో సర్దుకునే దృశ్యం చూడగలిగిన వాళ్ళు ధన్యులు!
ఐతే ఆ వేశ్యలు సామాన్యులు కారు. చూట్టంతోటే ఎవరి కులమైనా చెప్పే లోకజ్ఞానం, పేదరికంలో పడ్డ విటుల్ని ఆదరించే మంచితనం, రాజుకు రెండో అంతఃపురంలా ఉండగలిగే సౌభాగ్యం, ఏ భాషలోనైనా కవిత్వం చెప్పగలిగే పాండిత్యం కూడా ఉన్నాయి వాళ్ళకి! వాళ్ళెంత సుకుమారులంటే చిలుం పడ్తుందని బంగారు ఆభరణాలు వదిలేసి ముత్యాల హారాలే వేసుకుంటారు; జిడ్డు పడ్తుందని పునుగుని దూరంగా ఉంచి కస్తూరినే పూసుకుంటారు; తేమ ఉంటుందని పూలని వదిలేసి సుగంధధూపాల్నే వాడతారు; జిలుగుగుడ్డలు తప్ప ఒత్తుకునే ముతక గుడ్డల్ని దగ్గరికైనా రానియ్యరు.
సురగంగలో తిరిగివచ్చినట్టనిపిస్తాయి ఆ ఊళ్ళో తిరుగుతుండే హంసలు స్నానానికి ముందు ద్రావిడాంగనలు పసుపుకొమ్ములు అరగదీసిన మెట్ల కింద పడుకున్నందువల్ల!
వరిమళ్ళ కాలవల్లో తెల్లటిముద్దలు పడివుంటే అవి వుదయాన్నే అక్కడ స్నానాలు చేసినవాళ్ళెవరో మర్చిపోయిన గుడ్దలని వాటిని తియ్యబోతారు వూరి కాపలా వాళ్ళు. తీరా దగ్గరకెళ్ళేసరికి ఆ ముద్దలు లేచి పరిగెడతాయి అవి రెక్కల్లో తలలు దూర్చి నిద్రపోతున్న బాతులు గనక! అది చూసి కిలకిల నవ్వుతుంటారు పైర్లు కాపలా కాస్తున్న అమ్మాయిలు!
ఒక పక్క తోటల్లో విరగబూసిన పూలు. వాటికి పోటీగా మరోపక్క పెరిగిన పంటమొక్కలు! ఆ పంటపొలాల్లో ఎక్కడ చూసినా కొంగలు!
పంటకారులో రైతులు మళ్ళలో నీళ్ళు తీసేస్తారు. అప్పుడు పైరుమొక్కలు మళ్ళలోకి ఒంగిపోయి అక్కడున్న కలువపూల మీద పడతయ్‌. ఆ మొక్కలు వేళ్ళతో తాగటానికి నీళ్ళు దొరక్క ఆ వేళ్ళని తలమీదికి తెచ్చుకుని కలువపూల మకరందం తాగి కడుపునింపుకుంటున్నాయా అనిపిస్తుందా దృశ్యం చూస్తుంటే!
పెద్ద బండరాళ్ళంత వేరుపనసకాయలు పండుతాయక్కడ. ఒక్కోసారి అవి నేల్లోనే పగిలి రసం బయటికొస్తే దానికోసం గుంపులుగా మూగుతయ్‌ తుమ్మెదలు. అలాటప్పుడు విపరీతంగా మదం కారుస్తున్న ఏనుగుల్లా కనిపిస్తాయవి!
అక్కడ సుగంధి అరటిపళ్ళు చెట్ల పైనుంచి కింది దాకా గెలలుగెలలుగా వేలాడుతుంటయ్‌. చెరుకుతోటల్లో పోకచెట్లూ, తమలపాకు తీగలూ కూడ దట్టంగా పెరుగుతాయక్కడ. అప్పుడప్పుడు ఆ పోకచెట్ల కొమ్మల బరువుకి చెరుకుచెట్లు విరిగి వాటి ముత్యాలు పక్కనే బెల్లం వండే పొయ్యిల్లో పడి సున్నమౌతయ్‌. అలా పోకలు, ఆకులు, సున్నం కలిసి అక్కడికక్కడే పండుతయ్‌.
ఇక మామిడితోపులు ఎంతగా పూసివున్నాయంటే అక్కడక్కడ ఉన్న పాత నీటిగుంటల్లో పడ్డ ఆ మామిడిపూల మీదగా మనం హాయిగా నడిచిపోవచ్చు. ఆ గుంటల్లో వాలగచేపలు విస్తారంగా ఉంటే వాటిని తినటానికి నీటికోళ్ళు మెడ ఒక్కటి తప్ప మిగతా శరీరం అంతా నీళ్ళలో పెట్టి వేటాడుతుంటయ్‌. చూట్టానికి వింతగా ఉంటుందది.
మన్నారు కృష్ణస్వామి ఆ వూళ్ళో వెలిసివున్నాడు. వాళ్ళ నిత్యజీవితాలు ఆ స్వామితో గట్టిగా ముడిపడిపోయినయ్‌ సాయంకాలం వేళల్లో హంసలు రెక్కలు కొట్టుకుంటూ క్రేంక్రేం అని శబ్దాలు చేస్తూ గూళ్ళకి పోతుంటే అవి ఆ స్వామి గుళ్ళో భేరీ, కాహళుల శబ్దాలనిపిస్తయ్‌ వాళ్ళకి; ఆ స్వామి వక్షాన ఉన్న తులసిమాలను తాకి అక్కడి చల్లగాలులు వాళ్ళ బాధల్ని పోగొడతయ్‌; రాత్రుల్లో గాలికి ఆ గుడిగంటల మోతకి కోవెల చుట్టూ వున్న సంపంగి చెట్లలో పడుకున్న పక్షులు లేచి అరిస్తే తెల్లవారుతోందనుకుని అలకల్లో ఉన్న దంపతులు దగ్గిరౌతారు; ఇళ్ళముందు ఎండబోసిన ధాన్యాన్ని దేవళపు జింకపిల్ల బొక్కుతుంటే కాపలా కాస్తున్న అమ్మాయిలు దానికి నొప్పి కలక్కుండా దేంతో తోలాలా అని చూస్తారు పల్లెపడుచులు పేడగంపల్లో నింపుకున్న కలువపూల దండలు అమ్ముతూ అక్కడే ఆ గంపల్ని దించుకుని కూర్చుంటారు; ఆ పూలదండల్తో జింకపిల్లని తోల్తారా అమ్మాయిలు.
ఆ స్వామి భక్తులెవరైనా వస్తే చాలు వాళ్ళకి ఎంతో భక్తిగౌరవాల్తో ఆతిథ్యం ఇస్తారు ఆ వూరి వాళ్ళు.
విష్ణుచిత్తుడనే మహాభక్తుడు ఆవూరి భాగవతుల్లో ఉత్తముడు. శ్రీహరినెప్పుడూ తన హృదయంలో ధ్యానిస్తుంటాడతను. ఆ కృష్ణస్వామికి పూలదండలు కట్టి కైంకర్యం చెయ్యటం అతని మనసుకి నచ్చిన పని. న్యాయంగా సంపాయించిన డబ్బుతో ఆ వూరి గుండా వెళ్ళే తీర్థయాత్రికులకి అన్నదానాలు చేస్తుంటాడతను.
మబ్బుకి చిల్లు పడ్డట్టు వర్షం కురిసినా సరే ఎండిన కొబ్బరిబొండాలు వంటచెరుగ్గా వాడి రకరకాల వంటలు చేస్తుందతని భార్య. కొబ్బరిచిప్పల గరిటెల్తో వరి అన్నం, చాయపప్పు, నాలుగైదు తాలింపు కూరలు, వడియాలు, వరుగులు, పెరుగు, నెయ్యి స్వయంగా వడ్డించి అతిథులకి తినిపిస్తాడతను.
అదే ఎండాకాలంలో ఐతే ముందుగా పూసుకోటానికి చందనం ఇచ్చి తర్వాత నులివెచ్చటి అన్నంతో పాటు తియ్యటి చారు, మజ్జిగ పులుసు, పల్చటి అంబళ్ళు, రకరకాల కూరలు వడ్డిస్తాడు. ఇక తాగటానికి చెరుకు రసం, కొబ్బరినీళ్ళు, చల్లటి నీళ్ళు, మజ్జిగ, ఎలాగూ ఉంటాయి.
చలికాలంలో వేడివేడి రాజనాల వరి అన్నం వుంటుంది. మిరియాల పొడులు. చుయ్యిమని శబ్దాలు చేస్తున్న కూరలు. ముక్కుజలుబు వదలగొట్టే ఆవబెట్టిన పచ్చళ్ళు, పాయసం, ఊరగాయలు, చెయ్యి చురుక్కనే నెయ్యి, బాగా కాచిన పాలు.
శనివారాల్లో ఎంతోమంది పరదేశ వైష్ణవులు అతనికి అతిథులుగా ఉంటారు. వాళ్ళు భోజనానికి ముందు అరిచేతుల్లో ఇప్పపిండి ముద్దని పెట్టుకుని దానిమీద అరిటిపూవు దొప్పలో నిండా నూనె పోసుకుని ఒక తాటి చివర ఉతికిన గుడ్డల్నుంచుకుని ఏటికి పోయి తలస్నానాలు చేసి వస్తుంటారు.
అర్థరాత్రి వేళైనా సరే అతనింట్లో విష్ణువు పుణ్యకథాకీర్తనం, ద్రావిడవేదాల పారాయణంతో పాటు “కూరలెక్కువగా లేవు, ఉన్నవీ చల్లబడిపోయినయ్‌, పిండివంటలు నిండుకున్నయ్‌, అన్నం కూడ అంత సుష్టుగా లేదు, ఎలాగోలా దయచేసి సర్దుకోండి” అనే మాటలు వినిపిస్తుంటయ్‌!
………………………………..
ఆ కాలంలో పాండ్యమండలానికి రాజధాని మథుర. ఆ వూరి సౌభాగ్యానికి, సౌందర్యానికి ముగ్ధులై సూర్యచంద్రులు కూడా ఎప్పుడూ ఆవూరి చుట్టూనే తిరుగుతూ ఉంటారు! అక్కడి ప్రజలు శూరులు, విలాసులు. వాళ్ళ గజాశ్వదళాలు దీటు లేనివి. అంగళ్లలో నవరత్నాల్ని రాసులు పోసి అమ్ముతుంటారు. గొప్ప ఉద్యానవనాలు. వాటిలో శ్రావ్యంగా పాడే రకరకాల పక్షులు. మందంగా వీస్తున్న మలయమారుతాలు.
ఆ మండలానికి రాజు మత్స్యధ్వజుడు. చంద్రవంశభూషణుడు. సార్వభౌముడిక్కావలసిన అన్ని గుణాలూ ఉన్నవాడు. ఎప్పుడూ నీతి తప్పడు. ప్రజల్ని ఏమాత్రం నొప్పించకుండా పన్నులు తీసుకుంటాడు. కొండేలు విని అపకారం చెయ్యడు. ముఖస్తుతి మెచ్చడు. పిరికిపందనైనా హీనంగా చూడడు. పరాక్రమవంతుడు. మహాదాత.
వేసవి కాలం.
ఏళ్ళింకిపోయి రాళ్ళ మీద పట్టిన పాచి అట్టలుగా పగిలింది. గువ్వల్ని పట్టటానికి బోయలు అక్కడక్కడ నీళ్ళు పోసి దాక్కున్నారు. సుడిగాలికి ఆకులెగిరితే అవి పావురాలనుకుని పట్టుకోవటానికి డేగలు వెంటపడినయ్‌. చెట్లనీడల కింద నిద్రపోతున్న బాటసారులు ఆ నీడలతోటే దొర్లుకుంటూ పోతున్నారు. ఎక్కడ చూసినా ఎండమావులు.
ఏనుగులు, పందులు, దున్నలు బురదలో పొర్లాడుతున్నయ్‌. గాలికి దుమ్ము పైకి లేచి దాని అంచున గడ్డి అంటుకుని తిరుగుతోంది. బూరుగుకాయలు పగిలి వాటి దూది పైన ఎగురుతోంది. ఎండిన ఏర్లలో తామరల దుద్దులు పైకే కనిపిస్తున్నయ్‌. రాత్రుళ్ళు కుక్కలు ఉత్సాహంగా మొసళ్లని తరుముతున్నయ్‌. మలుగుచేపలు బొరియల్లో దూరినయ్‌. మోకాలిబంటి నీళ్ళలో నిలబడి చేపల్ని తింటున్నయ్‌ కొంగలు. నీళ్ళు ఎండి కిందికి పోయే కొద్ది అడుగున దాక్కున్న బొమ్మిడాయలు, చేదుచేపలు, ఆ తర్వాత పూర్తిగా ఎండిపోయాక చేపగుడ్లు కూడా తింటున్నాయవి.
రైతులు తోటల్లో ఏతాలు తొక్కుతూ పెద్ద గొంతుల్తో పాడుతుంటే ఏతపు బానలు నీళ్ళలో మునుగుతూ మృదంగం చప్పుళ్ళతో తాళం వేస్తున్నయ్‌.
మండుటెండలకి బొండుమల్లె పొదలకి బొబ్బలెక్కాయన్నట్టు పెద్దపెద్ద మొగ్గలు వచ్చినయ్‌. చలిపందిళ్ళలో జలదేవతల్లాగా కడవల్తో నీళ్ళు పోసి బాటసారులకి దప్పిక తీరుస్తున్నారు అక్కడుండే యువతులు. ఇంకెక్కడా దిక్కులేని మన్మథుడు ఆ యువతుల దయ వల్ల ఆ పందిళ్ళలో తలదాచుకుంటున్నాడు!
దాహంతో “అమ్మా, అక్కా, కాసిన్నీళ్ళు పొయ్యండి” అంటూ లోపలికి వచ్చిన ఒకడు దాహం తీరగానే ఆ సంబోధనల్ని మర్చిపోయి వాళ్ళ వంక వేరే చూపులు చూస్తుంటే వాళ్ళు కూడ ఒకరికొకరు కళ్ళతో సైగలు చేసుకుని నవ్వుకుంటూ చిన్నధారతో వాడికి నీళ్ళు పోస్తున్నారు.
స్త్రీపురుషులు దిగుడుబావుల్లో పోటీపడి ఒకళ్ళమీద ఒకళ్ళు నీళ్ళు చల్లుకుని అలిసిపోయి అక్కడే వెన్నెల మైదానాల్లో నిద్రపోతున్నారు. వేకువజామున మేలుకుని కలిసి సుఖిస్తున్నారా అదృష్టవంతులు!
ఎండవేడికి చల్లగాలి పారిపోయినా విసనకర్రల ఇంద్రజాలంతో దాన్ని పుట్టిస్తున్నారు ప్రజలు. చెరుకుగడలు నరకబడి కిందపడుతున్నయ్‌ మన్మథుడి చేతినుంచి జారిపోయిన విల్లుల్లాగా. బావుల్లో నీళ్ళు అడుగంటుతున్నయ్‌. అతుకుల చేంతాళ్ళతో వాటిని తోడుతున్నారు స్త్రీలు.
ధనికులు దోరమామిడికాయముక్కల్తో, నీటితడి పొయ్యేదాకా తాలింపు వేసిన చేపబద్దల యిగురుతో మధ్యాన్నం భోంచేసి, సాయంకాలం ఆ చేపల రుచి తేపులొస్తుంటే లేతటెంకాయల నీళ్ళతో వాటిని పోగొట్టుకుంటున్నారు.
జనం పగలంతా తోటల్లోనే గడిపి సాయంత్రానికి చెరుకు గానుగల దగ్గరికి చేరుతున్నారు.
ఇంతలో మథుర దగ్గర్లో వున్న అళఘరి సుందరబాహుస్వామి తెప్పతిరునాళ్ళు వచ్చినయ్‌.
పరదేశి బ్రాహ్మడొకడు ఆ తిరునాళ్ళకి వచ్చి రాజపురోహితుడి యింట్లో విడిదిచేసేడు. తిరునాళ్ళు చూసి, అతని ఆతిథ్యంలో చక్కటి భోజనం చేసి, తన వూరికి ప్రయాణమయ్యేడు. రాత్రయింది. దార్లో మథురలో ఓ అరుగు మీద మిగిలిన బాటసారుల్తో కలిసి విశ్రాంతికి సంచి తలగడగా పెట్టుకు పడుకున్నాడు. కాలక్షేపానికి సుభాషితాలు పాడటం మొదలెట్టేడు.
సరిగ్గా అదే సమయంలో మత్స్యధ్వజ మహారాజు తన భోగిని దగ్గరికి బయల్దేరేడు. అప్పుడతనికో సుభాషితం వినిపించిందిలా
“వర్షాకాలానికి కావలసిన వాటిని మిగిలిన నెలల్లో కూడగడతాం. రాత్రికి కావలసింది పగలు. ముసలితనానికి కావలసింది యవ్వనంలో. అలాగే పరలోకానికి కావలసింది కూడ యీ లోకంలోనే సమకూర్చుకోవాలి.”
పిడుగుల్లా తగిలేయా మాటలతనికి. తన స్థితిని తల్చుకునే సరికి దుఃఖం వచ్చింది. చక్రవర్తుల్నీ మహాపురుషుల్నీ కూడా ఏట్లో నావలా కదిలీ కదల్నట్టు కదిలి కాలం ఎలా మోసం చేసిందో ఆలోచించుకున్నాడు. మెరుపులాటి క్షణికమైన రాజభోగాల గురించి కాక శాశ్వతమైన సత్యం గురించి విచారించాలనుకున్నాడు.
తాంబూలం పెట్టెలోంచి కొంత ముల్లె తీసి తలారి చేత ఆ బ్రాహ్మడికిప్పించేడు. వెనక్కి తిరిగి యింటికి వెళ్ళేడు. ఉదయాన్నే కొలువు తీరి విద్వాంసులందర్నీ పిలిపించేడు. శాస్త్రాలన్నీ చూసి మోక్షం వచ్చే మార్గం ఏమిటో కనుక్కుని చెప్పమన్నాడు. వాదం గెలిచి తనకు తత్వం చెప్పగలిగే వారికని బీరపువ్వుల్లాటి బంగారునాణేల్ని జోలెలో పోయించి వేలాడదీయించాడు సభలో!
ఇక్కడ విలిబుత్తూర్లో
విష్ణుచిత్తుడు ఎప్పట్లాగే మూలమంత్రం జపిస్తూ తులసిమాలను మన్నారు స్వామికి సమర్పించబోయేంతలో ఆ స్వామే ప్రత్యక్షమయేడు! చిరునవ్వుతో అతనికి మత్స్యధ్వజుడి పరిస్థితి వివరించేడు. “నువ్వు వెంటనే మథురకి వెళ్ళు. అక్కడ రాజు ముందు అన్నీ తెలిసినట్టు అవాకులూ చెవాకులూ పేల్తున్న వాళ్ళ మదం దించు. నా మహిమని ప్రకటించు. పాండ్యుణ్ణి వైష్ణవుణ్ణి చెయ్‌” అని విలాసంగా ఆనతిచ్చేడు.
వణికిపోయేడు విష్ణుచిత్తుడు.
సాష్టాంగపడ్డాడు స్వామికి.
“అయ్యో స్వామీ! శాస్త్రగ్రంథాల వంకనైనా చూడని వాణ్ణి. తోటలో మట్టి తవ్వటం తప్ప నాకేం తెలియదే! నన్ను వాదానికి పంపితే అక్కడ నీకు జరిగేది అవమానమే” అని మొత్తుకున్నాడు.
“గుడిని ఊడవమను. నీళ్ళు తోడమను. పల్లకి మొయ్యమను. మాలలు కట్టమను. జెండా తిప్పమను. వింజామర వీచమను. దీపం వెలిగించమను. అంతేగాని వాదాలు నాకెందుకు యింకెవరూ దొరకలేదా నీకు?” అని ప్రాధేయపడ్డాడు.
అతని భక్తికి సంతోషించేడు శ్రీహరి. శ్రీదేవి వంక చూసేడు. “ఇతన్ని వాదంలో గెలిపిస్తా చూడు” అన్నాడు చిలిపిగా.
“అంతా నీ ఇష్టమేనా ఏమిటి వెళ్ళిరావోయ్‌ వెర్రివాడా! నేనున్నాగా అంతా జరిపించటానికి!” అన్నాడు విష్ణుచిత్తుడితో.
చివరికి ఎలాగో ఒప్పుకున్నాడతను. రాజుకి ప్రసాదంగా ఇవ్వటానికి కావిళ్ళలో అరిసెలు పట్టించుకుని బయల్దేరేడు మథురకి.
దార్లో తినటానికి అతని భార్య పొరివిళంగాయలు (వేపుడు బియ్యప్పిండి, బెల్లం పాకంతో చేసిన ఉండలు) కట్టి ఇచ్చింది. ప్రతిచోటా ఎసట్లో కొంచెం వెయ్యటానికి పాతవడ్లబియ్యం (కీడు కలక్కుండా వుండటానికి ఇలా చెయ్యటం ఆచారం), శుద్ధిచేసి సగం బెల్లం కలిపిన సాంబారు చింతపండు, ఎన్నో గోవుల నెయ్యి, పెరుగు వడియాలు, పచ్చి వరుగులు, పప్పులు, పూజాసామాగ్రి అతన్తో బయల్దేరేయి.
మథుర చేరేడు విష్ణుచిత్తుడు. నేరుగా రాజసభకి వెళ్ళేడు. అతని దివ్యతేజం చూసి రాజుతో సహా సభంతా జంకుతో లేచి నిలబడింది. రాజు చూపించిన బంగారు ఆసనం మీద కూర్చున్నాడు.
అప్పటిదాకా వాదం సాగిస్తోన్న సభంతా నిశ్శబ్దంగా వుండిపోయింది.
“ఎందుకీ మౌనం? కానివ్వండి నేనేం పరాయివాణ్ణా?” నవ్వుతూ వాళ్ళతో అన్నాడు విష్ణుచిత్తుడు.
కొద్దిమాటల్లోనే వాళ్ళ లోతుపాతులు తెలుసుకున్నాడు. చిరునవ్వుతో రాజుని చూసేడు. “నువ్వు మధ్యవర్తిగా వుంటే నా వాదం వినిపిస్తా” అన్నాడతన్తో.
ఓ విద్వాంసుడి వైపు తిరిగేడు. అతని వాదం అంతా ముందు తన మాటల్లో వివరించేడు. దాన్లో ఒక్కొక్క విశేషాన్నే తీసుకుని సూక్ష్మంగా ఖండించేడు. మధ్యలో మాట్లాడబోయిన వాళ్ళని ఒక్కో మాటతోటే వారించేడు. మళ్ళీ మొదటివాడి దగ్గరికొచ్చి తన సిద్ధాంతం స్థాపించి వాణ్ణి ఒప్పించి ఓడించేడు. “సరే ఇప్పుడు చెప్పు నీ వాదం ఏమిటో” అని తర్వాతి వాణ్ణి కూడ అలాగే గెలిచేడు. ఇలా అందర్నీ వరసగా వాదంలో సాధించేడు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల ద్వారా పరమాత్మ తత్వాన్ని నిరూపించేడు. తర్వాత నారాయణుడే ఆ పరతత్వమని బోధించేడు. సకల భూతాల్లోనూ ఉండే ఆత్మ ఆ విష్ణువే అని వివరించేడు. ఆ విష్ణువుని పొందటానికి మార్గం చూపటానికి ఖాండిక్య కేశిధ్వజుల కథ వినిపించేడు
నిమివంశంలో ధర్మధ్వజుడికి మితధ్వజుడు, కృతధ్వజుడనే కొడుకులిద్దరు. మితధ్వజుడి కొడుకు ఖాండిక్యుడు. శూరుడు. కృతధ్వజుడి కొడుకు కేశిధ్వజుడు. బ్రహ్మజ్ఞాని. వాళ్ళిద్దరూ రాజ్యం కోసం భయంకర యుద్ధం చేసేరు. చివరికి కేశిధ్వజుడి దెబ్బకి ఖాండిక్యుడు అడవుల్లోకి పారిపోయేడు.
రాజ్యం గెలుచుకున్న కేశిధ్వజుడు జ్ఞాని గనక రాజ్యఫలాన్ని ఆశించకుండా యాగాలు చేసేడు. ఓ యాగసమయంలో అతని యాగధేనువుని ఓ పులి పట్టి చంపటంతో ప్రాయశ్చిత్తం ఏమిటని ఋత్విక్కుల్నడిగేడు. వాళ్ళు తమకి తెలీదనీ, ఖాండిక్యుడికి తెలుసుననీ చెప్పేరతన్తో. కేశిధ్వజుడు అలా చెయ్యటానికి నిశ్చయించుకుని ఖాండిక్యుడి దగ్గరికి రథం మీద బయల్దేరేడు. దార్లో వున్న వేగుల వాళ్ళు యీ విషయం ఖాండిక్యుడికి చెప్తే అతను యుద్ధానికి సిద్ధమయేడు. ఐతే కేశిధ్వజుడు తన యాగం విషయం చెప్పి యుద్ధానికి రాలేదని స్పష్టం చేసేడతనికి.
చేతికి చిక్కిన శత్రువుని విడిచిపెట్టొద్దనీ, అతన్ని చంపటమే కర్తవ్యమనీ ఖాండిక్యుడికి బోధించేరతని మంత్రులు. పగవాళ్ళని సంహరించటమే రాజధర్మమని వివరించేరు.
ఐతే శరణాగతుడై వచ్చిన వాణ్ణి చంపటానికి ఒప్పుకోలేదు ఖాండిక్యుడు.
కేశిధ్వజుడికి ప్రాయశ్చిత్తమార్గం చెప్పి పంపేడు.
అలా చేసి యాగం పూర్తి చేసేడు కేశిధ్వజుడు.
ఋత్విక్కులకీ, అర్థులకీ ఎన్నో దానాలు చేసేడు.
ఖాండిక్యుడికి గురుదక్షిణ ఇవ్వాలని మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళేడు.
ఉబ్బితబ్బిబ్బయేరు ఖాండిక్యుడి మంత్రులు. “ఇంత కంటె మంచి అవకాశం దొరకదు. అతని రాజ్యం అంతా తీసుకో” అని సలహా ఇచ్చేరతనికి.
కాని బ్రహ్మజ్ఞాని కేశిధ్వజుడి నుంచి రాజ్యం కోరటం నచ్చలేదతనికి. అన్ని పాపాల్నీ పోగొట్టేవిద్య తనకి చెప్పమని కేశిధ్వజుణ్ణి అడిగేడతను.
ఎంతో ఆశ్చర్యపడ్డాడు కేశిధ్వజుడు. అతనికి ఆత్మ విద్య బోధించేడు. “ఈ శరీరమే నేననుకుని దేహి మోహంలో పడి తిరుగుతుంటాడు. కాని శరీరం ఆత్మ ఔతుందా? ఇలా ప్రాణుల్ని బంధించేది, మోక్షమార్గానికి అడ్దం వచ్చేడి మనస్సు. మనస్సుని భౌతికభోగాల నుంచి వెనక్కి లాగే యోగసాధనాల వల్ల ఆత్మరూపం తెలుసుకోవచ్చు. అదే విష్ణువు. అన్ని రూపాల్లోనూ నిండివున్న వాడతనే. ఐతే అతని స్తూలరూపాన్ని ఎప్పుడూ ధ్యానించటం ద్వారా అతనిగా మారి ముక్తిపొందొచ్చు” అంటూ విశదంగా వివరించేడు.
తర్వాత ఖాండిక్యుడు వద్దంటున్నా వినకుండా అతని రాజ్యాన్నతని కిచ్చేసేడు. ఖాండిక్యుడు మాత్రం ఆ రాజ్యాన్ని తన కొడుక్కిచ్చి తపస్సు చేసి ముక్తి పొందేడు.
ఇలా మత్స్యధ్వజుడికి విష్ణుమహత్యం వివరించేడు విష్ణుచిత్తుడు. మూలమంత్రాన్ని ఉపదేశించి అతన్ని వైష్ణవుడిగా చేసేడు.
సభలో కట్టివున్న ముల్లెమూట దానంతటదే తెగి కిందపడింది విష్ణుచిత్తుడి విజయాన్ని దృఢపరుస్తూ.
గజారోహణం చేయించి విష్ణుచిత్తుణ్ణి ఊరేగించేడు పాండ్యుడు.
దార్లో వాళ్ళందరికీ గరుడారూఢుడై దర్శనమిచ్చేడు విష్ణువు.
మహామునులు వచ్చి సామగానాలు చేసేరు.
దేవతలు పుష్పవృష్టి కురిపించేరు.
విష్ణుచిత్తుడు భక్తిపారవశ్యంతో శ్రీహరిని స్తుతించేడు.
విశ్వకర్మని పిలిచి విష్ణుచిత్తుడి ఇంటిని మణిమయంగా చెయ్యమని ఆజ్ఞాపించేడు విష్ణువు. అలాగే చేసేడతను.
విలిబుత్తూరు అద్భుతమైన స్వాగతం ఇచ్చింది విష్ణుచిత్తుడికి. ఇల్లు చేరి విష్ణుమహిమకి పరవశించి భక్తుల్ని ముందుకంటే ఎక్కువగా ఆదరిస్తూ గడుపుతున్నాడతను.
ఓరోజు యథాప్రకారంగా విష్ణుచిత్తుడు మధ్యాహ్న మాలను స్వామికి సమర్పించి వెళ్ళేడు. అప్పుడు విష్ణువు శ్రీదేవితో విలాసంగా అన్నాడిలా “ఈ విష్ణుచిత్తుడు నాకు చాలా ప్రియమైన భక్తుడు. ఇతనితో సమానంగా నాకు ప్రీతి కలిగించినవాడు ఇంకొక్కడే యామునాచార్యుడు. అతని విషయం చెప్తా విను” అంటూ యామునాచార్యుడి కథ చెప్పాడిలా.
చిన్నతనంలోనే వేదవేదాంగాలు నేర్చుకున్నాడు యామునుడు. ఆ కాలంలో ఇప్పటి పాండ్యరాజు పూర్వుడే ఒకడు వెర్రిశైవం ముదిరి విష్ణువుని నిరాకరించేడు.విభూది పూసుకుంటే తప్ప విష్ణుభక్తులకి ప్రవేశం లేకుండా పోయింది అతని సభలో.
ఐతే ఆ రాజు భార్య విష్ణుభక్తురాలు. పతివ్రత.
అన్ని రూపాలూ విష్ణువే గనక ఎవరిని పూజించినా తప్పు లేదు. ఐతే నేరుగా విష్ణువునే పూజిస్తే ఫలం ఇంకా ఎక్కువ కదా! తన భర్త వైష్ణవ నిరాదరణకి బాధపడుతోందామె.
యామునుణ్ణి వాదానికి ప్రేరేపించేడు నారాయణుడు. అతనా రాణికి కబురుపంపేడు “నాకు రాజుని కలిసే అవకాశం కలిగిస్తే అతన్ని విష్ణుభక్తుడిగా చేస్తా”నని.
ఆమె రాజుతో చెప్పింది యామునుడి గురించి. అతను కొంత తటపటాయించి మర్నాడుదయాన్నే అతన్ని పిలిపించేడు.
నమస్కరించి కూర్చున్నాడు యామునుడు.
ఎగాదిగా చూసి ఈసడించేడు రాజు “సంగతేమిటో తెలిసే వచ్చావా, చూస్తే ఠింగణాగాడివి. వాదంలో ఓడేవో, మొత్తుకున్నా సరే వదలకుండా నీ మెళ్ళో లింగం కట్టిస్తా. ఆలోచించుకో” అని హెచ్చరించేడతన్ని.
రాణిని చూసి, “మా శైవుడోడిపోతే నేను చక్రాంకితుణ్ణౌతా. నీ వైష్ణవుడోడేడా, నీక్కూడా ఇతని గతే పడ్తుంది” అని గద్దించేడు. అందుకు ఒప్పుకుందామె.
వాదంలో అన్ని మతాల వాళ్ళనీ సునాయాసంగా జయించేడు యామునుడు. రాజుని వైష్ణవుణ్ణి చేసేడు.
తన చిన్న చెల్లెల్ని యామునుడికిచ్చి వివాహం చేసేడా రాజు. అర్థ రాజ్యం కూడ ఇచ్చేడు.
వర్షాకాలం వచ్చింది. శరదృతువు కూడ గడిచింది.
రాజధర్మం స్వీకరించిన యామునుడు దిగ్విజయానికి వెళ్ళేడు. రాజులందర్నీ జయించి మహాభోగాల్తో రాజ్యం చేస్తున్నాడు. ఇలా కాలం గడుస్తోంది.
ఐతే అతని తాతగారి ప్రశిష్యుల్లో ఒకడు శ్రీరామమిశ్రుడు యామునుడు యోగమార్గాన్ని వొదిలి భోగలాలసుడు కావటం భరించలేకపోయేడు. ఎలాగైనా అతన్ని కలుసుకోవాలునుకున్నాడు. యామునుడు భక్తిమార్గానికి దూరంగా ఉండటానికి కారణం రాజసాన్ని కలిగించే అతని భోజనమని భావించేడు. ఆ అజ్ఞానాన్ని తొలిగించటానికి జ్ఞానోద్దీపకమైందీ, అరుదుగా దొరికేదీ ఐన అలర్కశాకం (ముళ్ళ ఉచ్చింత కూర ట) ముందుగా యామునుడి వంటవాడికి కొన్నిరోజులపాటు వరసగా పంపేడు. ఆ కూర రుచికి ఆనందించి ఆ కూర ఇస్తున్న వాణ్ణి పిలిపించమన్నాడు యామునుడు. అలా అతన్ని కలుసుకున్నాడు రామమిశ్రుడు.
“మీ పెద్దలు దాచిన నిధి ఒకటి నీకు ఒంటరిగా చూపాల్సుంది ఉంది, నాతో రమ్మ”ని కోరేడతన్ని.
ఒప్పుకుని వెళ్ళేడు యామునుడు శ్రీరంగానికి.
అతనికి రంగనాథుణ్ణి చూపించేడు రామమిశ్రుడు “ఇదే ఆ నిధి” అంటూ.
అంతే! యామునుడికి తన గతం అంతా గుర్తుకొచ్చింది.
వెంటనే కొడుక్కి రాజ్యం అప్పగించేడు.
విపులంగా, విశదంగా లోతైన రాజనీతులన్నిట్నీ బోధించేడు. (చాలా లోతైన ఈ రాజనీతుల్ని కొన్నిట్ని ఈ వ్యాసం చివర్లో అనుబంధంగా ఇచ్చాను, ఇంటరెస్ట్‌ ఉన్న వాళ్ళ కోసం.)
విష్ణుభక్తిమార్గంలో శేషజీవితం గడిపేడు.
అని యామునాచార్యుల గురించి వివరించేడు మహావిష్ణువు.
…………………….
వసంతమాసం.
తోటలు విరగబూసినయ్‌. పొదరిళ్ళు దట్టంగా పెరిగినయ్‌.
ఓ ఉద్యానంలో చెట్ల మధ్య బాటలో నడుస్తున్నాడు విష్ణుచిత్తుడు.
పక్కనే తెల్లతామర కొలను. ఆ పక్కనే తులసితోట. అక్కడో పాలరాతి తిన్నె. దాని మీదో చిన్ని పాప. మనోహరమైన రూపం.
ఆశ్చర్యం, ఆనందం పెనవేసుకున్నాయి విష్ణుచిత్తుడిలో. సంతానం లేని తనకు అది విష్ణుప్రసాదం అనుకున్నాడు. సంతోషంతో ఇంటికి తీసుకెళ్ళేడు. అల్లారుముద్దుగా పెంచుతున్నారామెని గోదాదేవిని.
కాలం గడుస్తోంది. గోదాదేవికి యవ్వనోదయం ఐంది. లోకాద్భుతసౌందర్యం ఆమె సొంతమైంది.
విష్ణుప్రభావం వల్ల తనకు గొప్ప సంపదలు కలిగినా విష్ణుచిత్తుడు మాత్రం యథాప్రకారంగానే స్వామికి పూలమాలలు కట్టి అర్పిస్తున్నాడు. ఐతే భగవంతుడి కోసం తన తండ్రి కట్టిన మాలల్ని గోదాదేవి ముందుగా తను ధరించి బావి నీళ్ళలో నీడ చూసుకుని ఆనందించి ఆ తర్వాత మళ్ళీ బుట్టలో పెట్టేస్తోంది.
చెలుల్తో విష్ణుగాథల్ని తల్చుకుంటూ ఏఏ అవతారాల్లో అతను ఎవరిని ఎలా వరించాడో వివరించి చెప్తూ పరవశిస్తూ కాలం గడుపుతోంది.
ఆమె మనస్సు లోని భావాలు సూచనప్రాయంగా వాళ్ళకి అర్థమౌతున్నాయి. సరసభాషణాల్తో, చమత్కారాల్తో ఆమెని ఆటలు పట్టిస్తున్నారు వాళ్ళు.
జన్మాంతరాల బాంధవ్యం ఆమెలో విరహం రేపుతోంది. తనలో తను మాట్టాడుకుంటోంది.
కృష్ణావతారంలో రాసలీలా విశేషాల్ని తల్చుకుని అసూయ పడుతోంది. ప్రసంగవశాన చెలులు “నువ్వు కృష్ణావతారకాలంలో సత్యభామవై వుంటావు” అనటంతో హఠాత్తుగా పూర్వజన్మజ్ఞానం కలిగిందామెకి.
విష్ణువియోగం ఇంకా దుర్భరమైంది!
రోజూ స్వయంగా పూలమాలికలు రచించి గుడికి వెళ్ళి ఒంటరిగా స్వామికి సమర్పిస్తోంది. ఆయన కథల్ని దివ్యగానం చేస్తోంది. నిరంతరం స్వామినే తల్చుకుంటూ పూజిస్తూ గడుపుతోంది.
అదంతా తనకి తెలియని ఓ రకమైన తపస్సు కాబోల్ననుకున్నాడు విష్ణుచిత్తుడు. ఈ విషయం ఏమిటో తెలుసుకుందామని ఓ రోజు ఆ స్వామికే ఆమె ప్రవర్తనంతా వివరించి చెప్పి సలహా అడిగేడతను!
మందహాసం చేసేడు స్వామి అదంతా విని!
ముందుగా అతనికి మాలదాసరి కథని వినిపించేడు ఇలా
విష్ణువు వామనుడిగా వెలిసిన చోటికి దగ్గర్లో ఉండి రోజూ ఉదయాన్నే విష్ణువు గుడికి వెళ్ళి మంగళకైశికి రాగంలో గీతాలు పాడి వెళ్ళేవాడా దాసరి. మహా ధర్మపరుడతను. శుద్ధమైన మనసున్న వాడు. ఎండా గాలీ ఆకలీ అన్నీ మరిచిపోయి పరవశంతో రాళ్ళు కరిగించే గానం చేస్తూ భక్తి ఉద్రేకంతో నాట్యం చేసేవాడు రోజూ.
ఓనాడు
అర్థరాత్రివేళ ఓ ఇంట్లో పిల్లి దూరింది. దాంతో కంగారు పడి కోళ్ళు అరిచినయ్‌. తెల్లవారుతోందని స్వామి సేవకి బయల్దేరేడు దాసరి.
దార్లో మర్లమాతంగి తీగని తొక్కేడు! ఎక్కడెక్కడో తిరిగేడు. పాడుపడ్డ బీడుల్లో తేలేడు.
ఉత్తరేనికాయలు పట్టుకుంటున్నయ్‌. పల్లేరుగాయలు గుచ్చుకుంటున్నయ్‌. ఐనా ఆగలేదతను.
అంతలో ఎదురుగా కనిపించిందతనికి
మహావిస్తారమైన ఓ వటవృక్షం.
రెండేసి కోసుల వెడల్పున ఊడలు దిగేయి దానికి! వాటికి కొమ్మలు, ఆ కొమ్మలకి కొమ్మలు మొలిచేయి!
దానిమీదో బ్రహ్మరాక్షసుడుంటాడని జనం అనుకుంటారు. అందుకే అటువేపెవరూ రారు.
ఐతే అట్నుంచి దగ్గర దారి వుందేమోనని అటే నడిచేడు దాసరి.
అక్కడ
ఎక్కడ చూసినా
మెదడంతా జుర్రేసి పడేసిన పుర్రెలు. మాంసమంతా గీరిగీరి తిన్న ఎముకలు. ముసిరిన ఈగల్తో నిండిపోయి వున్న పచ్చితోళ్ళు. గాలికెగురుతున్న మనుషుల జుట్టు. ముక్కలై పడున్న అవయవాలు. వాటికోసం పోరాడుతున్న మృగాలు. ముక్కులు పగిలే కుళ్ళుమాంసం కంపు!
“ఇక్కడెవడో ఉన్నాడు. వాడు మనిషి మాత్రం కాదు” అనే అనుమానం ప్రవేశించింది దాసరి మనసులో. ఆ అనుమానం నిజం చేస్తూ ఎదురుగా ఆ చెట్టు మీద కనిపించేడతనికి
కుంభజానువనే బ్రహ్మరాక్షసుడు!
మనిషి శవాన్ని చాలీచాలని గోచిగా పెట్టుకున్నాడు.
నల్లటి శరీరాన్ని ఎర్రటి కంబళితో కప్పుకున్నాడు.
తిరగేసిన ఏనుగుతలలా ఉంది వాడి ముఖం.
కందిరీగల తుట్టెలాటి గడ్డాలు, మీసాలు.
జందెంగా వేలాడుతున్నయ్‌ మనిషిపేగులు.
వేలాడుతున్న పొట్ట.
చెంబు తల.
ముచ్చినగుంటలో కొంచెం జుట్టు.
ఆకలిమీద ఉన్నాడు. తిండి తీసుకురాలేదని పిశాచుల్ని బండబూతులు తిడుతున్నాడు!
దాసరిని చూసేడు. నోరూరింది.
ఎగిరిదూకేడతని ముందు!
దాసరి కూడ తక్కువ వాడేం కాదు. శూరుడు. యుద్దాల్లో ఆరితేరినవాడు. బలవంతుడు.
ఇద్దరూ యుద్ధానికి దిగేరు. పిడిగుద్దుల్తో, కుస్తీపట్లతో కొంతసేపు సాగించేరు.
ఇలా కాదని దాసరిని కొట్టిచంపటానికి సాధనం కోసం చుట్టూ చూసేడు వాడు. ఇదే సమయమని వాణ్ణి తన్ని పడేసి పరిగెత్తబోయేడు దాసరి. రాక్షసుడు పిశాచుల్ని కేకేసేడు పట్టుకోమని. అందరూ కలిసి వెంటబడి పట్టుకున్నారతన్ని.
“నన్నింత కష్టపెట్టిన నిన్ను చిత్రవధ చేసి మరీ తింటా చూడు” అంటూ ఓ పేగుతో అతని చేతులు కట్టి కత్తినీ, నెత్తురు పట్టే గుండిగనీ తెమ్మని పిశాచుల్ని పంపేడు వాడు!
దాసరి ధైర్యంగా బ్రహ్మరాక్షసుడితో అన్నాడు “నాకు చావు గురించి భయం లేదు. నిజానికి శిబిచక్రవర్తి లాగా నా శరీరాన్ని మరొకరి ఆకలి తీర్చటానికి ఇవ్వటం నాకు సంతోషంగా ఉంది కూడ. ఐతే నాకో వ్రతం వుంది. రోజూ ఈ దగ్గర్లో ఉన్న కురుంగుడికి పోయి అక్కడ విష్ణుభజనలు పాడి వస్తాను. ఇవేళ కూడ అలాగే చేసే అవకాశాన్ని నాకివ్వు. తిరిగొచ్చి నీకాహారాన్నౌతాను” అని.
వెకవెక నవ్వేడు రాక్షసుడు. “నీ దొంగదాసరి వేషం చూసి నీ మాటలు నమ్మమంటావా? ఒకసారి యిక్కణ్ణుంచి పోతే నువ్వు మళ్ళీ తిరిగిరావని నాకు తెలీదనుకుంటున్నావా? ఈ వెర్రిమొర్రి మాటలు చాల్లే!” అని కొట్టిపారేసేడు.
“నారాయణా!” అంటూ చెవులు మూసుకున్నాడు దాసరి. ఎన్నో విధాలుగా చెప్పి చూసేడు. చివరికి ఘోరప్రతిజ్ఞ చేసేడు “ఎవనివల్ల ఈ విశ్వం పుడుతుందో, ఎవనిలో ఉంటుందో, చివరికి మళ్ళీ ఎవనిలో లీనమైపోతుందో ఆ విష్ణువుకి మరో దేవతనెవర్నో సమానంగా భావించిన పాపాన పోతాను, తిరిగి రాకుంటే” అని.
అప్పటికి నమ్మకం కలిగింది రాక్షసుడికి. దాసరిని ఒదిలేడు.
గుడికి పరుగెత్తుకెళ్ళేడు దాసరి. స్వామికి సాష్టాంగనమస్కారం చేసేడు. ఎప్పటికన్నా కూడా ఉద్రేకంతో స్తోత్రగీతాలు పాడేడు. వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రాక్షసుడి దగ్గరికి తిరిగొచ్చేడు. “నాలో ఏమీ మార్పు లేదు, బాగా చూసుకో. ఇందాక ఏఏ అవయవాలు ఎలా వున్నాయో యిప్పుడూ అలాగే ఉన్నాయి. ఇంక తృప్తిగా భోంచెయ్యి” అని మనస్ఫూర్తిగా చెప్పేడు వాడితో.
బ్రహ్మరాక్షసుడిక్కూడా కళ్ళెంట నీళ్ళొచ్చాయి దాసరి సత్యదీక్షకి!
కొండలా దాసరి చుట్టూ ప్రదక్షిణాలు చేసేడు వాడు. అతని కాళ్ళ మీద పడ్డాడు. అతని పాదాల్ని తన తల మీద పెట్టుకున్నాడు. అలాటివారు మరొకరుండబోరని అతన్ని పొగిడేడు.
ఐతే తనని త్వరగా తినమని వాణ్ణి తొందరచేసేడు దాసరి.
రాక్షసుడు ఒప్పుకోలేదు దానికి. తనని కరుణించి తను చేసిన పాపాలు తొలిగించమని దాసరిని వేడుకున్నాడు. తను పూర్వజన్మలో సోమశర్మ అనే బ్రాహ్మణుణ్ణని, ఒక ఘోరపాపం చెయ్యటం వల్ల ఇలా రాక్షసుణ్ణయానని, దాసరి ఆరోజు విష్ణువుకి పాడిన పాట ఫలాన్ని తనకి దానం చేస్తే యీ రాక్షసజన్మ పోతుందని ప్రాధేయపడ్డాడు.
దాసరి అందుకు ఏమాత్రం సుముఖత చూపించలేదు. “ఇలాటి శరీరాలు ఎన్నో వస్తాయి, పోతాయి. హరి నామ సంకీర్తనం ఎప్పుడో గాని చేసేది కాదు. కనక ఒక్క త్రుటి కాలం ఫలాన్ని కూడ మరొకరికి ఇవ్వను” అని మొండికేసేడు దాసరి.
రాక్షసుడు కాళ్ళావేళ్ళా పడ్డాడు. తన గురువుగారు అయోగ్యులకి ఎవరికీ చెప్పొద్దని శాశించినా కూడా వైష్ణవ గురువు లక్ష్మణ యోగీంద్రుడు ఎలా అందరికీ గీతా చరమార్థాన్ని శ్రీరంగనాథుడి గుడి గోపురం ఎక్కి మరీ బోధించాడో గుర్తుచేసేడు. ఇంకా ఎంతో మంది వైష్ణవ భక్తులు చేసిన లోకహితాలైన పనుల్ని ఏకరువు పెట్టేడు. చివరికి దాసరి ఆరోజు పాడిన చిట్టచివరి పాట ఫలాన్నైనా ఇమ్మని వేడుకున్నాడు.
కొంత మెత్తబడ్డాడు దాసరి. బ్రహ్మరాక్షసుడిగా ఎందుకు మారేడో చెప్పమన్నాడా రాక్షసుణ్ణి. ఇలా చెప్పేడు వాడు
“పూర్వజన్మలో నేను చోళదేశంలో ఉండేవాణ్ణి. పద్నాలుగు విద్యలూ నేర్చేను. గర్వంతో మిగిలిన విద్వాంసులెవర్నీ లెక్కచెయ్యకుండా అవమానిస్తుండే వాణ్ణి. ఓ సారి యజ్ఞం చేద్దామని డబ్బు సంపాయించటానికి మథురకి వెళ్ళేను. చెప్పకూడని పనులన్నీ చేసి డబ్బు పోగేసేను. దాన్ని ఇంకా పెంచుదామని ఓ వ్యాపారికి వడ్డీకిచ్చేను. కొన్నాళ్ళయాక ఇంటికి తిరిగివెళ్ళాలనిపించింది. డబ్బు వసూలు చెయ్యటానికి ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళేను.
ఇక అప్పుడు చూడాలి నా చిందులు! వడ్డీ తక్కువైందని పోట్లాడేను. లెక్క తప్పయిందని రంకెలేసేను. అతనికి నేనిచ్చింది అంతకంటె ఎక్కువని అభాండాలు వేసేను. ఎన్ని రకాలుగా వీలౌతుందో అన్ని రకాలుగా కీచులాడి అతనిచ్చిన డబ్బుని పదిసార్లు లెక్క పెట్టుకుని తీసుకున్నాను.
ఐతే నాకప్పుడు తెలియంది ఓ దొంగ ఇదంతా గమనిస్తున్నాడని.
నేను కొత్త చెప్పులు కొని వాటిని సిద్ధం చెయ్యటం, క్షౌరం చేయించుకుని స్నానం చెయ్యటం, తమలపాకులు, వక్కలు నిలవ చెయ్యటం, సత్రాలకి వెళ్ళి ఎవరెవరు ఎటు వైపు వెళ్తున్నారో వాకబు చెయ్యటం అన్నీ గమనించేడు వాడు. అలా నేనెప్పుడు ఏ బిడారుతో కలిసి వెళ్తోంది తెలుసుకున్నాడు. నమ్మకంగా తనూ మాతో ఒచ్చి చేరేడు. తన తోటి దొంగల్ని ముందుగానే పంపి దార్లో కాపు వేయించేడు.
మేం బయల్దేరేం. దార్లో అర్థరాత్రి మమ్మల్ని హడావుడిగా లేపేడు వాడు. “పదండి పదండ”ని ఊదరగొట్టేసేడు. ఎక్కడికో తెలీకుండా నిద్రమత్తులో అందరం నడిచేం. చక్కగా మమ్మల్ని దారి తప్పించి ఓ వాగు దగ్గరికి తీసుకుపోయేడు. అది దాటటానికి మేం దాన్లో ఇలా దిగేం అలా యీలేసేడు వాడు.
అంతే! బాణాలూ, రాళ్ళూ మామీద కురిసినయ్‌. దొంగలొచ్చి చుట్టూ కమ్ముకున్నారు. బలవంతుల్ని, ఆయుధాలున్న వాళ్ళని వదిలి మిగిలిన వాళ్ళని దొరికినంత దోచుకున్నారు. గుడ్డలూడదీయించి గోచీలిచ్చేరు. చెప్పుల్ని చీల్చి, జుట్టుల్ని దులిపి చూసేరు.
ఈ గొడవలో కొంతమంది తప్పించుకు పారిపోయేరు. వాళ్ళతో పరిగెత్తేను నేను కూడా.
ఐతే నన్ను మొదట్నుంచీ కనిపెడుతున్నవాడు మాత్రం నన్నొదల్లేదు. వెంటపడి పట్టుకుని నా దగ్గరున్నవన్నీ ఊడ్చేసేడు.
హఠాత్తుగా నాకు వాణ్ణి ఇదివరకు చూసి వున్నట్టు గుర్తొచ్చింది. వాడు మా పొరుగూరి వాడే!
ఆ మాట అరిచి చెప్పేను వాడితో. నా సొమ్ము వాడికి దక్కకుండా చేస్తానని బెదిరించేను.
దాంతో వాడు నా డబ్బు తిరిగివ్వకపోగా నన్ను పట్టుకుని చితకబాదేడు. ఇంతలో మిగిలిన వాళ్ళు రాబట్టి గాని లేకుంటే అక్కడే హరీ మనే వాణ్ణి.
ఆ దగ్గర్లో ఉన్న పెద్ద బాటలో వెళ్తూ మరో బిడారు వచ్చిందంతలో. వాళ్ళలో నా బావమరిది ఒకడున్నాడు. వాడు నన్నో కావడిబుట్టలో పెట్టుకుని మోసుకుపోయేడు.
సరిగ్గా ఈ చెట్టు కిందికి వచ్చేసరికి అతనికి దాహం వేసి నన్నిక్కడ దించి నీళ్ళ కోసం వెదుక్కుంటూ పోయేడు. అంతలోనే నా ప్రాణాలు పోయేయి. అతను తిరిగొచ్చేసరికి నేనిలా రాక్షసుణ్ణయాను.
చావు సమయంలో నన్నుకొట్టిన ఆ దొంగ రూపమే నా మనసులో ఉండిపోయింది గనక నాకూ అలాటి రూపమే వచ్చింది.
ఇదీ నా కథ” అంటూ ముగించాడు రాక్షసుడు.
అంతా విన్న దాసరి ప్రసన్నుడయేడు.
“దేని ఫలం ఏమిటో నాకేమీ తెలీదు; అన్నిటినీ చూసుకునే వాడు ఆ నారాయణుడొక్కడే” అని దాసరి అంటూండగా అతని మాటలు అతని నోట్లో ఉండగానే బ్రహ్మరాక్షసుడి రూపం మారిపోసాగింది.
మళ్ళీ సోమశర్మగా, వైష్ణవ చిహ్నాలు ధరించి నిలిచేడు ఎదురుగా. దాసరిని స్తోత్రం చేసి పూజించేడు.
ఇలా మాలదాసరి వృత్తాంతం విష్ణుచిత్తుడికి చెప్పేడు శ్రీ మహావిష్ణువు.
చెప్పి, “నాకు చేసే భజనల ప్రభావం ఎంత విలువైందో ఇప్పుడు తెలిసింది కదా! కనుక నీ కూతురు ఎప్పుడూ ద్రావిడప్రబంధాలు పాడుతున్నందుకు నువ్వు ఆనందించాలి. ఆమె పూర్వజన్మలో భూదేవి. ఆమెని శ్రీరంగానికి తీసుకెళ్ళు. మేలు జరుగుతుంది” అని ఆనతిచ్చేడు.
అలాగే నని శ్రీరంగం వెళ్ళేడు విష్ణుచిత్తుడు గోదాదేవితో. ఇద్దరూ శ్రీరంగేశుడి సన్నిధికి వెళ్ళి ఆయన్ని భక్తితో పూజించేరు. శ్రీరంగనాథుడు ప్రత్యక్షమయేడు. అతని కుశలమడిగేడు. గోదాదేవిని గమనించేడు. ఆమెని తన అంతఃపురంలోకి తీసుకుని ఆమెలాటి మాయాసుందరిని సృష్టించి విష్ణుచిత్తుడితో పంపేడు.
తీరా విష్ణుచిత్తుడు ఇంటికి చేరి పల్లకి తెరిచి చూస్తే దాన్లో గోదాదేవి కన్పించలేదు!
శ్రీరంగనాథుడు తన కుమార్తెని అపహరించేడని అందరితోనూ మొరపెట్టుకున్నాడు విష్ణుచిత్తుడు.
అతని ఆ వ్యథకి భగవంతుడు కూడా భయపడ్డాడు!
ప్రత్యక్షమై “ముసలితనం వల్ల నీకు మతిస్థిమితం తప్పినట్టుంది. నీ కూతురు పదిలంగా నీ ఇంట్లోనే ఉంది. వెళ్ళి చూసుకో ముందు” అని పంపేడతన్ని.
వెళ్ళి చూసేసరికి నిజంగానే అతని ఇంట్లోనే ఉందామె.
రంగనాథుడు పిల్లనడగటానికి బ్రహ్మరుద్రుల్నీ సరస్వతీ పార్వతుల్ని విష్ణుచిత్తుడి ఇంటికి పంపేడు. వాళ్ళు వెళ్ళి అతన్తో గోదాదేవి వివాహవిషయాలు ముచ్చటించేరు. విష్ణుచిత్తుడు పరమానంద భరితుడై అందుకు అంగీకరించాడు.
శ్రీ విలిబుత్తూరులో విష్ణుచిత్తుడి ఇంట్లో సకల దేవతల సమక్షంలో
మహావైభవంగా జరిగింది వివాహం.
సంతుష్టుడై, ఆనందంగా గోదాదేవీ సహితుడై జగాల్ని పాలిస్తున్నాడా నారాయణుడు!
అనుబంధం 1. కొన్ని పద్యాలు.
ఇక్కడ రాయల ప్రత్యేక శైలికి, సంభాషణాచాతుర్యానికి కొన్ని ఉదాహరణలిస్తున్నా.
1. (ఆముక్తమాల్యద విలక్షణతల్లో ఒకటి రాయలు చేసిన ప్రార్థనలు. మిగిలిన కవుల్లా అతను త్రిమూర్తుల్ని, వాళ్ళ భార్యల్ని, వినాయకుణ్ణి స్తుతించడు. వెంకటేశ్వరుణ్ణి, ఆయన ఆయుధాల్నీ, వాహనాల్నీ మాత్రమే స్తుతిస్తాడు. చివరికి లక్ష్మీదేవిని కూడ తలుచుకోడు. ఇది ఆయన వీర వైష్ణవ భక్తికి నిదర్శనం కావొచ్చు. ఐతే గరుత్మంతుడి గురించి ఆయన రాసిన ఈ పద్యం సంస్కృత సమాస భూయిష్టమైనా గొప్ప భావుకతని చూపిస్తుంది)
ఖనటత్‌ పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య
పిండీకృతాంగ భీతాండజములు
ధృత కులాయార్థ ఖండిత సమిల్లవరూప
చరణాంతిక భ్రమత్తరువరములు
ఘన గుహా ఘటిత ఝాంకరణ లోకైక ద్వి
దుందుభీకృత మేరుమందరములు
చటుల ఝంపా తరస్స్వనగరీ విపరీత
పాతితాశాకోణ పరిబృఢములు
ప్రబలతర బాడబీకృతేరమ్మదములు
భాస్వదేరమ్మదీకృత బాడబములు
పతగ సమ్రాట్‌ పతత్ర ప్రభంజనములు
వృజిన తూలౌఘముల తూల విసరు గాత
(గరుత్మంతుడి రెక్కల ఊపుకి వస్తున్న గాలి ఎంత శక్తివంతమైన దంటే సముద్రం ఎగిరి ఆకాశంలో ఉంటే అడుగున పాతాళంలో ఉన్న పాములన్నీ భయంతో ఒకదాన్నొకటి పెనవేసుకున్నాయి; గొప్ప గొప్ప చెట్లు కూడ గూడు కట్టుకోవటానికి పనికొచ్చే పుల్లల్లా అతని కాలి వేళ్ళ చివర్లలో చిక్కుకుని ఉన్నయ్‌; గుహల్లో మారు మోగుతున్న ఆ గాలి వల్ల ప్రపంచానికి అటూ ఇటూ రెండు దుందుభుల్లాగా ఉన్నాయి మేరు మందర పర్వతాలు; ఆ గాలికి దిక్పాలకులు వాళ్ళ దిక్కుల్లోంచి ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడి వున్నారు; మేఘాలు సముద్రంలో ఉన్నాయి; సముద్రం మేఘాల్లో ఉంది. అలాటి గరుత్మంతుడి రెక్కలు నా పాపాల దూది పింజల్ని ఎగరగొట్టు గాక!)
2. (ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం. చాలా స్వాభావికమైన వర్ణన.)
తల పక్షఛ్ఛట గుచ్చి బాతువులు కేదారంపు కుల్యాంతర
స్థలి నిద్రింపగ చూచి ఆరెకు లుషస్స్నాత ప్రయాత ద్విజా
వళి పిండీకృత శాటిక ల్సవి తదావాసంబు చేర్పంగ రే
వుల డిగ్గన్‌ వెస పారు; వాని కని నవ్వున్‌ శాలిగోప్యోఘముల్‌
3. (విష్ణుచిత్తుడి ఇంట్లో అర్థరాత్రయినా కూడా అతిథులకి భోజనాలు పెడుతుంటారని చెప్పే ఈ పద్యం కూడ ప్రఖ్యాతం. చక్కటి శైలితో సాగిపోయే పద్యం)
ఆ నిష్టానిధి గేహసీమ నడురేయాలించినన్‌ మ్రోయు ఎం
తే నాగేంద్రశయాను పుణ్యకథలుం దివ్యప్రబంధాను సం
ధానధ్వానము “నాస్తి శాక బహుతా నాస్య్తుష్ణతా నాస్య్తపూ
పో నాస్య్తోదన సౌష్టవం చ కృపయా భోక్తవ్య”మన్‌ మాటలున్‌
4. (ఎండా కాలంలో పగళ్ళు పొడవయ్యాయని చెప్పటానికి ఈ పద్యంలో వాడిన భావచిత్రం రసమయం)
పడమర వెట్టు నయ్యుడుకు ప్రాశన మొల్లక కూటిపేదలై
బడలిక నూడు నచ్చిలువ ప్రగ్గములన్‌ రవియాజ్ఞ మాటికిన్‌
ముడియిడ పిచ్చుగుంటు రథమున్నిలుపన్‌ పయనంబు సాగమిన్‌
జడను వహించెనాగ దివసంబులు దీర్ఘములయ్యె నత్తరిన్‌
(పడమటి నుంచొస్తున్న వేడి గాలి తినలేక సూర్యుడి రథం పగ్గాలైన పాములకి శోషొచ్చి మాటి మాటికి ఊడిపోతున్నయ్‌. అప్పుడు ఆ రథసారథి రథాన్ని ఆపి దిగి మళ్ళీ వాటిని ముడివేస్తున్నాడు; ఇందువల్ల సూర్యుడి రథం చాల తాపీగా నడుస్తోంది; అందువల్ల పగళ్ళు పొడవైనట్టున్నయ్‌. ఇక్కడ చాలా కవిసమయాల్ని ఒకచోట చేర్చేడు రాయలు.)
5. (ఆముక్తమాల్యదలో సంభాషణలు గమ్మ్తౖతెన పదాల్తో వింతగా ఉంటయ్‌. ఇప్పుడు అలాటివో రెండు పద్యాలు చూపిస్తాను.)
ఆతిథ్యము గొని, హరి తన
చేతోగతి నొలయ, రంతు సేయని విద్వద్‌
వ్రాతంబు చూచి “లాతుల
మా తరవా యుడుగ? మాటలాడుం” డనుచున్‌
(ఇక్కడ ఉన్నది చిన్న వాక్యమే ఐనా అర్థం చేసుకోటానికి కొంచెం సమయం పడ్తుంది. ఇదీ అన్వయం తరవాయి, ఉడుగ (చెప్పటానికి సందేహం ఎందుకు?), లాతులమా (పరాయివాళ్ళమా?), మాటలాడుండు, అనుచున్‌)
6. (ఇవి పాండ్యరాజు తనని వైష్ణవుడిగా చెయ్యటానికి వచ్చిన యామునుడితో అంటున్న మాటలు.)
సంగతియె యోయి? ఇసుమంత ఠింగణావు!
తత్వ్త నిర్ణయ వాదంబు తరమె నీకు?
ఓడితేనియు పట్టి మొర్రో అనంగ
లింగమును కట్టకుడుగ మెరింగి నొడువు!
(చాలా గమ్మత్తయిన పదాలున్నాయిందులో. ఐతే వాటితో ఆ రాజు కంఠస్వరాన్ని ఎంతో గొప్పగా చూపిస్తున్నాడు కవి. దీని అన్వయం ఓయి, సంగతియె (సంగతేమిటో తెలుస్తోందా నీకు?), ఇసుమంత (చిన్న), ఠింగణావు (పొట్టిగుర్రం లాటి వాడివి “చూట్టానికి బుడతడివి” అన్నట్టు), రెండు, మూడు పాదాలు స్పష్టమే; లింగమును కట్టక, ఉడుగము (ఊరుకోము), ఎరిగి (ఇది తెలుసుకుని), నుడువు (మాట్లాడు). )
7. (ఆముక్తమాల్యద కన్న ముందు రాయలు సంస్కృతంలో ఎన్నో కావ్యాలు రాశేడు. ఆముక్తమాల్యదలో కూడా కనిపించేది సంస్కృతం గాని చాలా వ్యావహారికమైన తెలుగ్గాని రాసేప్పుడు అతను most comfortable గా ఉండటం. దానికి ఉదాహరణ ఈ పద్యం.)
అద్ధా వాగ్విబుధం బహో వచన కవ్యాహార మాహా వచ
స్సిద్ధం బాః కృతతాం గతః కలి రితి శ్రీసూక్తి విద్యాధరం
బిద్ధౌద్ధత్య మగాల్లయం హి కుధియా మిత్యున్నదత్‌ కిన్నరం
బధ్హీరాగ్రణి గెల్పుటుత్సవమునం దయ్యెన్‌ నభంబంతయున్‌
(విష్ణుచిత్తుడు గెలిచినప్పుడు దేవలోకాల్లో వాళ్ళు ఏమని పొగిడేరో చెప్తుంది. విబుధులు (దేవతలు) “అద్ధా” అన్నారట; కవ్యాహారులు (పితరులు) “అహో” అన్నారట; సిద్ధులు “ఆహా” అన్నారట; విద్యాధరులు “కలి యుగం కృత యుగం ఐంది కదా” అనే శ్రీసూక్తి పలికేరట; కిన్నరులు బిగ్గరగా “ఇతర మతాల వాళ్ళ గర్వం అణిగింది కదా” అన్నారట! అన్నవాళ్ళు దేవతలు గనక దేవభాషలోనే చెప్పాడు కవి.)
8. (మనుచరిత్ర లో ప్రఖ్యాత పద్యం “అటజని కాంచె భూమిసురుడు” కి సాటిగా ఉన్న ఈ పద్యం మాలదాసరి కథలోది. అతనిక్కనిపించిన వటవృక్షం వర్ణన.)
కాంచెన్‌ వైష్ణవు డర్థయోజన జటాఘాటోత్థ శాఖోప శా
ఖాంచత్‌ ఝాట చరత్‌ మరుత్‌ రయ దవీయః ప్రేషితోద్యచ్ఛదో
దంచత్‌ కీట కృతవ్రణత్‌ ఛలన లిప్యాపాదితాధ్వన్య ని
స్సంచారాత్త మహాఫలోపమ ఫల స్ఫాయత్‌ వటక్ష్మాజమున్‌
9. (అదే సందర్భంలో ఉన్న బ్రహ్మరాక్షసుడి వర్ణన మరొకరికి సాధ్యమయేది కాదు! )
మృతమర్య్తు రెంటాన నిడ్డ చాలక నెత్రు
రంజిల్లు పెనుపొట్ట ముంజివాని
పల్లచీమల వక్ర భల్లాతకియు పోలె
ఎర్రదుప్పటి నొప్పు కర్రెవాని
వ్యత్యస్త హస్తిమస్తాభ పాయగు గడ్డ
మును దంష్ట్రికలు పొల్చు మొగము వాని
కడుదుర్ల నిడు తుట్టె గతి చొంగలో పాండు
రత మించు కపిల కూర్చంబు వాని
ఎరకు తెరువరి గన శాఖలెక్క జారు
ప్రేవుజందెంబు కసరి పై బెట్టువాని
వ్రేలుడగు బొజ్జగల బూరగాలి వాని
చెంబుతల వాని అవటు కచంబు వాని
10. (సోమశర్మ ఉన్న బిడారుని దొంగలు పట్టుకున్నప్పుడు అందులో ఉన్న వాళ్ళు ఏమేం చేసేరో చెప్పే ఈ పద్యం కూడా ముచ్చటైంది మనుషుల స్వభావాల్నీ, వాళ్ళ మాటల్నీ కళ్ళక్కట్టి చూపించటంలో.)
పసలేదు నిలరోయి పాపులారా యని
దేవాయుధంబులు రూవు వారు
పైడిబాసము చెట్ల పడవైచి దుడ్డు పె
ట్లకు పారుచునె ఒలెల్‌ వైచువారు
బరువు డించి కటారి పరు చించి నిల్చి యిం
దెందు వచ్చెదరని ఎదురువారు
వస్త్రంబు కొండు దేవర ఓయి ఇది చన్న
పస్తని దయపుట్ట పలుకువారు
కలవి మామూక నిప్పింతు, తొలగు, డొకటి,
ఆడుదాని చేనంటకు డనుచు పెద్ద
తనము నభిమానమును తెంపు కనగ పలికి
నిలిపి దోపిచ్చువారునై తొలగిరపుడు
11. (చివరగా, కృష్ణరాయలు తన గురించి చెప్పుకున్న ఈ చివరి పద్యంతో ముగిస్తాను.)
ఇది నీలాచల నీలచేలక సుభద్రేందీవరాభాక్షి కో
ణ దృగంచత్‌ భుజ వీర్య ధుర్య జయ సన్నాహార్భటీ వాద్య భీ
త్యుదితేభేశ్వర కృష్ణరాయ మహిజా న్యుత్పాదితాముక్తమా
ల్యద నాశ్వాసము సప్తమంబలరు హృద్యంబైన పద్యంబులన్‌
అనుబంధం 2. యామునుడు చెప్పిన రాజనీతులు కొన్ని.
విసుక్కోకుండా ప్రజల్ని రక్షించాలి రాజు. రాజు ప్రజల మేలు కోరితేనే ప్రజలు రాజు మేలు కోరుతారు. ప్రజలంతా కోరిన కోర్కెని పరమేశ్వరుడు తీరుస్తాడు.
ఎవడినైనా ముందు పెద్దవాణ్ణి చేసి ఆ తర్వాత తగ్గిస్తే వాడు మొదల్లో ఉన్న తన తక్కువ స్థితిని తల్చుకోడు ఉన్నతస్థితి నుంచి కింద పడ్డాననే బాధపడతాడు. కాబట్టి శీలవంతులైన వాళ్ళని గుర్తించి వాళ్ళని క్రమక్రమంగా వృద్ధిలోకి తీసుకురావాలి.
జాతిభ్రష్టులైన బ్రాహ్మణుల్ని దగ్గరికి రానియ్యవద్దు. ఐతే మంత్రుల్గుగా ఉండాల్సిన బ్రాహ్మణులు ఎలాటి వారంటే వయసు ఏభైకి పైన, డెబ్భైకి లోపల వుండాలి; బాగా చదివిన వాళ్ళు కావాలి; అధర్మభీతి, రాజనీతి తెలియాలి; వాళ్ళ పూర్వులెవరూ రోగిష్టులై వుండకూడదు. ఈ గుణాలున్న వాళ్ళు దొరక్కపోతే తనే స్వయంగా రాజనీతి నడపాలి తప్ప ఎవర్ని బడితే వాళ్ళని మంత్రులు చెయ్యకూడదు.
డబ్బు వల్లే ఏ పనీ కాదు. పనిచేసే వాళ్ళకి దాని మీద ఆసక్తి, రాజు మీద విశ్వాసం ఉండాలి. అలాటివాళ్ళ విషయంలో రాజు కూడ లోభించకుండా డబ్బివ్వాలి, దాపరికం లేకుండా ఉండాలి.
డబ్బు వసూలు, దేవాలయాధికారము ఒక్కడికే ఇవ్వొద్దు డబ్బు సరిగా రాకపోతే ఆలయాల ఖర్చు తగ్గిస్తాడు; ఆలయాల సొమ్ము తినబోయేడా, రాజుకొచ్చే డబ్బుతో కూడ అది కలుస్తుంది గనక రాజు కూడ వాడి పాపంలో పాలుపంచుకోవలసొస్తుంది.
రైతు ముందుగా పొలాన్ని స్వాధీనం చేసుకుని, తర్వాత దాని చుట్టూ ముళ్ళకంచె నాటి, దుక్కి దున్నే ముందు గడ్డల్ని వేర్లను ఏరేస్తాడు. రాజు తన రాజ్యాన్ని కూడ అలాగే చూసుకోవాలి.
ఎవడన్నా అబద్ధాలు చెప్తున్నాడని అనుమానం వస్తే వెంటనే వాణ్ణి ఏమీ చెయ్యొద్దు. జాగ్రత్తగా వాడి విషయం అంతా ఆలోచించి నిజంగానే అబద్ధాలు చెప్తున్నాడని నిశ్చయం చేసుకో. అప్పుడైనా వాణ్ణి పన్లోంచి తీసెయ్యొద్దు నీకు దూరంగా ఉండేట్టు చూడు.
అరణ్యాల్లో ఉంటూ నీ ప్రజల్ని బాధించే కిరాతుల్లాంటి వాళ్ళతో తలపట్టానికి ఆ చుట్టుపక్కల ఊళ్ళని నీ వాళ్ళు కాని శూరులకి ఇవ్వు. అప్పుడు వాళ్ళూ వాళ్ళూ కొట్టుకుచస్తారు.
బోయలు, చెంచులు మొదలైన వాళ్ళు వాళ్ళకి పాలన్నం పెట్టినంత మాత్రాన విశ్వాసవంతులౌతారు. ఐతే వాళ్ళకి కోపం రావటం కూడ చాలా తేలికే. వాళ్ళ విషయంలో మంచితనంతో ఉండాలి.
గట్టివాడొకడు ఒక పని సాధించటానికి మార్గం కనుక్కుని చెప్తే, వాడంటే ఈర్య్ష ఉన్న మరొకడు దానికి వ్యతిరేకంగా చెప్తాడు. అక్కడ ఎవరి వైపూ వెళ్లకుండా, ఆ తర్వాత మాత్రం మొదటివాడు చెప్పినట్టు చెయ్యి.
చెడ్డమంత్రులు చాలా విధాల ప్రమాదాలు కలిగిస్తారు. వాళ్ళ సంగతి చూడటానికి గట్టివాణ్ణి, మంచివాణ్ణి వాళ్ళ మీద నియోగిస్తే వాడే వాళ్ళ విషయం చూస్తాడు.
అధికారులు ఎప్పుడూ రాజుకు మిత్రులు కారు; వాళ్ళ రాబడి వాళ్ళు చూసుకునే వాళ్ళే. చెడ్డపనులు చేసే అధికారుల్ని పూర్తిగా వదిలెయ్యకుండా అతిజాగ్రత్తగా నడిపిస్తుండాలి.
నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు నీకు అపకారం చెయ్యబోతాడో వాణ్ణి ఆ కష్టం తీరేక హింసింసొద్దు వాడి ఆస్తి తీసుకో; దాంతో వాడి మదమూ తగ్గుతుంది, నువ్వు హింసించకుండా వొదిలిపెట్టినందుకు వాడు నీకు కృతజ్ఞుడుగానూ ఉంటాడు.
ఎంత చిన్న చోటులోనైనా వ్యవసాయానికి నీళ్ళ వసతులు కలిగించాలి రాజు. దానివల్ల పంటలు పెరిగి పన్ను వసూళ్ళూ ఎక్కువౌతయ్‌. అలాగే పేదల దగ్గర పన్నులు తక్కువ తీసుకుని, వాళ్ళు వృద్ధిలోకి వచ్చేట్టు చూస్తే తర్వాత వాళ్ళ నుంచి కూడా మంచి ఆదాయమే వస్తుంది. అందుకని ఇళ్ళు, భూములు, పశువులు వదిలేసి వెళ్ళబోయే వాళ్ళని ఆదుకుని వాళ్ళు నిలదొక్కుకునేట్టు చెయ్యాలి.
రాజు తన ఆదాయంలో సగం సైన్యం కోసం, తనని గెలిపించిన సైన్యం భరణం కోసం వాడాలి; మిగిలిన దాన్లో సగం దానాలకీ భోగాలకీ, మిగతా సగం బొక్కసాన్ని నింపటానికి వాడాలి. చారుల ద్వారా మంత్రుల్ని, శత్రువుల్ని కనిపెట్టి వుండాలి. రాజ్యంలో దొంగల భయం లేకుండా చెయ్యాలి. ఒక దొంగ పట్టుబడితే వాణ్ణి వెంటనే శిక్షించాలి. ఆలస్యం చేస్తే వాడు తప్పించుకుని పోవచ్చు. అలా జరిగితే వాడిక్కాని, మిగిలిన వాళ్ళకి గాని రాజంటే భయం ఉండదు.
ఎప్పుడూ నీతిమార్గంలో నడవాలి రాజు. తను తెలుసుకోవలసిన విషయాలు వీలైనంతగా స్వయంగా తెలుసుకుని ఉండాలి. తెలియని కొద్ది వాటికి ఆప్తుల్ని, మిత్రుల్ని అడగాలి. తెలియని విషయాల్లో తన అభిప్రాయమే ఒప్పనుకోకూడదు.
భోగాలనుభవిస్తున్నా ఎలుగుబంటి లాగా ఒక కంటితో ఎప్పుడూ రాజ్యం లోపలి, బయటి శత్రువుల్ని కనిపెట్టి ఉండాలి.
భిక్షువులు, సన్యాసులు మొదలైన వాళ్ళకు డబ్బు, ఊళ్ళు ఇవ్వకు. ఇస్తే వాళ్ళు తమ విద్యల్ని వదిలేస్తారు. వాళ్ళ పట్ల భక్తి చూపిస్తే చాలు.
రాజు శూరుడైనా తన కొలువులో దొరలు తమని తాము పొగుడుకుంటే విసుగు చూపించకుండా వినాలి. దానివల్ల వాళ్ళకి తృప్తీ కలుగుతుంది, అవసరాల్లో ఇంకా ఉత్సాహంగా కష్టపడతారు.
వాణిజ్యం పెంచటానికి రేవుల్ని వృద్ధి చెయ్యాలి. ఈతి బాధల వల్ల ఇతర దేశాల జనం వలస వస్తే వాళ్ళని తన శక్తి కొద్ది ఆదుకోవాలి. తోటలు, దొడ్లు, గనులు చూడటానికి ఆప్తులైన వాళ్ళని నియమించాలి.
యుద్ధానికి వెళ్ళేప్పుడు ఒకటి రెండు రోజుల ప్రయాణం తర్వాత ఆగుతూ తన సైన్యాలన్ని కూడుకునే అవకాశం కలిగించాలి. అలలు అలలుగా వెళ్ళకూడదు. తీరా వెళ్ళేక అవతలి రాజు బలవంతుడైతే అతని సత్కారాలు స్వీకరించి వెనక్కు మళ్ళాలి; బలహీనుడైతేనే ముట్టడించాలి. శత్రురాజు తన ప్రజల్ని, సామంతుల్ని సరిగా చూడని వాడైతే ముందుగా అతని సామంతులకి అభయం ఇచ్చీ, మణిభూషణాలు పంపీ మంచి చేసుకోవాలి.
రాజుకి ముఖ్యమైన ప్రమాదం లోపలిశత్రువుల నుంచి. అందువల్ల లోపల శత్రువులున్నప్పుడు శత్రురాజు యుద్ధానికొస్తే వాడికి సగం రాజ్యం ఇచ్చైనా సంధి చేసుకుని ముందు లోపలి శత్రువుల్ని అణచాలి.
రాజు చెయ్యకూడని పనులు ఏమిటంటే క్రూరమైన శిక్షలు వెయ్యటం, చెప్పుడు మాటల గురించి లోతుగా ఆలోచించకపోవటం, శత్రువు సంధికి వస్తే ఈసడించటం, శత్రురాజు గురించి సమాచారం తెచ్చిన వాణ్ణి శిక్షించటం, తనకి వ్యతిరేకుడైన మంత్రికి తెలిసేట్టు పనులు చెయ్యటం, విశ్వాసం లేని వాళ్ళని దగ్గరుంచుకోవటం, విశ్వాసపరుల్ని దూరం చెయ్యటం, మంత్రాంగంలో మొహమోటపట్టం, జనానికి పీడలొచ్చినప్పుడు లోతుగా విషయాలు విచారించకపోవటం, వ్యసనాలు ఉండటం, ఈర్య్ష పడటం.
దొరల మధ్య ఒకరికొకరికి పోటీలు ఉండేట్టు చూడాలి. అప్పుడు ఒకడి గుట్టు మరొకడు నీకు చెప్తాడు. సైన్యాధికారుల విషయంలోనూ ఇంతే.
సామాన్యంగా యుద్ధాలకి రాజు స్వయంగా వెళ్లకూడదు. తన ప్రతినిథిగా వెళ్ళే వాణ్ణి, విశ్వాసుడైన వాణ్ణి చూసుకోవాలి. వాడికి డబ్బు, ఇతర భోగాలు సమృద్ధిగా ఉండేట్టు చూడాలి.
నీ దేశం ఎల్లల్లో ఉన్న అడవుల్ని వృద్ధి చెయ్యి. మధ్యలో ఉన్నవాటిని నరికించు లేకపోతే దొంగలు చేరతారక్కడ.
మన్నెం జనం చాలా తప్పులు చేస్తారు. దండించి వాళ్ళని మార్చలేవు. బహుమానాలిచ్చి, నిజం తప్పకుండా మెలిగి, వాళ్ళతో స్నేహం చెయ్యి. నీ యుద్ధాల్లో బాగా సహాయపడతారు వాళ్ళు.
ఏనుగులు, మంచి గుర్రాలు దిగుమతి చేసే వర్తకుల్ని అన్ని సౌకర్యాలిచ్చి నీవాళ్ళుగా చేసుకో. వాళ్ళు వాటిని నీ శత్రువులకి చేర్చకుండా పనికొస్తుంది.
ఇతర రాజ్యాల రాయబారుల్తో సరస సంభాషణలు చెయ్యాలి. వాళ్ళ ముందు తన అనుచరులు ఇదివరకు ఆ రాజులు చేసిన అపకారాల గురించి మాట్టాడేట్టు చేసి, తను ఆ రాజుకి మిత్రుడిలా నటిస్తూ సర్ది చెప్పాలి.
దుర్గాల్ని తన మేలు కోరేవాళ్ళు, తరతరాలుగా తమతో పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కో దుర్గంలో వందేళ్ళ పాటు సరిపడే సామాగ్రి ఉంచాలి. సామంతరాజులందరికీ సమానంగా భూములివ్వాలి. శత్రురాజు బలహీనుడైనప్పుడు హఠాత్తుగా వెళ్ళి అతన్ని జయించాలి దాని వల్ల రెండు వైపులా నష్టం జరగదు.
శత్రువుల మీద రాజు ప్రతిజ్ఞలు చెయ్యకూడదు. యుద్ధానికెళ్తే పని జరగొచ్చు, జరక్కపోవచ్చు. జరగనప్పుడు మరో మంచి సమయం కోసం ఆగాలి తప్ప తొందరపడకూడదు. మారణయంత్రాలున్న చోట్లకి రాజు పోకూడదు, సైన్యాన్నే పంపాలి. యుద్ధాలు చెయ్యి, రాజ్యాలు జయించు. ఆ రాజుల రాణులు దొరికితే వాళ్ళని సోదరుడి లాగా చూసుకో. రాయబారుల ముందు వాళ్ళ రాజుల గురించి చెడ్డగా మాట్టాడొద్దు.
ఎవడన్నా మనసుకి నచ్చిన ఆలోచనలు చెప్తే అక్కణ్ణుంచి రాజులు వాణ్ణే మాటిమాటికి సలహా అడుగుతారు. దాంతో వాడికి గర్వం వచ్చి పనులు కావలసిన వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని రాజుకి చెడ్డ ఆలోచనలు చెప్తాడు. అలాటి వాళ్ళని చారుల ద్వారా గమనిస్తూ వుండాలి ఎప్పుడూ.
కపటం వున్న మనుషులు నువ్వు బాగున్నప్పుడు పొగుడుతారు, కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోతారు. జాగ్రత్తగా గమనించు.
రాజు తన రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటాడో అలాగే తన శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
రాజు దినచర్య ఇలా ఉండాలి పొద్దున్నే వైద్యులు, జోస్యులు అతన్ని కలవాలి; జాము పొద్దు తర్వాత డబ్బు విషయాలు కనుక్కోవాలి; ఆ తర్వాత వ్యాయామం, వంటవాళ్ళకి ఆజ్ఞలు; మధ్యాన్నం దేవతార్చన, ధర్మగోష్టి; భోజనం అయాక ముందు విదూషకుడు, తర్వాత పౌరాణికులు, కవుల్తో గోష్టి; సందెవేళ చారుల్తో ముచ్చట్లు, గానసభ; రాత్రికి ప్రేయసితో సల్లాపాలు, సుఖనిద్ర.
నీ సేవకుల్లో మూడు రకాల వాళ్ళుంటారు ఎప్పుడూ నీ మంచి కోరేవాళ్ళు, మంచిచెడ్డలు రెండూ కోరేవాళ్ళు, చెడే కోరేవాళ్ళు. ఎవరు ఎవరో గ్రహించాలి నువ్వు. నీకు ఎవడైనా బాగా నచ్చితే, అన్ని విషయాలు తెలుసుకుని నిశ్చయించుకుని, ఒక్కసారిగా హఠాత్తుగా అతను ఆశించలేనంత డబ్బిచ్చి ఆశ్చర్యపరుచు.
చారుడు రాజు ఊరివాడై ఉండాలి, నానా భాషలు తెలిసినవాడు, ఇతర చారులెవరో తెలీని వాడు, మిగిలిన చారులకి తను తెలియని వాడు కావాలి.
రాజు భోజనంలో రకరకాల పదార్థాలు ఉంటాయి గనక బాగా ఆకలిగా ఉంటే తప్ప తినకూడదు.
రాజ్యం చేసేప్పుడు ఎన్నో పాపాలు కట్టుకోకతప్పదు. వీలైనంత అధర్మం జరక్కుండా చూసుకోవటం అవసరం. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు.
రచన : కె. వి. ఎస్. రామారావు
" ఈమాట" సౌజన్యంతో ..

విలక్షణమైన కావ్యం ఆముక్తమాల్యద

(ఆముక్తమాల్యద చాలా విలక్షణమైన కావ్యం. మనుచరిత్ర, పారిజాతాపహరణం వచ్చిన కాలంలోది ఇది. ఐనా వాటికీ, దీనికీ ఎంతో వ్యత్యాసం ఉంది.

1 comment: